iDreamPost

శాసనమండలిని రద్దు చేయవలసిన అవసరం ఉందా?

శాసనమండలిని రద్దు చేయవలసిన అవసరం ఉందా?

రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి తుదినిర్ణయానికి శాసనసభ, శాసన మండలిలో చర్చ జరుగుతుంది. శాసన సభలో స్పష్టమైన ఆధిక్యత ఉన్న వైసీపీకి శాసనమండలిలో టీడీపీ కి ఉన్న ఆధిక్యతతో చికాకులు కలుగుతున్నాయి. గతంలో ఇంగ్లీష్ మీడియం బోధన మీద ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి తిరస్కరించి వెనక్కి పంపింది.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని విభజన బిల్లు శాసనసభ ఆమోదం పొందింది. ఈ బిల్లును శాసనమండలిలో చర్చించి రేపటి లోపల ఆమోదం తెలపవలసి ఉంది. టీడీపీకి ఆధిపత్యం ఉన్న శాసనమండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనే అనుమానాల మధ్య అసలు శాసనమండలినే ప్రభుత్వం రద్దు చేస్తుందా అనే చర్చ నడుస్తుంది.

శాసనమండలిలో బలాబలాలు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 58 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 55 మందిలో టీడీపీ 26,నామినేటెడ్ 8(టీడీపీ వ్యక్తులు), వైసీపీ 9, వామపక్ష-పీడీఎఫ్ కు 5, బీజేపీ 3, కాంగ్రెస్ కు 1,ఇండిపెండెంట్లు(టీచర్స్ కోటా)3 ఉన్నారు.

ఈ బలాబలాలు చూస్తే టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది. కానీ ఈ ఉదయం టీడీపీకి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయడం,మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి సభకు హాజరు కాకపోవటం చూస్తే టీడీపీ ఎమ్మెల్సీలందరు ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా?

Read Also: అమరావతి – మాణిక్య వరప్రసాద్ రాజీనామా

టీడీపీ ఎమ్మెల్సీలలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు,శివనాథ రెడ్డి గత నెలలో కూడా వైసీపీలో చేరే ప్రయత్నం చేసారు. మరో టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సొంత అన్న మస్తాన్ రావు గత నెలలో వైసీపీలో చేరి ఇప్పుడు రాజ్యసభ రేసులో ముందున్నారు. సీనియర్ నేత మాజీ కాంగ్రెస్ నాయకుడు కంతేటి సత్యనారాయణ రాజు ప్రస్తుతం బీజేపీ లో ఉన్నా ప్రభుత్వ నిర్ణయానికి ఓటు వేయరని అయన అనుచరులు చెప్తున్నారు.

పీడీఎఫ్ కు చెందిన లక్ష్మణ్ రావు, శ్రీనివాస రెడ్డి, బాల సుబ్రహ్మణ్యం, రాము సూర్యారావు తటస్థంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇండిపెండెంట్ సభ్యుల్లో కత్తి నరసింహారెడ్డి, రఘువర్మ ప్రభుత్వానికి అనుకూలంగాను, ఏఎస్ రామకృష్ణ వ్యతిరేకంగాను నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Read Also: సైబరాబాద్ నుండి – అమరావతి వరకు

మొత్తంగా చూస్తే ఓటింగ్ అంటూ జరిగితే టీడీపీ ఎమ్మెల్సీలందరూ ఆ పార్టీ నిర్ణయం మేరకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు తక్కువ. ప్రస్తుతం శాసనమండలి రద్దవుతుంది అన్న అనుమానాల మధ్యలో చాలామంది ఎమ్మెల్సీలు తమ పదవి కాపాడుకోవడం కోసం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని సంకేతాలిస్తున్నారు.

శాసనమండలి అధికారాలు – నిబంధనలు

శాసనమండలి అధికారాలు చాలా పరిమితమైనవి. ఏదైనా బిల్లుని శాసనమండలి ఆమోదించవచ్చు లేదా మార్పలు సూచిస్తూ, సవరణలు ప్రతిపాదించి తిరిగి అసెంబ్లీకి పంపవచ్చు. అసెంబ్లీ సవరణల మీద చర్చించి, వాటిని బిల్లులో చేర్చడం కానీ, లేదా సవరణలు తిరస్కరించి, బిల్లును యథాతథంగా తిరిగి మండలికి పంపాల్సి ఉంటుంది. మండలి,రెండోసారి కూడా ఆ బిల్లును తిరస్కరిస్తే అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ,మండలి తిరస్కరించిన బిల్లుని మూడు నెలల తర్వాతనే తిరిగి శాసనమండలికి పంపగలుగుతుంది. అంటే ప్రభుత్వం ఒక బిల్లు ఆమోదానికి కనీసం మూడు నెలలు వేచిఉండాలి. రాజధాని వికేంద్రీకరణ బిల్లుమీద జగన్ ప్రభుత్వం వేచి చూస్తుందా? ఇప్పుడు చర్చ జరుగుతున్న రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఈ నిబంధన వర్తిస్తుంది.

Read Also: స్పీకరే వాకౌట్..

పైన చర్చించినది “సాధారణ” బిల్లులకు సంబంధించిన నిబంధనలు.. ఆర్ధిక వ్యవహారాలతో ఉన్న బిల్లును “ద్రవ్య బిల్లు” అంటారు. ద్రవ్య లేక మనీ బిల్లును శాసనమండలి తిరస్కరించినా దానికి ప్రాధాన్యత లేదు. శాసనమండలి తిరస్కరించిన ద్రవ్యబిల్లులు శాసనసభ ఆమోదించిన 14 రోజుల్లోపు ఆటోమేటిక్ గా ఆమోదం పొందినట్టుగా పరిగణించబడతాయి. అంటే ద్రవ్య బిల్లుల విషయంలో శాసనమండలిది అభిప్రాయమే కానీ, నిర్ణయం కాదు.

ఒక్క బిల్లు కోసమే రద్దా ?

ఒక బిల్లుకోసమే శాసనమండలిని రద్దు చేసే పరిస్థితి రాజకీయంగా లేదు. జిల్లాకి ముగ్గురు నలుగురు చొప్పున అనేకమంది వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ పదవికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు మంత్రి పదవులిచ్చి వారిని ఎమ్మెల్సీలుగా చట్టసభలో సభ్యులను చేసారు. శాసనమండలి రద్దయితే ముందుగా నష్టపోయేది ఈ ఇద్దరే.టీడీపీకి అతి పెద్ద నష్టం లోకేష్ కి పదవీ వియోగం…యనమల రామకృష్ణుడు ఏ పదవికి లేకుండా పోతుంది, ఫిబ్రవరిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కూడా టీడీపీ ఒక్క సీటు గెలవటం కష్టమే.

2007లో శాసన మండలి ఏర్పాటు మీద జరిగిన చర్చలో మండలి ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి తాము అధికారంలో వచ్చిన వెంటనే మండలిని రద్దు చేస్తానన్న చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also: చేతులెత్తి వేడుకుంటున్నా.. చంద్రబాబు

నిబంధనలు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్న శాసనమండలిని రద్దు చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈపాటికే డ్రాఫ్ట్ సిద్ధమైందని ప్రచారం జరుగుతుంది. ఈ సాయంత్రం, శాసనమండలిని రద్దుచేస్తూ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి తీర్మానాన్ని గవర్నర్ కి పంపుతారని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రమంత్రివర్గ తీర్మానాన్ని, కేంద్ర కేబినెట్ కి పంపవలసి ఉంటుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి బిల్లును పంపుతారు. ఈ బిల్లుమీద పార్లమెంటులో జరిగే చర్చకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. కేబినెట్ నిర్ణయమే తుది నిర్ణయం. గతంలో 1985లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయంలో అప్పటి రాజీవ్ గాంధి ప్రభుత్వం రాష్ట్ర నిర్ణయాన్ని అంగీకరిస్తూ శాసనమండలి ని రద్దు చేసింది.శాసనమండలిని రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కేంద్రం నుండి ప్రతిబంధకాలు ఎదురుకాక పోవచ్చు. 

విభజన తీర్మానాన్ని మండలి ఆమోదిస్తుందా? లేదా శాసనమండలి రద్దు జరుగుతుందా? సమాధానం మరికొన్ని గంటల్లో తెలుస్తుంది. కానీ రాజధాని విభజన జరగడం అనివార్యంగా కనిపిస్తుంది…రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్,కోర్టులో అడ్డుకుంటామని చేసిన వాదనలకు ఇపుడు జరుగుతున్న వాదనలకు తేడా లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి