iDreamPost

పెద్దలను ఎదిరించి.. ఒప్పించి ఒక్కటయ్యారు.. కానీ విధి వక్రించింది !

పెద్దలను ఎదిరించి.. ఒప్పించి ఒక్కటయ్యారు.. కానీ విధి వక్రించింది !

ప్రేమించుకున్నారు. పెళ్లి చేసేందుకు పెద్దలు అంగీకరించలేదు. సహజీవనం చేశారు. అమ్మాయి మూడు నెలల గర్భిణి కావడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు రాజీకి వచ్చి ఇద్దరికీ పెళ్లి చేశారు. కానీ విధి ఆ జంటను చూడలేకపోయింది. ఈర్ష్యతో పెళ్లికొడుకుని పెళ్లైన రాత్రే మృత్యువు కబళించింది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఎల్ ఎన్ పేట మండలం పెద్దకొల్లివలస గ్రామానికి చెందిన జమ్మాన పవన్ కుమార్ (20) తాపీమేస్త్రి. అదే గ్రామానికి చెందిన బలగ యోగీశ్వరితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. ఆరు నెలల కిందట యోగీశ్వరిని తన గ్రామానికి తీసుకొచ్చాడు పవన్. అప్పట్నుంచి సహజీవనం చేస్తున్నారు.

ప్రస్తుతం యోగీశ్వరి మూడు నెలల గర్భిణీ. రెండు నెలలుగా ఇరుకుటుంబాల పెద్దలు రాజీయత్నాలు సాగించారు. పెళ్లిజరిపించాల్సిందేనని పవన్ – యోగీశ్వరిలు చెప్పడంతో శుక్రవారం రాత్రి (జూన్ 17) ఇద్దరికీ వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. సింహాచలంలో శుక్రవారం రాత్రి పెళ్లి జరిగింది. శనివారం ఉదయం పెళ్లికూతురు యోగీశ్వరితో పాటు తల్లిదండ్రులు, బంధువులను విశాఖపట్నంలో బస్సు ఎక్కించి.. పవన్ కుమార్, యోగీశ్వరి తండ్రి బలగ సోమేశ్వరరావు బైక్ పై స్వగ్రామానికి బయల్దేరారు.

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపానికి వచ్చేసరికి వీరిని కంటైనర్ లారీ వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా సోమేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. పెళ్లైన మర్నాడే పెళ్లికొడుకు రోడ్డప్రమాదంలో మరణించడం.. రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నా.. విధి వక్రించిందని వాపోతూ.. బంధువులంతా గుండెలవిసేలా రోధిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి