iDreamPost

సీఎం జగన్‌ పిలుపునకు భారీ స్పందన

సీఎం జగన్‌ పిలుపునకు భారీ స్పందన

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి ఏపీలో తక్కువగానే ఉంది. ఢిల్లీ ఎఫెక్ట్‌ లేకపోతే కేసుల సంఖ్య 50 లోపే ఉండేది. కరోనాపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించడం, ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరించడం, పరీక్షలు చేయడం, అన్ని జిల్లాల్లోనూ పటిష్టంగా లాక్‌డౌన్‌ను అమలు పరుస్తుండంతో పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో వైరస్‌ ఉధృతి పెరిగితే.. దానిని కట్టడి చేయడానికి అదనపు సిబ్బందిని ప్రభుత్వం ముందస్తుగా నియమించుకుంటోంది.

సీఎం జగన్‌ ఇచ్చిన పిలుపునకు స్పందించి కోవిడ్‌ వలంటీర్లుగా పనిచేసేందుకు నర్సింగ్, మెడికల్‌ విద్యార్థులు, ప్రైవేటు, రిటైర్డు ఉద్యోగులు భారీగా స్పందిస్తున్నారు. ఇప్పటికే 8వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ అధికారులు దశల వారీగా ఆన్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బృందానికి నలుగురు వైద్య నిపుణుల ద్వారా శిక్షణ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఆసక్తి ధృవీకరణ పత్రం తీసుకున్న తర్వాత తదుపరి కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి హడావుడి లేకుండా, దరఖాస్తుదారుల మానసిక స్థితి, వారి సన్నద్ధతను బట్టి ఎంపిక చేసుకుంటారు. శిక్షణ పూర్తయిన తర్వాత అవసరాన్ని బట్టి ఆయా వ్యక్తుల అర్హతను బట్టి క్వారంటైన్‌ కేంద్రాలు, ఐసోలేషన్‌ గదులు, కోవిడ్‌ ఆస్పత్రుల్లో సేవలను వినియోగించుకుంటారు.

యూనిసెఫ్, కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులతో కూడిన బృందం దరఖాస్తుల ప్రక్రియను పర్యవేక్షిస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం మరో రెండు వైరాలజీ ల్యాబ్‌ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 7 వైరాలజీ ల్యాబోరేటరీలు ఉన్న విషయం తెలిసిందే. ఈ ల్యాబ్‌లలో రోజుకు 1,170 పరీక్షలు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న ల్యాబ్‌లతో కలసి రోజుకు 1,530 టెస్టులు చేసే వీలుంది. వీటికి అదనంగా మరో మూడు ప్రైవేటు ల్యాబ్‌లకు ప్రభుత్వం అనుమతించింది. త్వరలోనే ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి