iDreamPost

ప్రియుడికి మరొకరితో పెళ్లి అయిపోతుందని టెకీ ఆత్మహత్య

ప్రియుడికి మరొకరితో పెళ్లి అయిపోతుందని టెకీ ఆత్మహత్య

కాలం మారుతున్నా పిల్లల ప్రేమ, పెళ్లి విషయాల్లో పెద్దలు సానుకూల ధోరణితో వ్యవహరించడం లేదు. చదువుకుని, ఆర్ధికంగా ఎదుగుతున్నా.. పెళ్లి విషయంలో మాత్రం పూర్తి చాయిస్‌ తల్లిదండ్రులదే అవుతుంది. తమ తల్లిదండ్రులు తమ మాటకు విలువనిస్తారని భావిస్తుంటారు పిల్లలు. అందుకే ప్రేమించిన వ్యక్తి గురించి ఇంట్లో చెబుతుంటారు. పిల్లల మనస్సులను అర్థం చేసుకోకుండా.. కులం, మతం, ఆస్తి, అంతస్థు, పరువు అంటూ అడ్డుగోడలు విధిస్తారు. అమ్మాయి, అబ్బాయి మనస్సులను విరగొడుతుంటారు. దీంతో మరొకరిని జీవితంలో ఆహ్వానిస్తుంటారు. కొందరైతే ప్రేమించిన వ్యక్తులను మర్చిపోలేక అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ప్రేమ లేదంటే లైఫ్ లేదనుకుని..అందుకే చావే పరిష్కారమనుకుని బలవన్మరణానికి పాల్పడుతుంటారు.

తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పాటు.. ప్రియుడు మరొకర్ని వివాహం చేసుకున్నాడన్న కారణంగా మనస్థాపానికి గురైన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాలకు చెందిన మౌనిక హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సాఫ్ట్ వేర్ కంపెనీలో టెకీగా పనిచేస్తుంది. జగద్గిరి గుట్ట ప్రాంతంలోని నెహ్రునగర్‌లో తన స్నేహితురాలు సౌమ్యతో కలిసి ఉంటుంది. అయితే మౌనిక ఓ అబ్బాయిని ప్రేమించగా.. తల్లిదండ్రులు వారి పెళ్లికి  అంగీకరించలేదు. దీంతో వారితో మాట్లాడం తగ్గించేసింది. ఇటీవల తన రూమ్మేట్ సౌమ్య తన స్వస్థలానికి వెళ్లగా.. రూములో ఉండిపోయింది మౌనిక.

ఇదే సమయంలో మౌనికకు తల్లిదండ్రులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్నేహితురాలు, చుట్టుప్రక్కల వారిని ఆరా తీశారు. తెలిసిన వ్యక్తి మంగళవారం ఉదయం వెళ్లి చూడగా..గది తలుపులు తెరిచే ఉన్నాయని, ఆమె స్పృహలో లేదని కాల్ చేసి చెప్పాడు. పురుగుల మందు బాటిల్ గదిలో కనిపించినట్లు తెలిపాడు. 108 కి కాల్ చేయగా.. సిబ్బంది వచ్చి చూడగా చనిపోయినట్లు తెలిపారు. అయితే తమ కూతురు ఓ అబ్బాయిని ప్రేమించిందని, తాము పెళ్లికి అంగీకరించకపోవడంతో మాట్లాడటం మానేసిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ అబ్బాయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పిందన్నారు. ఈ విషయంలోనే కుమార్తె ఆవేదన చెందిన చనిపోయి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి