iDreamPost

ర‌హ‌స్యం లేని గండికోట ర‌హ‌స్యం – Nostalgia

ర‌హ‌స్యం లేని గండికోట ర‌హ‌స్యం – Nostalgia

1969లో వ‌చ్చిన గండికోట ర‌హ‌స్యం సినిమాలో ర‌హ‌స్యం ఏమీ ఉండ‌దు. ప్రేక్ష‌కుల‌కి ర‌హ‌స్యంగా ఉంటే దాన్ని ర‌హ‌స్య‌మంటారు కానీ, ప్రేక్ష‌కుల‌కి అంతా తెలిసిన‌ప్పుడు ఇంకేం ఉంది. అదే విఠ‌లాచార్య స్పెషాలిటీ. ఇష్ట‌మొచ్చిన‌ట్టు సినిమా తీసి స‌క్సెస్ చేస్తాడు. ఆయ‌న విజ‌య ర‌హ‌స్యం ఫార్ములాని ఫాలో కావ‌డం. ఎలాంటి కొత్త‌ద‌నం జోలికి వెళ్ల‌డు. అందుకే ఒకే క‌థ‌ను ఎన్నిసార్లు తీసినా జ‌నం క‌నుక్కోలేక పోయారు.

అందుకే 1964లో వ‌చ్చిన రాముడు భీముడుని జాన‌ప‌దంగా మార్చి గండికోట ర‌హ‌స్యం అని తీశాడు. ఒకే పోలిక‌లు ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు ఒక‌రి స్థానంలోకి ఇంకొక‌రు వెళ్ల‌డం. షేక్‌స్పియ‌ర్ ‘కామెడీ ఆఫ్ ఎర్ర‌ర్స్‌’ ద‌గ్గ‌రి నుంచి ఇది సూప‌ర్‌హిట్ ఫార్ములా. ఈ క‌థ స్క్రీన్ మీద ఎన్నిసార్లు హిట్ కొట్టిందో చెప్ప‌లేం.

గండికోట ర‌హ‌స్యంలో ఇద్ద‌రు ఎన్టీఆర్‌లు ఉంటారు. ఒకాయ‌న ప్ర‌భువు, ఇంకొక‌డు సామాన్యుడు. ప్ర‌భువు స్థానంలోకి సామాన్యుడు వెళ్లి , రాజ్యాన్ని బాగు చేసాడు. ఇదే క‌థ‌ని కొంచెం మీట‌ర్ మారిస్తే శంక‌ర్ ‘ఒకే ఒక్క‌డు’ అవుతుంది.

జ‌య‌ల‌లిత‌, దేవిక హీరోయిన్లు. దేవిక అప్ప‌టికే లావుగా మారిపోయింది. జ‌య‌ల‌లిత‌కే డ్యాన్స్‌లు, పాట‌లు ద‌క్కాయి. అప్ప‌ట్లో ఎన్టీఆర్ జ‌య‌ల‌లిత హిట్ పెయిర్‌. ఎన్టీఆర్‌కి అసిస్టెంట్ రాజ‌బాబు. ఆయ‌న‌కి ర‌మాప్ర‌భ జోడి. రేలంగి, ప‌ద్మ‌నాభం ఫేడ్ ఔట్ అయి, రాజ‌బాబు హ‌వా అప్పుడ‌ప్పుడే మొద‌లైన కాలం.

ఇక ఎన్టీఆర్ మారువేషాల‌కి కొదువే లేదు. గ‌డ్డం పెట్టుకుని స‌ర్దార్‌జీ వేషం. టోపీ పెట్టుకుని ఇంగ్లీష్ వాడి మారువేషం. దొర‌ల టోపీ పెట్టుకుని కీస‌ర‌బాస‌ర అని మాట్లాడితే (ఇంగ్లీష్‌) , అంత‌టి విల‌న్ రాజ‌నాల‌, ల‌వ‌ర్ జ‌య‌ల‌లిత ఇద్ద‌రూ క‌నిపెట్ట‌లేరు. ప‌ల్లెటూరి వాడికి ఇంగ్లీష్ ఎట్లా వ‌చ్చు, ఇవ‌న్నీ విఠ‌లాచార్యుని అడ‌గ‌కూడ‌దు. జ‌నం అడ‌గ‌లేదు. నోరు మూసుకుని , క‌ళ్లు తెరుచుకుని చూశారు. దాదాపు 3 గంట‌ల సేపు , బోలెడ‌న్ని అన‌వ‌స‌ర‌పు సీన్స్‌తో ఉంటుంది. ఆ రోజుల్లో ఎంత నిడివి ఉంటే అంత వినోదం జ‌నానికి.

ప‌డిశం ప‌ట్టిన వాడిలా , ముక్కుని ఒక వేలితో అదిమి పెట్టి మాట్లాడ‌టం ఎన్టీఆర్ మాన‌రిజం. అప్ప‌ట్లో ఇది పాపుల‌ర్‌. మా స్కూల్లో చాలా మంది ఇలా చేసి చీమిడి పూసుకునేవాళ్లు. సి.నారాయ‌ణ‌రెడ్డి రాసిన అన్ని పాట‌లు హిట్‌సాంగ్స్‌. టివి. రాజు కొన్ని సొంత ట్యూన్స్‌, కొన్ని హిందీ కాపీలు. గుర్రం మీద వేగంగా వెళుతూ ఉంటూ చ‌ల్ల‌టి గాలి త‌గులుతుంది. అల‌సిపోతే గుర్రం అల‌సిపోతుంది. కానీ ఎన్టీఆర్ , రాజ‌బాబు స్టూడియోలో చెక్క గుర్రాలు ఎక్కి కూడా చెమ‌ట తుడుచుకుంటూ ఉంటారు. అదే కామెడీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి