iDreamPost

హైపవర్ కమిటీ తొలి భేటీ నేడు

హైపవర్ కమిటీ తొలి భేటీ నేడు

రాజధాని, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అంశాల పై ప్రభుత్వం నియమించిన జియన్ రావ్ కమిటీ మరియు బోస్టన్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన తుది నివేదికలను క్షుణ్ణంగా, కూలంకుషంగా అధ్యయనం చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27 న మంత్రి వర్గ తీర్మానం ద్వారా నియమించిన హైపవర్ కమిటీ ఈ రోజు తొలిసారిగా భేటీ అవ్వనుంది. విజయవాడలోని ఏపి సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. హైపవర్ కమిటీలో ఉన్న మొత్తం 10 మంది మంత్రులతో పాటు ఆరుగురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఒకపక్క అమరావతికి సంఘీభావంగా జరుగుతున్న ఆందోళనలకు మద్దతు ఇస్తున్న విపక్షాలు అమరావతినే రాజధాని గా కొనసాగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు జరగనున్న హైపవర్ కమిటీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

మాములుగా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిన్ననే హైపవర్ కమిటీ భేటీ జరగాల్సి ఉన్నప్పటికీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రుల్లో ఎక్కువ మంది తిరుమల శ్రీవారి దర్శనంలో ఉండడంతో ఆ భేటీ ఈ రోజుకి వాయిదా పడింది. అభివృద్ధి, అధికార వికేంధ్రీకరణలో భాగంగా రాష్ట్రంలో కార్యనిర్వాహక రాజధానిని, శాసన నిర్వాహక రాజధాని, న్యాయా పాలనా రాజధాని ఇలా మూడు రాజధానులుగా చెయ్యాలని జియన్ రావ్ కమిటీ సూచించడం, ఇదే సమయంలో ప్రభుత్వం నియమించిన ప్రఖ్యాత దిగ్గజ మేనేజిమెంట్ కన్సల్టింగ్ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా గ్రీన్ ఫీల్డ్ రాజధాని కంటే బ్రౌన్ ఫీల్డ్ రాజధానే బెటర్ అని సూచించడంతో ఈ రెండు కమిటీలను హైపవర్ కమిటీ సమగ్రంగా అధ్యాయనం తుది నివేదికను ప్రభుత్వానికి ఈ నెల 20 లోపు సమర్పించనుంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కన్వీనర్ గా ఉన్న ఈ హైపవర్ కమిటీలో సభ్యులుగా మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నాని లతో పాటు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డిజిపి గౌతమ్ సవాంగ్, సిసియల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి