iDreamPost

భయాలు పోగొట్టేందుకు ఏదీ ‘‘వ్యాక్సిన్‌’’..!

భయాలు పోగొట్టేందుకు ఏదీ ‘‘వ్యాక్సిన్‌’’..!

ప్రపంచమంతా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ అతి త్వరలోనే మన దేశంలో కూడా అందుబాటులోకి రానున్నట్లుగా ప్రభుత్వాల కదలికలను బట్టి అర్థమవుతోంది. వ్యాక్సిన్‌ పంపిణీకి చకచకా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్‌ – 19 వ్యాక్సిన్‌ కావాలనుకునే వారు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. రిజిస్ట్రేష‌న్ కోసం కో-విన్‌ యాప్‌ తీసుకొచ్చింది. త్వరలోనే టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ.. వ్యాక్సిన్‌ వేసుకుంటే కలిగే ప్రయోజనాలు, తలెత్తే దుష్పరిణామాలపై సరైన ప్రచారం కరువైనట్లు కనిపిస్తోంది. వ్యాక్సిన్‌ వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ ప్ర‌జల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించేందుకు కేంద్రం అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సందేహాలకు సమాధానమివ్వాలి..

కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలు బాగానే ఉన్నాయిగానీ.. వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో జరిగిన పొరబాట్లు, వాటిని తీసుకున్నవారిలో కనిపించిన, కనిపిస్తున్న దుష్ప్రభావాలు.. వ్యాక్సిన్లసామర్థ్యంపైన, భద్రత పైన సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ప్రజల్లో వ్యాక్సిన్ల భద్రతపై నెలకొన్న భయాందోళనలకు ప్రభుత్వాలు, ఔషధ నియంత్రణ సంస్థలు సమాధానమివ్వాల్సిన సమయమిది. కరోనాకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ల తయారీకి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నా.. అందులో పురోగతి సాధించినవి కొన్నే. వాటిలోనూ ప్రముఖమైనవి.. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌, అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా కంపెనీల వ్యాక్సిన్లు, రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి, రెండు చైనా వ్యాక్సిన్లు. ఇవన్నీ విదేశీ కంపెనీలవి. మనదేశానికి వస్తే.. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌, జైడస్‌-క్యాడిలా రూపొందించిన ‘జైకొవ్‌డి’ ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ఈ రెండిట్లోనూ భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకా మూడో దశ ప్రయోగాల్లోకి వచ్చింది. యూకే సర్కారు ఫైజర్‌ వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించి 80 ఏళ్లు పైబడినవారికి, వైద్య సిబ్బందికి, కేర్‌హోమ్స్‌ సిబ్బందికి ఇచ్చేస్తోంది కూడా. కానీ.. టీకా కార్యక్రమం ప్రారంభించిన 24 గంటల్లోనే ఇద్దరికి దానివల్ల అలర్జిక్‌ రియాక్షన్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది.

అసలు ఆందోళన ఇదే

మనదేశంలో తయారైన భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ మొదటి డోసు తీసుకున్న హరియాణా మంత్రి అనిల్‌ విజ్‌ రెండో డోసు తీసుకునే లోపే వైరస్‌ బారిన పడ్డారు. ఇలాంటివే ప్రజల సందేహాలకు, భయాలకు కారణమవుతున్నాయి. ఎన్నో ఏళ్లపాటు సాగాల్సిన పరిశోధనలను కేవలం ఏడాదిలోపే ముగించి వ్యాక్సిన్‌ తీసుకురావడంపై ప్రజల ఆందోళనకు కారణంగా తెలుస్తోంది. ఒకవేళ వ్యాక్సిన్‌ విఫలమై, దాన్ని తీసుకున్నవారు వైరస్‌ బారిన పడితే.. ఆ వైరస్‌ వ్యాక్సిన్‌ నిరోధకతను సంతరించుకుని మరింత బలపడే ప్రమాదం కూడా ఉంది. అదే జరిగితే చేతులారా ప్రపంచానికి పెను ముప్పు తెచ్చిపెట్టినట్టే. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాక్సిన్‌ ప్రయోగాలపై పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాకే వినియోగానికి అనుమతులు ఇవ్వాలని.. ఔషధ నియంత్రణ సంస్థలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని.. వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్‌ వేస్తున్నప్పుడు ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే వ్యాక్సినేషన్‌ ఆపాలని.. మెరుగైన వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలను కొనసాగించాలని కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాక్సినేషన్‌ కార్యక్రమంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి ముందుగా ప్రజలను సంసిద్ధం చేయాలని కూడా చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి