iDreamPost

ఈ విషయం బాబుకు తెలియదనుకోవాలా…?

ఈ విషయం బాబుకు తెలియదనుకోవాలా…?

ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధానిగా అమరావతి ఉండాలని డిమాండ్‌ చేస్తున్నమాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన డిమాండ్‌ను బలపర్చేందుకు సరికొత్త వాదనను తెరమీదకు తెస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం, తన నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి విశాఖకు వెళ్లాలంటే చాలా దూరమని తెలియజేస్తున్నారు. 18 నుంచి 24 గంటల ప్రయాణం చేయాలని, అక్కడకు వెళ్లిన తర్వాత ఎక్కడ పడుకోవాలో తెలియదంటున్నారు. దక్షిణ భారత్‌ దేశంలోని నాలుగు రాష్ట్ర రాజధానుల కంటే తమకు విశాఖ దూరమని రాయలసీమ ప్రజలు అంటున్నారంటూ చంద్రబాబు సెలవిచ్చారు.

9 ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా, దాదాపు 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞడు, దేశంలోనే సీనియర్‌ రాజకీయ వేత్త, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టిన చంద్రబాబుకు దక్షిణ భారత దేశంలోని నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాజధానులు ఆయా రాష్ట్రాలకు ఓ మూలన, అన్ని ప్రాంతాలకు సుదూరంగా ఉన్న విషయం తెలియదనుకోవడం ఆయన మాటలు విశ్వసించే వారి అజ్ఞానానికి పరాకాష్ట. ఆయా నగరాలు రాజధానులుగా ఎలా వర్థిల్లుతున్నాయో ఆర్థిక వేత్త, ఆర్థిక శాస్త్రంలో ఎం.ఫిల్‌ చదవిన చంద్రబాబుకి తెలియదనుకోవడం మన పొరపాటే అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ కోసం ఏకంగా దేశ ప్రధాని పదవినే వదులుకున్న చంద్రబాబుకి దక్షిణ భారత దేశ రాష్ట్రాలు, వాటి రాజధానుల మధ్య దూరం, అంత దూరం ఉన్నా అవి రాజధానులుగా రాణిస్తున్న విషయం నిజంగా తెలియకపోవచ్చు. బహుశా ఆయన తన జీవితాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం త్యాగం చేశారు కాబట్టి తెలియకపోయి ఉండొచ్చు. అందుకే చంద్రబాబు ఇప్పుడైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి ఉద్యమంలో ఆయనకు తీరిక లేకపోతే టీడీపీ నేతలైనా ఆయకు ఈ విషయం తెలియజేయాలి.

బాబు చెప్పినట్లు ఎంత దూరం..?

మంత్రాలయం నుంచి విశాఖ 782 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే జిల్లా కేంద్రం కర్నూలు నుంచైతే 691 కిలోమీటర్ల దూరంలో విశాఖ ఉంది. ఇక విశాఖపట్నం– కుప్పం నుంచి 952 కిలోమీటర్లు దూరంలో ఉండగా, జిల్లా కేంద్రమైన చిత్తూరు 831 కిలోమీటర్ల దూరంలో ఉంది.

నాలుగు రాష్ట్రాలల్లో రాజధానుల పరిస్థితి..?

తమిళనాడు రాజధాని చెన్నై బాబు గారు చెప్పినట్లు ఆ రాష్ట్రంలోని జిల్లాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమే కాదు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా దగ్గరగా ఉంటుంది. అయితే తమిళనాడు రాజధాని ఆ రాష్ట్రానికి మధ్యన ఉందా..? అంటే లేదు. తమిళనాడుకు ఓ మూలన రాజధాని చెన్నై కేంద్రీకృతమై ఉంది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కేంద్రం నుంచి రాజధాని చెన్నైకు 707 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరునల్‌వేలి జిల్లా కేంద్ర నుంచి చెన్నైకు రావాలంటే 624 కిలోమీటర్లు ప్రయాణించాలి.
 

కర్ణాటక రాజధాని బెంగుళూరు కూడా ఆ రాష్ట్రంలోని ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉంటుంది. కర్ణాటకలోని బీదర్‌ జిల్లా కేంద్రం నుంచి రాజధాని బెంగుళూరుకు మధ్య 676 కిలోమీటర్ల దూరం ఉంది. కలబురగీ జిల్లా కేంద్రం నుంచి 585 కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు ఉంది.

మహారాష్ట్ర రాజధాని ముంబై కూడా ఆ రాష్ట్రానికి ఒక అంచున, సముద్రతీరానికి అనుకుని ఉంది. ఆ రాష్ట్రంలోని చంద్రపుర జిల్లా కేంద్రం నుంచి ముంబైకి చేరుకోవాలంటే 861 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఇక గడ్చిరోలి జిల్లా కేంద్రం నుంచి అయితే ఎకంగా 941 కిలోమీటర్ల దూరంలో రాజధాని ముంబై ఉంది. ఈ రెండు ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకోవాలంటే రాత్రి, పగలు ప్రయాణించాలి. అమరావతి జిల్లా నుంచి ముంబై మధ్య 630 కిలోమీటర్ల దూరం ఉంది.

కేరళ రాష్ట్రం రాజధాని తిరువనంతపురం సముద్రతీరం ఆనుకుని ఓ మూలన ఉంది. ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి కాసరాగడ్‌ మధ్య 576 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల నుంచి రాజధాని తిరువనంతపురానికి మధ్య దూరం శ్రీలంక– తిరువనంతపురం మధ్య దూరం కన్నా ఎక్కువగా ఉన్న విషయం చంద్రబాబుకు తెలిసినా.. ఒక వేళ మరచిపోయి ఉంటే ఇప్పుడైనా మననం చేసుకోవాలి.

రాజధాని నుంచి ఆశించేదేమిటీ..?

ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉన్న అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంద కాబట్టి, అనువైన ప్రాంతమని చంద్రబాబు అంటున్నారు.ఇది నిజమే.. అయినా అసలు ఏ రాష్ట్ర రాజధాని నుంచైనా ఆ రాష్ట్ర ప్రజలు కొరుకునేది ఏమిటి..? దగ్గరగా ఉందనా..? లేక ఉపాధి, ఉద్యోగవకాశాలు కావాలనా..? దేశ రాజధాని లేదా రాష్ట్రాల రాజధానుల నుంచి ప్రజలు ఆశించేంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మాత్రమేనన్నది జగమెరిగిన సత్యం. అందుకే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల రాజధానులు ఆయా రాష్ట్రాలకు ఓ మూలన ఉన్నా కూడా ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాయి.

శ్రీకాకుళం నుంచి హైదరాబద్‌కు వలస ఎందుకు..?

రాజధాని ఎంత దూరం ఉన్నా సరే అక్కడ జీవనోపాధి దొరికితే ప్రజలు వెళతారన్న విషయం శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఇప్పటికీ భారీగా జరుగుతున్న ప్రజల వలసలు స్పష్టం చేస్తున్నాయి. రాజధానిలో ఉండే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకే కాదు ధనవంతులకు కూడా ఎలాంటి పని ఉండదు. కేవలం రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు సచివాలయం, అసెంబ్లీతో పని ఉంటుందన్న విషయం చంద్రబాబుకు, మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారికి తెలియందీ కాదు.

హైదరాబాద్‌ అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ ఉన్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలే ప్రధాన కారణమని హైదరాబాద్‌ను నిర్మించి, ప్రపంచ పటంలో పెట్టిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియదంటే అతిశయోక్తి కాదు. తన వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని, ఉపాధి, ఉద్యోగాలు కల్పించానని ఇప్పటికీ ఆయన సందర్భం దొరికిన ప్రతి సారి వల్లెవేస్తుంటారు.

జీవన వ్యయం అందుబాటులో ఉందా..?

రాజధాని నగరమైనా, లేక మరో నగరమైనా.. అభివృద్ధి చెందేందుకు అక్కడ జీవన వ్యయం సామాన్యులకు అందుబాటులో ఉండడం మరో ప్రధానమైన అంశం. ఇలాంటి పరిస్థితి అమరావతిలో ఉందో..? లేదో..? చంద్రబాబుకు బాగా తెలుసు. మూడేళ్ల క్రితమే 2017లో విజయవాడలో ఇంటి అద్దెలు పెంచేస్తున్నారని, తగ్గించాలని స్వయంగా సీఎం హోదాలో చంద్రబాబు కోరిన విషయం ఆయన మర్చిపోయి ఉన్నా ప్రజలకు మాత్రం బాగా గుర్తుంది.

హైదరాబాద్‌లాగే తమిళనాడు రాజధాని చెన్నై, కర్ణాటక రాజధాని బెంగుళూరు, మహారాష్ట్ర రాజధాని ముంబై, కేరళ తిరువనంతపురం.. ఈ నగరాలు ఆయా రాష్ట్రాలకు సూదూరంగా ఉన్నా రాజధానులుగా ప్రజల మన్ననలు పొందాయంటే కేవలం అక్కడ లభించే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మాత్రమేననడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిలాగే అమరావతి ప్రజలను అక్కున చేర్చుకుంటుందా..? అయితే ఈ ఐదేళ్లలో ఎంత మంది అమరావతికి ఉపాధి, ఉద్యోగం కోసం వెళ్లారో సీమ ప్రజలను రెచ్చకొడుతున్న చంద్రబాబు చెప్పాల్సి ఉంటుంది.

ఇప్పటికైనా మారాలి బాబు…

రాష్ట్రం విడిపోక ముందు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని యువత, ప్రజలు ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వెళుతున్నారు. కేవలం హైదరాబాద్‌కే కాదు చెన్నై, బెంగుళూరు, ముంబై నగరాలలో ఏపీ యువత ఉద్యోగాలు చేస్తుండడం గమనార్హం. ఉమ్మడి రాజధాని హైదరాబద్‌కు 740 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం జిల్లా ఉంది. అయినా వారు ఎప్పుడూ తమకు రాజధాని దూరమని మాట్లాడలేదు. హైదరబాద్‌ తమకు ఉపాధినిస్తుందా..? లేదా.? అని మాత్రమే ఆలోచించారు. రాజధాని అంటే ఉపాధి, ఉద్యోగాలు కల్పించేదిగా ఉండాలి కానీ అది ఆ రాష్ట్రంలోని ప్రాంతాలకు ఎంత దూరంలో ఉందన్నది సమస్య కాదన్నది కాదనలేని సత్యం. ఇప్పటికైనా చంద్రబాబు తన మనసు మార్చుకుని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అసమానతలను తగ్గించేందుకు మూడు రాజధానులను, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తే ప్రజలు హర్షిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి