iDreamPost

మోడీకి తగిలిన రైతు ఉద్యమ సెగ, మొదటి సారి తీవ్రంగా సతమతమవుతున్న మోడీ సర్కారు

మోడీకి తగిలిన రైతు ఉద్యమ సెగ, మొదటి సారి తీవ్రంగా సతమతమవుతున్న మోడీ సర్కారు

తొలుత రైతు ఆందోళలను పెద్దగా ఖాతరు చేయలేదు. ఆ తర్వాత దాని మీద ఖలీస్తాన్ మద్ధతుదారులనే ముద్ర వేయాలని చూశారు. అయినా చల్లారకపోవడంతో దానిని కేవలం పంజాబ్ కే పరిమితం అని ప్రచారం చేయాలనుకున్నారు. కానీ తీరా చూస్తే ఉద్యమం పేరుతో ఢిల్లీని ముట్టడించిన రైతులు వెనక్కి తగ్గకపోవడంతో కేంద్రంలో కదలిక తప్పడం లేదు. పంజాబ్ దే ఉద్యమం అని చెప్పినా బీజేపీ పాలిత హర్యానా, ఉత్తరాఖండ్ లో కుతకుతలాడుతున్న రైతన్నల ఆందోళనలు కేంద్రాన్ని సతమతం చేస్తున్నాయి. యూపీలో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో రాజస్తాన్ రైతులు నేరుగా హస్తిన బోర్డర్ లో బైఠాయించారు. తాజాగా మహారాష్ట్ర నుంచి కూడా కర్షకులు కదిలిరావడంతో ఉద్యమ తీవ్రత పెరగడం మోడీకి తలనొప్పిగా మారింది.

మోడీ అధికారం చేపట్టిన దాదాపు ఏడేళ్ల తర్వాత రైతు ఉద్యమం మూలంగా కలిగినంత ఇబ్బంది ఆయనకు గతంలో ఎన్నడూ లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో అనేక రకాలుగా రైతు ఉద్యమాన్ని చల్లార్చే యత్నం చేసినా ఫలితం రాకపోవడంతో ఆయనే నేరుగా రంగంలోకి వచ్చారు. రైతుల ఉద్యమానికి మద్ధతుగా నిలుస్తున్న ప్రతిపక్షాల మీద ఘాటు విమర్శలు చేశారు. అదేసమయంలో మరో సీనియర్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు చర్చనీయాంశాలవుతున్నాయి. ఏడాది పాటు చట్టాల అమలు చేసి చూద్దాం..ఆ తర్వాత రైతులకు నష్టం వస్తే తామే వెనక్కి తీసుకుంటామంటూ చేసిన ప్రతిపాదన ఆసక్తిగా కనిపిస్తోంది. ఆయన కామెంట్స్ పై కొందరు రైతులు తీవ్రంగా స్పందించారు. ఒక ఏడాది పాటు మోడీ సర్కారు గద్దె దిగి చూడండి తెలుస్తుంది అంటూ సింఘీ బోర్డర్ వద్ద గడ్డకట్టిన చలిలో కూడా నిరసనలు కొనసాగిస్తున్న రైతులు వ్యాఖ్యానించారు.

వాస్తవానికి మోడీకి ప్రస్తుతం సందిగ్ధ స్థితి ఏర్పడింది. రైతు చట్టాలు ఉపసంహరణ జరిగే వరకూ తాము వెనక్కి వెళ్లేది లేదని ఆందోళనకారులు చెబుతున్నారు. నెల రోజులు గడుస్తున్నా ఉద్యమంలో వేడి తగ్గడం లేదు. చలికాలంలో కూడా సామాన్యులు పోరుబాటలో నడిరోడ్డున కొనసాగడం అందరినీ ఆలోచింపజేస్తోంది. మద్ధతు ధర విషయం, మండీల కొనసాగింపు వంటి వాటిపై మోడీ హామీలు ఇస్తున్నా రైతులు విశ్వసించడం లేదు. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విషయాల్లో మోడీ భావోద్వేగ ప్రకటనలకు లభించిన మద్ధతు ఇతర ప్రజల్లో ఈసారి కనిపించడం లేదు. ఇది కమలనాథులను కలచివేస్తోంది. చట్టాలను ఉపసంహరిస్తే కార్పోరేట్ శక్తుల నుంచి మోడీకి వ్యతిరేకత వస్తుంది. ముందుకెళితే రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో మోడీ ప్రభుత్వం ఇరకాటంలో పడినట్టు కనిపిస్తోంది.

నెల రోజులు దాటుతున్న ఉద్యమం తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తాజాగా హర్యానాలో ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు హెలీపాడ్ ని తవ్వేసి ఆయన పర్యటనను అడ్డుకున్నారు. ఉత్తరాఖండ్ లో ట్రాక్టర్లతో రైతులు బారీకేడ్ లు ధ్వంసం చేసేందుకు పూనుకున్నారు. ఇలా ఉద్యమ తీవ్రత విస్తరిస్తోంది. ప్రభుత్వాన్ని సతమతం చేస్తోంది. విపక్షాల మీద విమర్శలతో కాలయాపన చేసినా రైతుల ఆగ్రహం చల్లారేలా కనిపించడం లేదు. దాంతో మోడీకి ముందెన్నడూ ఎరుగని పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి సందిగ్ధ స్థితిలో మోడీ ఎంత సమర్థవంతంగా వ్యవహరిస్తారన్న దానిని బట్టి ఆయన నాయకత్వం మీద ప్రజాదరణ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి