iDreamPost

అభినవ్ కశ్యప్ పై లీగల్ చర్యలు తీసుకుంటాం – అర్బాజ్ ఖాన్

అభినవ్ కశ్యప్ పై లీగల్ చర్యలు తీసుకుంటాం – అర్బాజ్ ఖాన్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో దేశం యావత్తు నిర్ఘాంతపోయింది. ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన కారణాలు ఏమై ఉంటాయని సర్వత్రా చర్చ మొదలైంది. పోలీసులు కూడా ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ చేసిన ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. సుశాంత్ ఆత్మహత్యతో పాటు మరి కొందరు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించడానికి ఫిల్మ్ ఏజెన్సీలే కారణం అంటూ ఫేస్బుక్ ద్వారా బాంబ్ పేల్చారు. అభినవ్ కశ్యప్ పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ గురించి ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద చర్చ నడుస్తుంది. దానికి తోడు సల్మాన్ ఖాన్ ఫామిలీ మొత్తం తనను ఇబ్బంది పెట్టారని, తన కెరీర్ ను నాశనం చేసారంటూ పెద్ద దుమారమే రేపారు అభినవ్ కశ్యప్..సల్మాన్ ఖాన్ సోదరులు ఆర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ తనకు అవకాశాలు రాకుండా చేసారని బేషరమ్ మూవీ విడుదల కాకుండా అడ్డుకున్నారని అభినవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీనిపై సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ స్పందించారు. డైరెక్టర్ అభినవ్ కశ్యప్ పై కోర్టులో కేసు వేస్తామని నటుడు, దర్శక నిర్మాత అర్బాజ్ ఖాన్ స్పష్టం చేశారు.తమ కుటుంబమంతా అభినవ్ కశ్యప్ పై లీగల్ చర్య తీసుకుంటామని అర్బాజ్ ఖాన్ వెల్లడించారు. దబాంగ్-2 ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి అభినవ్ తో తాము కాంటాక్ట్ లో లేమని, ప్రొఫెషనల్ గా తాము విడిపోయామని అర్బాజ్ ఖాన్ స్పష్టం చేశారు. గతంలో కూడా అభినవ్ కశ్యప్ పై లీగల్ చర్యలు తీసుకున్నామని అర్బాజ్ ఖాన్ వెల్లడించారు.

కాగా అభినవ్ కశ్యప్ సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దబాంగ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దబాంగ్ 2 విషయంలో సల్మాన్ ఖాన్ కుటుంబానికి అభినవ్ కశ్యప్ కు అభిప్రాయ భేదాలు రావడంతో ఆ ప్రాజెక్టునుండి తప్పుకున్నారు. దాంతో దబాంగ్2 చిత్రానికి అర్బాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు. అప్పటినుండి సల్మాన్ కుటుంబంపై అభినవ్ కశ్యప్ ఆరోపణలు చేస్తు వస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి