iDreamPost

క్రికెటర్లకు జన్‌థన్‌ ఖాతాలు..!!

క్రికెటర్లకు జన్‌థన్‌ ఖాతాలు..!!

జన్‌ధన్‌ యోజన.. బీజేపీ ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన 2014లోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు ఖాతాలు లేని పేదలకు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకు అకౌంట్లును తెరవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశ ఆర్థిక వ్యవస్థలో పేదలను కూడా భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఈ ఖాతాలను ప్రత్యేకంగా ప్రారంభించడం 2014 ఆగస్ట్‌ 28 నుంచి ప్రారంభించారు. అయితే ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టే పై ఉపోద్ఘాతం.

కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు విధాలుగా సహాయం చేస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం తమ రాష్ట్రంలోని పేదలకు.. అంటే రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొలా తమ ఆర్థిక పరిస్థితిని బట్టీ తమ రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నాయి. నగదును వారి ఖాతాల్లో జమ చేయడం లేదా నేరుగా వారికి అందించడం చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల మాదిరిగానే పేదలకు నగదును ఇస్తోంది. అయితే జన్‌ధన్‌ ఖాతాలు ఉన్న వారికే ఈ నగదును ఇస్తున్నట్లు పేదలు అనే పదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చి వార్తల్లో నిలిచింది.

2014 ఆగస్టు తర్వాత జన్‌ధన్‌ ఖాతాలు ప్రారంభించారు. అంటే అప్పటి వరకు పేదలకు బ్యాంకు ఖాతాలు లేవనే అర్థంలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి. జనథన్‌ ఖాతాలు ఉన్న వారందరూ పేదలేనా అంటే.. అదో మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ ఖాతాలను 10 ఏళ్లు పైబడి వారందరూ కూడా వారి తల్లిదండ్రుల సహాయంతో ప్రారంభించవచ్చు. అంతేకాకుండా విద్యార్థులు కూడా విరివిగా ఈ పథకం కింద జీరో బ్యాలెన్స్‌ ఖాతాలను తీసుకున్నారు. వీరందరికీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నగదు లభించింది.

తాజాగా జన్‌ధన్‌ యోజన పథకంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. జూనియర్‌ క్రికెటర్లు కూడా ఈ పథకం కింద జీరో బ్యాలెన్స్‌ ఖాతాను ప్రారంభించారు. బీసీసీఐ వారికి ఇవ్వాల్సిన నగదు ప్రోత్సాహకం విడుదలలో ఆలస్యం కావడంతో అసలు కారణం ఏమిటో వెలుగులోకి వచ్చింది. జూనియర్‌ క్రికెటర్లు అందరూ జన్‌ధన్‌ యోజన ఖాతాలు తీసుకున్నారని, ఆ ఖాతాల్లో 50 వేల రూపాయలకు మించి వేసే అవకాశం లేకపోవడంతో ఆలస్యమవుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. జూనియర్‌ క్రికెటర్లకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంది. అందుకే వారి జన్‌ధన్‌ ఖాతాలను సేవింగ్స్‌ ఖాతాలుగా మార్చాలని బ్యాంకు అధికారులను కోరినట్లు బీసీసీఐ తెలిపింది.

సో.. జన్‌ధన్‌ ఖాతాలు ఉన్న వారందరూ పేదలు కాదన్న విషయం ఈ ఘటన రుజువు చేస్తోంది. జన్‌ధన్‌ యోజన పథకం ప్రారంభంలో విరివిగా ఖాతాలు ప్రారంభిచాలనే లక్ష్యంతో అందరికీ ఈ పథకం కింద ఖాతాలు ప్రారంభింపజేశారు. వీటిని పేదరికానికి ప్రామాణికంగా తీసుకోవడమే విడ్దూరం. 20 కోట్ల జన్‌ధన్‌ ఖాతాల్లో 10 వేల కోట్ల రూపాయలు జమ చేశామని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇందులో పేదలకు చేరింది ఎంత..? పెద్దలకు చేరింది ఎంత..?.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి