iDreamPost

యువతకు వ్యాక్సిన్ అందాలంటే మరో నెల ఆగాల్సిందే..!

యువతకు వ్యాక్సిన్ అందాలంటే మరో నెల ఆగాల్సిందే..!

దేశవ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ దానికి తగ్గట్టుగా సరఫరా లేదు. ఉత్పత్తి కూడా అంతంతమాత్రంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతున్న కోటా చాలా నామమాత్రంగా మిగులుతోంది. దాంతో అందరికీ వ్యాక్సిన్ అందించే అవకాశం లేదని ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం కూడా జూన్ నుంచి మాత్రమే 18 ఏళ్ల పైబడిన వారిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టమైన ప్రకటన చేసింది.

కేంద్రం నుంచి అరకొరగా వ్యాక్సిన్లు అందిస్తూ వాటిని అందరికీ పంచాలంటే సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే మొదటి విడత వ్యాక్సిన్ వేయించుకుని రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారి జాబితా పెరుగుతోంది. ముఖ్యంగా కోవ్యాగ్జిన్ రెండో డోసు కోసం అనేక మంది వెయిటింగ్ లో ఉన్నారు. మంగళవారం గన్నవరం ఎయిర్ పోర్టుకి లక్ష డోసుల వ్యాక్సిన్ రావడంతో వాటిని వెయిటింగ్ లో ఉన్న వారికి అందించే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత కొత్త వారికి వ్యాక్సిన్ అందించాలంటే కొంత సమస్యగా మారుతుంది. దానిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే క్యూ కనిపిస్తున్న తరుణంలో కొత్తగా అందరినీ రోడ్డు మీదకు తీసుకురావడం సమస్య అవుతుందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సిన్ పంపిణీ కోసం 18 ఏళ్ల పైబడిన వారిని పరిగణలోకి తీసుకుని, వారికి కూడా అందించాలనే లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది. వచ్చే నెల 1 నుంచి దానిని ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నాయి. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లో మాత్రం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. దాంతో వ్యాక్సిన్ డోసుల పంపిణీ విషయంలో సందిగ్ధంగా మారుతోంది. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలకు వ్యాక్సిన్ కోటాలో ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలను కేంద్రం ఎదుర్కొంటోంది. దానికి తగ్గట్టుగా ఆయా రాష్ట్రాల్లో 18 ఏళ్ల వారికి ప్రారంభించి, మిగిలిన రాష్ట్రాల్లో మొదలుకాకపోతే ఆ ఆరోపణలకు బలం చేకూరతుఉంది. దాంతో బీజేపీ పెద్దలు కూడా పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి, అందుబాటులో ఉన్న డోసులు సహా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారం ప్రారంభించే అవకాశం ఉంది. ఏపీలో మాత్రం మరో నెల రోజులు వేచి చూడక తప్పేలా లేదు.

Also Read : మహమ్మారికి మూకుతాడు.. సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి