మహేష్‌బాబు.. పాన్ ఇండియా లెవల్లో భారీ ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో ఒకరు. సినిమా సినిమాకు ఆయన తన ఇమేజ్ను, అభిమాణ గణాన్ని మరింతగా పెంచుకుంటూ పోతున్నారు. ఆయన నుంచి నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మహేష్ కొత్త సినిమా థియేటర్లలోకి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు మహేష్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా కొనసాగుతున్న మహేష్ పుట్టిన రోజు (ఆగస్టు 9) నేడు. దీంతో ఆయనకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మహేష్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా 24 ఏళ్లు కావొస్తోంది. అంతకుముందే బాలనటుడిగా ఆయన పలు సినిమాలు చేశారు. ఇన్నేళ్లయినా ఆయన అందం ఇసుమంత కూడా తగ్గలేదు. గౌతమ్ పక్కన నిలబడితే తండ్రిలా కాకుండా అన్నయ్యలా కనిపిస్తున్నారాయన. అయితే అందం కోసం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారాయన. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మహేష్ బాబు గతంలో ఒక వ్యాధితో సతమతమయ్యారు. మైగ్రేన్ సమస్యతో చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డారు మహేష్. అరుదైన వ్యాధితో బాధపడిన విషయాన్ని స్వయంగా ఆయనే గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మైగ్రేన్ నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్, ట్యాబ్లెట్లు కూడా వాడానని చెప్పారు మహేష్ బాబు. అయితే దీనికి ట్రీట్మెంట్ లేదని.. ఇది నయం కాని వ్యాధి అని చాలా మంది తనకు చెప్పారన్నారు. తలనొప్పితో తాను పడుతున్న బాధను చూడలేక నమ్రత డాక్టర్ సింధూజను కలసి చక్రసిద్ధ నాడీ వైద్యం చేయించారని.. దీంతో రెండు, మూడు నెలలకే మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందానన్నారు మహేష్. అప్పటినుంచి పెయిన్ కిల్లర్స్ మళ్లీ వేసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పుకొచ్చారు. నాడీ వైద్యం చేయించుకోవడానికి ముందు షూటింగ్స్ వల్ల రోజుకు నాలుగైదు గంటలే నిద్రపోయేవాడినని, కానీ ఈ ట్రీట్మెంట్ తర్వాత హాయిగా రోజంతా నిద్రపోతున్నానని మహేష్ వివరించారు.