iDreamPost

మళ్లీ మండలిలో రాజధాని వికేంద్రీకరణ సెగ : ఈరోజు ఏం జరగబోతుందో?

మళ్లీ మండలిలో రాజధాని వికేంద్రీకరణ సెగ : ఈరోజు ఏం జరగబోతుందో?

ఏపీలో పాలన వికేంద్రీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం చెప్పినట్టుగానే వ్యవహారం చక్కబెడుతోంది. ఏపీ హైకోర్టులో మాట ఇచ్చినట్టుగా శాసనపరమైన వ్యవహారం పూర్తి చేస్తోంది. ఇప్పటికే మండలిలో సాంకేతికంగా ఆమోదం పొందినట్టుగానే భావిస్తున్న బిల్లుకి అసెంబ్లీలో రెండోసారి ఆమోదం తెలపడం ద్వారా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. టీడీపీ తొలుత ఈ సమావేశాలను బహిష్కరించాలని భావించినప్పటికీ రాజధాని బిల్లుల విషయంలోనే మళ్లీ వెనక్కి తగ్గింది. బడ్జెట్ సమావేశాలను పూర్తిగా బాయ్ కాట్ చేస్తే సీఆర్డీయే రద్దు, పాలన వికేంద్రీకరణకు సంబంధించిన రెండు బిల్లులకు లైన్ క్లియర్ చేసినట్టేనని భావించి, చివరకు అసెంబ్లీలో అడుగుపెట్టింది. కానీ తీరా సభలో ఈ బిల్లులు ఆమోదం పొందే సమయానికి బయట మిగిలిపోయింది. బడ్జెట్ ప్రసంగాలను బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయిన టీడీపీ , బిల్లులు ప్రవేశపెట్టే సమయానికి లోపలికి రాలేకపోయింది. దాంతో ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా రెండోసారి బిల్లులను ఆమోదించింది.

ఈ తరుణంలో మండలిలో వాటిని అడ్డకుంటామని చెబుతోంది. శాసనమండలి వ్యవహారం తెగేదాక లాగడానికి కారణమయిన ఈ రెండు బిల్లులు మళ్లీ మండలికి వెళతాయా లేదా అనే సందేహం ఆపార్టీ నేతల్లో కూడా ఉంది. నిజానికి నిబంధనల ప్రకారం మండలి తిరస్కరించిన బిల్లుని రెండోసారి అసెంబ్లీ ఆమోదిస్తే వాటికి ఆమోదం లభించినట్టే అవుతుంది. అయితే మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపించినట్టు తన విచక్షణాధికారంతో చేసిన ప్రకటనను టీడీపీ ప్రస్తావిస్తోంది. కానీ సాంకేతికంగా సెలక్ట్ కమిటీకి పంపించిన ప్రక్రియ పూర్తికాలేదు. దానికి మండలి కార్యదర్శి కూడా అంగీకరించలేదు. కాబట్టి ప్రభుత్వ వాదనకు అనుకూలత ఉందనేది కొందరి అభిప్రాయం.

Also Read:మళ్లీ మండలిలో రాజధాని వికేంద్రీకరణ సెగ : ఈరోజు ఏం జరగబోతుందో?

ఈ తరుణంలో రాజకీయంగా రాజధానుల అంశం మరోసారి కీలకంగా మారబోతోంది. ఇప్పటికే ఏపీ హైకోర్టులో దీనికి సంబంధించిన కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సీఆర్డీయే రద్దు చెల్లదని కొందరు వేసిన కేసుల్లో విచారణ సాగుతోంది. హైకోర్ట్ కూడా వివిధ సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసింది. వాటి చుట్టూ పెద్ద చర్చకూడా సాగింది. అదే సమయంలో సెలక్ట్ కమిటీ ప్రక్రియ పూర్తిచేయకపోవడం పట్ల కూడా కొన్ని అభ్యంతరాలు కోర్టు వరకూ వెళ్లాయి. ముఖ్యంగా సెలక్ట్ కమిటీకి టీడీపీ అధికారికంగా తమ పేర్లు ప్రకటించింది. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా వెల్లడించారు. కానీ వైఎస్సార్సీపీ మాత్రం అది చెల్లదంటూ తమ సభ్యుల పేర్లు ఇవ్వడానికి నిరాకరించింది. అదే సమయంలో సెలక్ట్ కమిటీకి బిల్లు పంపించడానికి అవసరమైన ముందస్తు ప్రక్రియ జరగనందును సాంకేతికంగా అలా చేయడానికి అవకాశం లేదంటూ మండలి కార్యదర్శి సదరు ప్రక్రియను పూర్తి చేసేందుకు నిరాకరించారు.

ఈ నేపథ్యంలో సెలక్ట్ కమిటీకి బిల్లులు వెళ్లినట్టు అధికారికంగా ఎక్కడా లేదు. ఇప్పటికే ఆరు నెలలు దాదాపుగా అది గడిచిపోయింది. ఈ తరుణంలో రెండోసారి అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు యథాతథంగా చట్టరూపం దాల్చడానికి అన్ని రకాలుగానూ అర్హత ఉందనేది ప్రభుత్వ వర్గాల వాదన. అయినప్పటికీ బిల్లుని మండలిలో ఆమోదించుకునే అవకాశం ఉందని విపక్ష టీడీపీ భావిస్తోంది. దానికి అనుగుణంగా ఆపార్టీ ఎమ్మెల్సీలకు విప్ కూడా జారీ చేసింది. టీడీపీని వీడుతున్నట్టు ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీలకి కూడా విప్ జారీ అయ్యింది. ఈ తరుణంలో బుధవారం మండలిలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది కీలకం. నిజంగా ప్రభుత్వం మండలికి బిల్లు తెస్తుందనే గ్యారంటీ లేదు. అవసరం లేదనే వాదన వారివైపు నుంచి ఉంది. ఒకవేళ మండలికి తీసుకొచ్చినప్పటికీ అక్కడ మళ్లీ తిరస్కరించే సాహసం చేస్తారా అనేది ఆసక్తికరమే. వాస్తవానికి గవర్నర్ ప్రసంగానికే సవరణలు చేస్తూ మండలిలో టీడీపీ తన ఆధిక్యతను ఉపయోగించుకుని తీర్మానం ఆమోదించిన తరుణంలో బిల్లుని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం అనివార్యంగా చెప్పవచ్చు.

Also Read:యనమల, రాజప్పల అరెస్ట్ తప్పదా?

నిబంధనల ప్రకారం మండలి ప్రతిపాదనలను తిరస్కరించి శాసనసభ రెండోసారి బిల్లుని పంపించిన క్రమంలో ఆ బిల్లును శాసనమండలి ఆమోదించాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా మండలి లో మళ్లీ బిల్లుకి ఆమోదం దక్కకపోయినా 197(2)(బి) ప్రకారం ఆ బిల్లు ఆమోదం పొందినట్టే అవుతుంది. తద్వారా రెండు సభలు కొనసాగుతున్న రాష్ట్రాల్లో శాసనసరమైన వ్యవహారాల్లో అసెంబ్లీదే పై చేయి అవుతుంది. శాసనసభ నిర్ణయాలకు మార్పులపై సూచనలు ఇవ్వడం లేదా నిర్ణయం అమలులో జాప్యం చేసే అవకాశం మినహా మండలి కి అధికారాలు లేవు. ఇలాంటి తరుణంలో తాజా బిల్లులు మండలికి వస్తే ఇక ఆమోదం తెలిపేందుకు సిద్ధపడతారా లేక సాంకేతికంగా అసెంబ్లీ నిర్ణయం అమలు జరిగేలా మండలిలో మంకుపట్టు ప్రదర్శిస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. అయితే మనీ బిల్లు విషయంలో అసెంబ్లీ కి మరిన్ని అవకాశాలు ఉంటాయి. ఇలాంటి తరుణంలో బిల్లు మనీ బిల్లు అవుతుందా లేదా అని నిర్ణయించే అధికారం అసెంబ్లీ స్పీకర్ కే ఉన్నందున అక్కడ కూడా మండలికి అవకాశాలు స్వల్పమే. ఇలాంటి తరుణంలో తాజా బిల్లుల విషయంలో మండలి నిర్ణయం పెద్దగా ప్రాధాన్యత లేదనే వాదన వినిపిస్తోంది.

Also Read:క్షమాపణలు చెప్పండి – కోరుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు నోటీసులు

గతంలో శాసనమండలి సాక్షిగా జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక మార్పులకు కారణం అయ్యాయనే చెప్పవచ్చు. జనవరి 22 వ తేదీ నాటి శాసనమండలి వ్వవహారాల్లో నేరుగా చంద్రబాబు కూడా జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆయన కూడా మండలి గ్యాలరీలోకి వెళ్లడం దానికి కారణం అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజా ఎపిసోడ్ ఎలాంటి మలుపులకు దారితీస్తుందోననే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించే ప్రణాళికతో ఉందా..విపక్షం దానిని తిప్పికొట్టగలదా అన్నది చూడాలి. సాంకేతికంగా ప్రస్తుతానికి ప్రభుత్వానికి అనుకూలత ఉన్న సమయంలో చివరకు ఏరీతిలో మార్పులు ఉంటాయన్నది కూడా కీలకమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి