iDreamPost

ఓటిటి పెడుతున్న చిచ్చు మాములుగా లేదు

ఓటిటి పెడుతున్న చిచ్చు మాములుగా లేదు

థియేటర్లు ఓటిటిల మధ్య వ్యవహారం మరోసారి భగ్గుమంది. టక్ జగదీష్ వచ్చే నెల 10న అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియర్ కాబోతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇందాక తెలంగాణా ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రెస్ మీట్ నిర్వహించారు. తాము అక్టోబర్ దాకా ఓటిటిలకు సినిమాలు ఇవ్వొద్దని చెప్పినా కూడా కొందరు నిర్మాతలు పెడచెవిన పెట్టారని, ఇప్పుడు పండగ అడ్వాంటేజ్ ని కూడా వదలకుండా లవ్ స్టోరీ థియేట్రికల్ రిలీజ్ కు పోటీగా టక్ జగదీష్ ని డిజిటల్ లో విడుదల చేయడం ఎంతవరకు సబబని సునీల్ నారంగ్ తో పాటు పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తమ ఆవేదనను గట్టిగానే వ్యక్తం చేశారు.

నిజానికి అమెజాన్ ప్రైమ్ ఎలాంటి అఫీషియల్ నోట్ ఇంకా ఇవ్వలేదు. ప్రమోషన్లకు ప్లాన్ చేసుకుని ట్రైలర్ ని సిద్ధం చేసుకుంటున్న తరుణంలో డేట్ కి సంబంధించిన లీక్ బయటికి వచ్చేసింది. దీంతో లవ్ స్టోరీ ఆల్రెడీ సెప్టెంబర్ 10కి ఫిక్స్ చేసినప్పుడు మళ్ళీ నాని సినిమాను ఎలా ఓటిటిలో అదే రోజు ఇస్తారని వాళ్ళ వెర్షన్. మాస్ట్రో, నారప్ప డీల్స్ తమ విన్నపానికి ముందే జరిగిపోయాయి కాబట్టి వాటి ప్రస్తావన తీసుకురావడం లేదని చెప్పడం గమనార్హం. మాస్ట్రో సైతం 10వ తేదీనే డిస్నీ హాట్ స్టార్ ప్లాన్ చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్ ఉంది కానీ ఇంకా ఆ క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి జగదీష్ రేపిన మంటలు మాములుగా లేవు.

నానిని టార్గెట్ చేయడం పట్ల మాత్రం సునీల్ నారంగ్ తప్పు పట్టారు. హీరో కేవలం నటిస్తారని దాన్ని ఎలా ఎవరికి అమ్మాలనే నిర్ణయం నిర్మాత తీసుకుంటాడు కాబట్టి ఇక్కడ హీరోని నిందించాల్సిన పని లేదన్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య డిస్ట్రిబ్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని మాత్రం ఇక్కడ అర్థమవుతోంది. టక్ జగదీష్ నిర్మాత తనను కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదని సునీల్ నారంగ్ చెప్పడమే దీనికి నిదర్శనం. మొత్తానికి ఇప్పుడు ప్రైమ్ నాని సినిమాను 10 నుంచి పోస్ట్ పోన్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి మరి

Also Read : 11 ఏళ్ళ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి