iDreamPost
android-app
ios-app

తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి మోదీ: KTR

  • Published Jul 07, 2023 | 4:16 PMUpdated Jul 07, 2023 | 4:30 PM
  • Published Jul 07, 2023 | 4:16 PMUpdated Jul 07, 2023 | 4:30 PM
తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి మోదీ: KTR

తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ అని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణపై వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని, ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రులు జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను మోదీ నెరవేర్చలేదని, గుజరాత్‌లో రూ.20 వేల కోట్లతో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్న మోదీ ప్రభుత్వం తెలంగాణకు మాత్రమే కేవలం రూ.521 కోట్ల నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ ఏమైందన్నారు. శనివారం తెలంగాణ ప్రధాని మోదీ పర్యటనను బీఆర్‌ఎస్‌ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ, ప్రధాని మోదీ పాలనలో ఏదైనా పెరిగిందంటే నిరుద్యోగం, అప్పులు మాత్రమేనని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ అడ్డగోలు ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఆయన ఏ అర్హతతో తమపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో రాహుల్‌ హోదా ఏంటని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు.. ప్రధాని మోదీని, బీజేపీని ఎందుకు విమర్శించరని నిలదీశారు. గాంధీ భవన్‌లో గాడ్సే దూరాడని సెటైర్లు వేశారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి అని ఆరోపించారు. భూ దందాలు చేసే వ్యక్తులే ధరణిని వద్దంటున్నారని మండిపడ్డారు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మోసాలు ప్రజలకు తెలుసని అన్నారు. సీఎం కేసీఆర్‌ పోరాటాన్ని గుర్తించి ఇతర రాష్ట్రాల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని, తెలంగాణలో తాము మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి