iDreamPost

కుయ్‌.. కుయ్‌.. ఇక నిరంతరం

కుయ్‌.. కుయ్‌.. ఇక నిరంతరం

ప్రమాదంలో గాయపడిన వారిని సకాలంలో ఆస్పతికి తరలించకపోవడంతోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకువస్తే ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెబుతున్న మాట. ఈ విషయం రాజకీయ నాయకుడికి గానీ, సాదారణ ప్రజలకు గానీ పెద్దగా తెలియదు. అదే వైద్యుడైన రాజకీయ నాయకుడు పాలకుడైతే ప్రజలకు ఏంత మేలు చేయవచ్చునో దివంతగ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దేశానికి తెలియజేశారు. ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించేందుకు ఆయన చేసిన ఆలోచన దేశానికే ఆదర్శమైంది. ఆ ఆలోచనే 108.

వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన సంచార సంజీవని…

తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డాక్టర్‌ వైఎస్సార్‌ 108 వాహనాలను ప్రవేశపెట్టారు. ఆపదలో ఉన్నవారు 108 అనే నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు 20 నిమిషాల్లోపు ఘటనాస్థలికి వచ్చి వారికి సహాయం అందిస్తుంది. అప్పటికప్పుడు ప్రాథమిక వైద్యం అందించేందుకు అందులో డాక్టర్, టెక్నిషియన్‌ కూడా అందుబాటులో ఉంటారు. వైస్సార్‌ 108 ఆలోచన రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రాణదానం చేసింది. అందుకే ఇప్పటికీ 108 ద్వారా సహాయం పొందిన వారు వైఎస్సార్‌ను తలుచుకుంటున్నారు.

వైఎస్సార్‌ మరణం తర్వాత..

వైఎస్సార్‌ దివికేగిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొటిగా నీరుగార్చడం మొదలెట్టారు. ఇందులో 108కి మినహాయింపేమీ లేదు. ముఖ్యంగా గత చంద్రబాబు ప్రభుత్వ హాయంలో 108 పూర్తిగా చతికిలపడింది. వాహనాలకు రిపేర్లకు, డీజిల్‌కు కూడా బిల్లులు లేక వాహనాలు మూలనపడ్డాయి. తమ జీతాల కోసం 108 సిబ్బంది ధర్నాలు చేశారంటే 108 వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎంతలా బ్రష్టు పట్టించిందో అర్థం చేసుకోవచ్చు. సహాయం కోసం ఫోన్‌ చేసిన వారికి నిరుత్సాహమే ఎదురైంది. వాహనం రిపేరులో ఉందనో, డీజిల్‌ లేదనో కాల్‌సెంటర్‌ నుంచి సమాధానం వచ్చేది.

మండలానికి ఒక 108 వాహనం..

మళ్లీ 108కు మంచి రోజులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 108కు పూర్తి స్థాయిలో చికిత్స చేస్తోంది. ఇకపై వైఎస్సార్‌ హయాంలోలాగే 108.. కుయ్‌.. కుయ్‌.. సైరన్‌తో పరుగులు పెట్టనుంది. ఈ నెల 27 జరిగిన మంత్రివర్గ సమావేశంలో 108 పై కీలక నిర్ణయం తీసుకున్నారు. 108 వాహనాలు 412 కొనుగోలు చేసేందుకు 71.48 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మార్చి 31 లోపు వాహనాలు అందుబాటులోకి రానున్నాను. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న 676 మండలాలకు ఒక్కొకటి చొప్పున ప్రతి మండలానికి ఒక 108 వాహనం ప్రజలకు సేవలు అందించనున్నాయి.

సంచార సంజీవినికి ప్రాణం…

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన మరో పథకం 104. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు 104 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సంచార వాహనాల ద్వారా వైద్యులు గ్రామాలకు వెళ్లి ప్రజలకు వైద్యపరీక్షలు చేసి, అవసరమైన మందులు ఉచితంగా అందించేవారు. ఈ పథకం కూడా వైఎస్సార్‌ మరణం తర్వాత మూలనపడింది. ఈ పథకాన్ని కూడా సీఎం జగన్‌ తిరిగి గాడిలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 676 మండలాలు ఉండగా ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఉండేలా కొత్తగా 656 వాహనాలు కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందు కోసం 60.51 కోట్ల రూపాయలు కేటాయించారు. 108తో పాటు ఈ వాహనాలు కూడా మార్చి నెలాఖరు నాటికి సేవలు అందించనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి