iDreamPost

మున్సిపల్‌ చైర్మన్‌ పీఠంపై ఇటుక బట్టీ కూలీ

మున్సిపల్‌ చైర్మన్‌ పీఠంపై ఇటుక బట్టీ కూలీ

ఆమెదో సాధారణ కుటుంబం. రోజు వారీ కూలి చేసుకుంటేగానీ కుటుంబం గడవని పరిస్థితి. అత్యంత సాధారణ జీవనం గడుపుతున్న మహిళకు అదృష్టం వరించింది. మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసే అవకాశం రావడమే కాదు.. కౌన్సిలర్‌గా గెలిచి ఏకంగా చైర్మన్‌ పీఠంపై కూర్చునే అవకాశం ఆమెకు దక్కింది. టీడీపీ గెలిచే మున్సిపాలిటీల్లో ఒకటని ప్రచారం ఉన్న ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపాలిటీలో వైసీపీ గెలవడం, ఆ పార్టీ తరఫున ఎస్సీ మహిళ లక్కెబోయిన ఏస్తేరమ్మ ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి.

మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ఎంపికైన లక్కెబోయిన ఏస్తేరమ్మ విజయం లాంఛనమే. అద్దంకిలో 20 వార్డులు ఉండగా.. ఎస్టీ రిజర్డ్వ్‌ అయిన 8వ వార్డులో నామినేషన్‌ వేసిన నలుగురు నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఉపసంహరిచుకోవడంతో ఎన్నిక నిలిచిపోయింది. 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. హోరా హోరీగా సాగిన పోరులో వైసీపీ 12 వార్డులను కైవసం చేసుకుంది. టీడీపీ ఏడు వార్డుల్లో గెలిచింది. స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీని వైసీపీ హస్తగతం చేసుకుంది.

ఏస్తేరమ్మను వరించిన అదృష్టం..

మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయింది. 19 వార్డులకు గాను నాలుగు వార్డుల్లో ఎస్సీ మహిళలు పోటీ చేశారు. వైసీపీ తరఫున 6వ వార్డు నుంచి మట్టిగుంట లక్ష్మీ లావణ్య, 7వ వార్డు నుంచి దాసరి మున్నంగి వెంకట రత్నం, 15వ వార్డు నుంచి జెన్నిపోగు మణెమ్మ, 18వ వార్డు నుంచి లక్కెబోయిన ఏస్తేరమ్మలు పోటీ చేశారు. పోలింగ్‌కు ముందే తమ చైర్మన్‌ అభ్యర్థిగా 15వ వార్డులో పోటీ చేసిన జెన్నిపోగు మణెమ్మను వైసీపీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో ఆమె పేరు చెప్పారు.

Also Read : గొట్టిపాటిని నిరాశపరిచిన అద్దంకి

అయితే వైసీపీ చైర్మన్‌ అభ్యర్థి మణెమ్మ ఓడిపోయారు. ఆమెతోపాటు 6, 7 వార్డుల్లో పోటీ చేసిన లక్ష్మీ లావణ్య, వెంకట రత్నంలు ఓటమిపాలయ్యారు. 7వ వార్డులో వెంకట రత్నం కేవలం పది ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ తరఫను పోటీ చేసిన నలుగురు ఎస్సీ మహిళల్లో 18వ వార్డు అభ్యర్థి లక్కెబోయిన ఏస్తేరమ్మ ఒక్కరే గెలుపొందడంతో ఆమెకే చైర్మన్‌ పీఠం అనివార్యమైంది.

ఊపిరి పీల్చుకున్న వైసీపీ…

ఏస్తేరమ్మ ఒక్కరైనా గెలవడంతో వైసీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. ఈ వార్డులోనూ ఓడిపోతే.. చైర్మన్‌ పీఠంపై కూర్చునేందుకు అధికార పార్టీకి అభ్యర్థే కరువయ్యేవారు. అప్పుడు టీడీపీ నుంచి ఒకరిని తీసుకువచ్చి చైర్మన్‌ పీఠం కట్టబెట్టాల్సిన పరిస్థితి నెలకొనేది. లేదంటే చైర్మన్‌ పీఠం అనివార్యంగా టీడీపీకి అప్పజెప్పాల్సి ఉండేది. ఏస్తేరమ్మ గెవడంతో వైసీపీకి ఆ పరిస్థితి తప్పింది.

ఏస్తేరమ్మ ఇటుకల బట్టీలో దినసరి కూలీగా పని చేస్తోంది. ఆమె భర్త కూడా ఇటుకల బట్టీలోనూ, లేదా ఏ పని దొరికితే ఆ పని చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు. ఒకరు ఇంటర్, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. ఏస్తేరమ్మ మున్సిపల్‌ చైర్మన్‌ కావడంతో… ఆమెకు వచ్చే గౌరవ వేతనంతో వారి జీవన పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.

Also Read : చీరాలలో గెలిచిందెవరు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి