iDreamPost

మరణించి 14 ఏళ్ళైనా.. YSRపై ఇంత ప్రేమకి కారణం?

మరణించి 14 ఏళ్ళైనా.. YSRపై ఇంత ప్రేమకి కారణం?

విశ్వంలో కోట్లాది నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు సంచరిస్తుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. వాటికే మనం పూజలు, పునస్కారాలు చేస్తాం. అలానే మానవ ప్రపంచంలో వందలాది మంది నాయకులు కనిపిస్తారు. కానీ, అతి కొద్దిమందినే మనం నిరంతరం స్మరించుకుంటాం. వారు మరణించి ఏళ్లు గడిచినా వారిని మరచిపోము. వారిని మన గుండెల్లో పెట్టుకుని నిత్యం ఆరాధిస్తుంటాం. అలాంటి మహానుభావుడే, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ పేరు చెప్పగానే ప్రపంచంలో ఉన్న ప్రతీ తెలుగు బిడ్డ ఒళ్ళు పులకరిస్తోంది. అంతలా ప్రజల గుండె చప్పుడుగా మారాడు వైఎస్ రాజశేఖరుడు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఓటమి ఎరుగని నేత, భయం అంటే తెలియని ధీరుడు. కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన వైఎస్సార్.. అంత ఈజీగా ముఖ్యమంత్రి కాలేదు. మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ లోనే ఉంటూ.. పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఎన్నో రాజకీయ ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కున్నారు. రాజకీయాల్లో తన ఉనికిని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి సీనియర్స్ తో యుద్ధమే చేశారు. తనను నమ్మిన వారి కోసం ఎంతకైనా సాహసించే సద్గుణం కలిగిన అరుదైన లీడర్ వైఎస్సార్. ఆయనను అణగదొక్కాలని, రాజకీయాల్లో ఎదగకుండా చేయాలని ప్రయత్నం చేయని నాయకుడు అంటూ లేడు.

ఇక కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి.. చరిత్ర సృష్టించారు. నేటికీ పాదయాత్ర అనగానే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. ఇక సుదీర్ఘ కాలం తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతేకాక వరుసగా రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏపీ చరిత్ర చూసినట్లయితే.. ‘వైఎస్సార్ ముందు, వైఎస్సార్ తర్వాత’ అనేంతలా రాజశేఖరుడు తన పరిపాలనను సాగించారు. రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పగానే ఠక్కున కొన్ని పథకాలు గుర్తుకు వస్తాయి.

YSR అంటే గుర్తుకొచ్చేవి సంక్షేమ పధకాలు:

ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పథకాల పేర్లు చెప్పగానే వైఎస్సార్ ను తలచుకుంటారు. ఆ పథకాల రూపంలో వైఎస్సార్ పేదలందరినీ పలకరిస్తున్నారు. వైఎస్సార్ అంటే గుర్తుకొచ్చే సంక్షేమ పథకాల్లో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణ మాఫీ, ఉచిత విద్యుత్ ప్రముఖమైనవి. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఎంతో మంది పేద పిల్లలు ఇంజనీరింగ్ కోర్సులు చేసి.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అలానే గుండె, కిడ్నీ, లివర్, మెదడు లాంటి అత్యంత ఖరీదైన సర్జరీలు చేయించుకోలేక ప్రాణాలు విడవడమే మార్గం అనుకున్న పేదవారికి.. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నయా పైసా ఖర్చు లేకుండా ఆ ఆపరేషన్లు చేయించుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు.

ఇలా పేదవాళ్లకు రాజశేఖరరెడ్డి దేవుడిలా మారాడు. ఇక వైఎస్సార్ అంటే గుర్తుకొచ్చేది జలయజ్ఞం. పొలాలకు నీరు లేక, అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యే శరణ్యం అనుకున్న రైతులకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనే రాకుండా చేయాలనుకున్నారు. రైతుల కన్నీళ్లు తుడవాలంటే పొలాలు తడవాలని దృఢ నిశ్చయంతో మహా యజ్ఞాన్ని ప్రారంభించారు. రైతుల కష్టాలకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం చూపించాలని వైఎస్ లో మెదిలిన ఆలోచనే జలయజ్ఞం. రైతులు 24 గంటల కరెంట్, నీరు అందించాలని వైఎస్సార్ సంకల్పించారు. ఉమ్మడి ఏపీలో మూడు ప్రాంతాలను సస్యశ్యామలం చేసే విధంగా ఒకేసారి 40కి పైగా నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఏళ్ల తరబడి మూలపడిన పోలవరం ప్రాజెక్టుకు ప్రాణం పోశారు.

ఆయన రైతులకు చేసినంత మేలు అప్పటివరకూ ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయారు. అందుకే వైఎస్ అనగానే రైతు బాంధవుడు, ప్రాణదాత అనే పదాలు జ్ఞప్తికొస్తాయి. ఇలా చెప్పుకోవాలంటే వైఎస్ అయిదేళ్ల పాలన ఒక స్వర్ణయుగం. అలాంటి మహోన్నత వ్యక్తి.. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణవార్త విని ఎన్నో వందల గుండెలు ఆగాయి. ఇలా ఒక వ్యక్తి కోసం వందల గుండెలు ఆగడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అంతలా వైఎస్సార్ ప్రజల గుండెగా మారిపోయారు. చివరగా ఒక మాట.. ఎంతోమంది గొప్పగొప్ప నాయకులు, మేధావులు ఈ దేశాన్ని పాలించారు. కానీ, వైఎస్సార్ లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ భూమి ఉన్నంతకాలం వైఎస్సార్ పేరు రెపరెపలాడుతూ ఉంటుంది. జోహార్ వైఎస్సార్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి