iDreamPost

డిజిటల్ కు ఓటేసిన శ్రీదేవి కూతురి సినిమా

డిజిటల్ కు ఓటేసిన శ్రీదేవి కూతురి సినిమా

థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అయోమయంలో నిర్మాతలు ఒక్కొక్కరుగా ఓటిటి బాట పడుతున్నారు. తెలుగులో ఈ పోకడ ఇంకా ఎక్కువగా మొదలుకాలేదు కానీ హిందీలో ఊపందుకుంటోంది. స్టార్లు నటించిన భారీ బడ్జెట్ ప్రాజెక్టులు సైతం డిజిటల్ కు జై కొడుతున్నాయి. ఈ 12న అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానాల గులాబో సితాబో ప్రైమ్ లో రానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ కోవలోకి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్ సక్సేనా-ది కార్గిల్ గర్ల్’ కూడా ఇందులో చేరిపోయింది. నెట్ ఫ్లిక్స్ తో డీల్ కుదుర్చుకుని త్వరలో టెలికాస్ట్ కు రెడీ అవుతోంది. సుప్రసిద్ధ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ బయోపిక్ గా ఆమె టైటిల్ తోనే రూపొందుతున్న ఈ మూవీ కోసం జాన్వీ చాలా కష్టపడింది.

నిజంగా ఫ్లైట్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందింది జాన్వీ కపూర్. దీని కోసం కొన్ని క్రేజీ ఆఫర్లు సైతం త్యాగం చేసింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయితే లాక్ డౌన్ కారణంగా గుంజన్ సక్సేనా ఇలా ఆన్ లైన్ రూపంలో రావడం తనకు బాధ కలిగించే విషయమే. కాని తప్పదు. పరిస్థితులు అలా ఉన్నాయి. శరన్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ జోహార్, జీ స్టూడియోస్ తో పాటు మరో ఇద్దరు భాగస్వాములు దీన్ని నిర్మించారు. ఒకవేళ కరోనా తాకిడి లేకపోయి ఉంటె గుంజన్ సక్సేనా ఖచ్చితంగా ఈ ఏప్రిల్ లోనే వచ్చేది. ఇప్పుడా అవకాశం లేకపోవడంతో నెట్ ఫ్లిక్స్ కి అమ్మేశారు. కార్గిల్ యుద్ధంలో హెలికాఫ్టర్ నడిపిన ధీశాలిగా గుంజన్ గురించి ఎన్నో సాహస గాథలు ఉన్నాయి.

వాటిని తెరపైకి తీసుకురావడానికి యూనిట్ చాలా కష్టపడింది. టెలికాస్ట్ చేసే డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు కానీ ఈ నెలాఖరు కానీ లేదా జులై మొదటివారంలో ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఊపందుకునేలా ఉంది. అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్ ని హాట్ స్టార్ డిస్నీ 150 కోట్లకు డీల్ చేసుకుందన్న వార్త ఇప్పటికే బాగా ప్రచారమయ్యింది. ప్రొడక్షన్ టీమ్ నుంచి ఇంకా అఫీషియల్ న్యూస్ రాలేదు. దీంతో పాటు మరికొందరు నిర్మాతలు థియేటర్ల కోసం వేచి చూడలేక ఓటిటి వైపు మొగ్గు చూపుతున్నారు. జాన్వీ కపూర్ కి ఫుల్ లెన్త్ రోల్ లో గుంజన్ సక్సేనా రెండో సినిమా. ధడ్కన్ తర్వాత ఏరికోరి మరీ దీన్ని ఎంచుకుంటే ఇదేమో ఇలా నెట్టింట్లోకి వచ్చేస్తోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి