iDreamPost

తిరోగమన టీడీపీ

తిరోగమన టీడీపీ

ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం తీరే వేరు. నిర్మాణాత్మకంగా పటిష్టమైన పునాదులు ఆ పార్టీ సొంతం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంగా ఉన్నా పగడ్బందీగా వ్యవహరిస్తారు. బూత్ కమిటీ నుంచి పోలిట్ బ్యూరో వరకూ అదే పంథా. క్రమశక్షణతో సాగుతుంది. కేంద్రం నుంచి సమన్వయం.. క్షేత్రస్థాయిలో చైతన్యవంతమైన టి డి పీ కే సొంతం.

ఇప్పుడు ఇదంతా గతమేనా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ ధోరణిలో వస్తున్న మార్పులు అందుకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా నవ్యాంధ్రలో అయిదేళ్ల పాటు అధికారం చలాయించి, ప్రస్తుతం ప్రతిపక్షానికి పరిమితం అయింది. పైగా చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఓటమిని మూట గట్టుకుని పరాజితుడిగా టిడిపి మిగిలింది. ఆ తరువాత పరిణామాలే తెలుగుదేశం పార్టీని తిరోగమన దిశలో నడిపిస్తున్న టు స్పష్టం అవుతున్నాయి.

టీడీపీ తరుపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఇద్దరూ గుడ్బై చెప్పేశారు. గంటా శ్రీనివాసరావు సహా మరికొందరు ఎమ్మెల్యేలు పేరుకి టిడిపిలో ఉన్నారు. తెలుగుదేశం తరుపున గెలిచి ఆ పార్టీని వీడడం ఎంపీలకు సర్వ సాధారణమే అయినప్పటికీ, ఎమ్మెల్యేలు చేజారిపోవడం ఇటీవల పెరుగుతోంది. గతంలో 2011, 2012 లో కూడా కొందరు టిడిపి ఎమ్మెల్యేలు బాబుకి బైబై చెప్పి జగన్ చెంతకు చేరిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెద్ద సంఖ్యలోనే టిడిపిని ఎమ్మెల్యేలు వీడే సూచనలు బలపడుతున్నాయి.

అదే సమయంలో రాజధాని అంశం లో పార్టీ అధ్యక్షుడు తీరుతో కీలక నేతలంతా విభేదిస్తుండడం ప్రధాన అంశంగా మారుతోంది. రాజకీయంగా నిర్మాణపరమైన విషయాల్లో తెలుగు దేశం పార్టీ గత వైభవాన్ని విచ్చిన్నం చేసే ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గొంతు వినిపించేందుకు బుద్ధ వెంకన్న, పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, కనకమేడల రవీంద్ర కుమార్ వంటి వారు మాత్రమే మిగలడం తెలుగుదేశం దైన్యాన్ని చాటుతోంది. వీరిలో ఎవరికీ క్షేత్రస్థాయిలో ప్రజా బలం లేదు. కేవలం మీడియా ప్రచారం ద్వారా పాపులారిటీ కోసం ప్రయత్నించే నేతలే తెలుగుదేశానికి పెద్దదిక్కుగా మారుతున్నారు అంటే ఆ పార్టీ ఏ స్థాయిలో పతనం అవుతుందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

సీనియర్ నేతలు పార్టీ వైఖరితో విభేదించడం, ప్రధానంగా నారా లోకేష్ వైఖరి మూలంగా వీరంతా స్పందించేందుకు ముందుకు రాకపోవడంతో టీడీపీకి తిప్పలు తప్పడం లేదు. ఈ పరిస్థితులను చక్కదిద్దుకో లేకపోతే దూరమయ్యే వారు, మొఖం చాటేసే వారి కారణంగా విపక్షంగా టీడీపీ గడ్డు స్థితికి నెట్టబడే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి