iDreamPost

బుచ్చయ్య చౌదరి ఇలా మారిపోయారేంటి..?

బుచ్చయ్య చౌదరి ఇలా మారిపోయారేంటి..?

గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. సీనియర్‌ ఎమ్మెల్యేగా సుపరిచితులు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఏదైనా అంశంపై పూర్తి అవగాహనతో మాట్లాడతారనే పేరుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి శాసన సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు 74 ఏళ్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వయస్సు పైబడడమో లేదా ఎమ్మెల్యేగా గెలిచినా.. అధికారం లేదన్న ఆక్రోషమో గానీ.. బుచ్చయ్య చౌదరి ఇటీవల మాట్లాడుతున్న తీరు మునుపటికి భిన్నంగా ఉంటోంది. ఏ మాత్రం తర్కం లేకుండా, కనీస పరిజ్ఞానం లేకుండా ప్రభుత్వంపై బుచ్చయ్య చౌదరి చేస్తున్న విమర్శలు ఆయన గురించి తెలిసిన వారికి ఆశ్చర్యంగానూ, విడ్డూరంగానూ తోస్తున్నాయి.

తాజాగా బుచ్చయ్య చౌదరి కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రైవేటుకు ఇవ్వడం సరికాదని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీకి రాసిన లేఖపై విమర్శలు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు డబ్బులు చెల్లించి వ్యాక్సిన్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు.. అదే పనిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. అంతేకాకుండా.. ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించే బదులు అవి తెచ్చుకుంటున్న మాదిరిగా మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నామో జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ బుచ్చయ్య చౌదరి శెలవిచ్చారు.

ఈ రెండు వ్యాఖ్యలతోనే బుచ్చయ్య చౌదరి విషయ పరిజ్ఞానంపై సందేహాలు వస్తున్నాయి. వ్యాక్సిన్‌ విధానం గురించి బుచ్చయ్య చౌదరికి తెలుసో లేక తెలిసినా.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలని చేస్తున్నారో ఆయనకే తెలియాలి. దేశంలో కోవిషీల్డ్, కోవాక్జిన్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ విక్రయ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. కోవిషీల్డ్‌ ధర కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వానికి 300 రూపాయలు, ప్రైవేటు ఆస్పత్రులకు 600 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక కోవాక్జిన్‌ 150, 400, 1200 రూపాయల చొప్పన అమ్ముతున్నారు. ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్‌లో 50 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, మిగిలిన 50 శాతం మార్కెట్‌లో విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.

Also Read : పరిషత్‌ ఎన్నికలు మళ్లీ జరిగితే.. టీడీపీ పోటీ చేస్తదా..?

వ్యాక్సిన్‌ విక్రయ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ధరల్లో వ్యత్యాసం ఉన్నా.. ప్రజలపై భారం పడకూడదనే లక్ష్యంతో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 45 ఏళ్లు పైబడిన వారికే ఉచితంగా ఇస్తామని ప్రకటించగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్క వ్యక్తికి ఉచితంగా అందిచాలని నిర్ణయించుకుంది. భారమైనా.. ఆయా ఉత్పత్తి సంస్థల నుంచి వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇండెంట్‌లు కూడా పెట్టింది. అయితే ఫక్తు వ్యాపార ధోరణితో ఉంటే ఉత్పత్తి సంస్థలు.. ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాయా..? మార్కెట్‌ ధరను చెల్లిస్తే ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే అంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు భరించగలవా..? అనేది సీనియర్‌ అయిన బుచ్చయ్య చౌదరి ఆలోచించాలి.

తాజాగా బుచ్చయ్య చేసిన విమర్శనే ఆయన పార్టీ అధినేత చంద్రబాబు గతంలో చేశారు. ఆ సమయంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్య బుచ్చయ్య చౌదరికి కూడా వర్తిస్తుంది. వ్యాక్సిన్‌ కొనుగోలుకు అవసరమైన 1600 కోట్ల రూపాయలను చంద్రబాబు చేతికే ఇస్తాం.. ఆ వ్యాక్సిన్‌ ఏదో ఆయనే తన పరపతిని ఉపయోగించి తెప్పించాలన్నారు. ఉరికే వద్దని 10 శాతం కమీషన్‌ కూడా ఇస్తామని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఒక సారి గోరంట్ల గుర్తు చేసుకోవాల్సిన సమయమిది.

సారా వ్యాపారి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల ఇప్పుడు కూడా రియల్‌ ఎస్టేట్, ఇటుకల వ్యాపారం చేస్తున్నారు. స్వతహాగా వ్యాపారి అయిన గోరంట్లకు వ్యాక్సిన్‌ను ప్రైవేటుకు ఇవ్వడం వల్ల ఏర్పడే బ్లాక్‌ మార్కెటింగ్, ఇతర దుష్ప్రభావాలు తెలియనవి కావు. తన రాజకీయ వారసుడిగా సోదరుడు కుమారుడును ప్రకటించారు బుచ్చయ్య చౌదరి. సోదరుని కుమారుడు డాక్టర్‌గా పని చేస్తున్నారు. వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆస్పత్రులకు ఇవ్వకపోవడం వల్ల తమకు కూడా వ్యక్తిగతంగా నష్టం జరుగుతుందనే భావనతో బుచ్చయ్య చౌదరి.. ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంది. వ్యాపారిగా కాకుండా ప్రజా సేవకుడిగా బుచ్చయ్య చౌదరి ఆలోచిస్తే.. జగన్‌ లేఖలోని అసలు విషయం, ప్రజా శ్రేయస్సు కోసం జగన్‌ పని చేస్తున్న విధానం అర్థమవుతుంది.

Also Read : అచ్చెన్నా.. కొంచెం త‌గ్గితే మంచిద‌న్నా..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి