iDreamPost

పవన్‌, చంద్రబాబుతో ఉంటే.. జనసేనకు మద్దతివ్వం: కాపు పెద్దలు, పవన్‌ అభిమానులు

పవన్‌, చంద్రబాబుతో ఉంటే.. జనసేనకు మద్దతివ్వం: కాపు పెద్దలు, పవన్‌ అభిమానులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. సంక్షేమ పాలనతో.. జనాల మదిలో చెరగని అభిమానాన్ని సంపాదించుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇక అధికార పార్టీని ఓడించడం కోసం.. విపక్షాలన్ని ఏకమవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో.. టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని ఇప్పటికే స్పష్టత వచ్చింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. పొత్తు ఉంటుందని కన్ఫామ్‌ చేశారు. స్కిల్‌ స్కామ్‌లో జైలుకు వెళ్లిన చంద్రబాబుతో పవన్‌ ములాఖత్‌ కావడం.. ఆ వెంటనే పొత్తుల గురించి ప్రకటన చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అవినీతి కేసులో జైలుకు వెళ్లిన బాబుకు మద్దతిఇవ్వడం ఏంటి.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏంటి అనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాపు పెద్దలు, చిరు, పవన్‌ అభిమానులు.. జనసేన అధ్యక్షుడికి భారీ షాక్‌ ఇచ్చారు.

చంద్రబాబుతో ఉంటే.. పవన్‌ కళ్యాణ్‌కు తమ మద్దతు ఉండదని కాపు పెద్దలు తేల్చి చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌.. సైకిల్‌ ఎక్కితే తమ మద్దతు ఉండదని తెగేసి చెప్పారు. బాబుతో నడిస్తే.. పవన్‌కు తమ మద్దతు ఉండదని స్పష్టం చేశారు. తమ మద్దతు కావాలంటే.. జనసేన ఒంటరిగా పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు. కాకినాడలో కాపు నేతల చర్చా గోష్టి నిర్వహించారు. దీనిలో కాపు పెద్దలు, న్యాయవాదులు, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా.. తమ మద్దతు కావాలంటే.. పవన్‌ సైకిల్‌ ఎక్కకూడదంటూ.. అల్టిమేటం జారీ చేశారు.