iDreamPost

బలరాం టార్గెట్ పర్చూరేనా..?

బలరాం టార్గెట్ పర్చూరేనా..?

వైఎస్సార్‌సీపీకి బలమైన జిల్లాగా పేరుగాంచిన ప్రకాశం జిల్లాలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి 27వేల భారీ మెజార్టీతో గెలిచారు. నెల్లూరు లోక్‌సభలో భాగమైన కందుకూరులోనూ లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌ రెడ్డికి దాదాపు 30 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది.

ప్రకాశంలో 2014 ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని భావించిన వైఎస్సార్‌సీపీకి చుక్కెదురైంది. మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 12 సీట్లకు గాను వైఎస్సార్‌సీపీ 6 స్థానాలనే గెలుచుకుంది. ఇక 2019లో జగన్‌ హవాతో 12 సీట్లకు గాను 12 గెలుస్తామని ఆ పార్టీ నేతలు ఆశించగా నాలుగు స్థానాలు మిస్‌ అయ్యాయి. చీరాల, అద్ధంకి, పర్చూరు, కొండపి నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. చీరాల, అద్ధంకిల్లో టీడీపీ అభ్యర్థులు కరణం బలరాం, గొట్టిపాటి రవిలు తమ సొంత బలంతో గెలిచారు.

పర్చూరులో ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టిక్కెట్‌ ఇచ్చారు. బలమైన నేత అనే భావనతో అప్పటి వరకూ కో ఆర్డినేటర్‌గా ఉన్న రావి రామనాథం బాబును కాదని వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇవ్వగా ఆయన విఫలయ్యారు. ఎన్నికల తర్వాత దగ్గుబాటి సైలెంట్‌ అయ్యారు. దీంతో పర్చూరు కో ఆర్డినేటర్‌గా రావి రామనాథం బాబునే వైఎస్సార్‌సీపీ తిరిగి నియమించింది. డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది.

Read Also : కరణం బలరాం వైఎస్సార్‌సీపీలో అధికారికంగా చేరుతారా..?

గత ఎన్నికల్లో ఓడిపోయిన నాలుగు నియోజకవర్గాల్లోనూ బలపడాలని వైఎస్సార్‌సీపీ ప్రణాళికలు రచిస్తోంది. 2024లో జిల్లాను స్వీప్‌ చేయాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చీరాలలో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతను పార్టీలోకి చేర్చుకుంది. ఇక అద్ధంకి, పర్చూరులో బలపడేందుకు కరణం బలరాంను ఉపయోగించుకుంటుంది. కరణం అంతకు ముందు అద్ధంకి నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన గొట్టిపాటికి అద్ధంకి టిక్కెట్‌ దక్కడం, చీరాలో సమీకరణాలు మారడంతో బలరాం చీరాలకు వచ్చి పోటీ చేశారు. ఇప్పుడు బలరాం వైఎస్సార్‌సీపీలో చేరడంతో అటు చీరాలతోపాటు, అద్ధంకి, పర్చూరులోనూ పార్టీ బలపడుతుందని వైఎస్సార్‌సీపీ అంచనా వేస్తోంది.

పర్చూరులో కమ్మ సామాజికవర్గానిదే ఆధిపత్యం. 2014 ఎన్నికల్లో బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గొట్టిపాటి భరత్‌ను వైఎస్సార్‌సీపీ పోటీలోకి దింపినా.. విజయం అందుకోలేకపోయింది. 2019 ఎన్నికల్లో అభ్యర్థిని మార్చినా అదే సీన్‌ రిపీట్‌ అయింది. దీంతో పర్చూరులో నాయకత్వ మార్పు చేయాలని వైఎస్సార్‌సీపీ ప్లాన్‌ చేస్తోంది. మరో వైపు బలమైన రాజకీయ నేపథ్యం, అనుచరగణం ఉన్న కరణం బలరాం తన కుమారుడును రాజకీయంగా నిలదొక్కుకునేలా చేసేందుకు 2014 నుంచీ ప్లాన్‌ చేస్తున్నారు. 2014లో అద్ధంకి నుంచి తాను తప్పుకుని కుమారుడు వెకంటేష్‌ను రంగంలోకి దించారు. గొట్టిపాటి రవిపై వెంకటేష్‌ ఓడిపోయారు.

2019లో కరణం వెంకటేష్‌ పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. నియోజకవర్గం మారడంతో కరణం బలరాం పోటీ చేయాల్సి వచ్చింది. రాబోవు ఎన్నికల్లో కుమారుడును ఎలాగైనా ఎమ్మెల్యేగా చేసి రాజకీయ ప్రయాణానికి మార్గం సుమగం చేయాలనే ప్లాన్‌తో కరణం ఉన్నారని విశ్లేషకుల చెబుతున్నారు. అధికార పార్టీలో చేరి 2024లో తన కుమారుడును పర్చూరు నుంచి పోటీ చేయించాలని బావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి కూడా గడిచిన రెండు ఎన్నికల్లోనూ పర్చూరులో ఓటమే ఎదురైంది. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకత్వం కూడా పర్చూరులో బలమైన నేతను కో ఆర్డినేటర్‌గా నియమించాలని కొద్ది నెలలుగా యోచిస్తోంది. ఇప్పుడు బలరాం చేరికతో.. పర్చూరు బాధ్యతలు ఆయన కుమారుడుకు ఇచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి