iDreamPost

కరోనా ధాటికి ప్రపంచం విలవిల

కరోనా ధాటికి ప్రపంచం విలవిల

కరోనా కాటుకి ప్రపంచం విలవిలలాడుతోంది.. తాజాగా 127 దేశాలకి కరోనా(కోవిడ్ 19) వైరస్ వ్యాపించింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ 4,946 మృత్యువాత పడగా 1,32,993 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

చైనాలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టగా ప్రపంచ దేశాల్లో మాత్రం అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ విషయంలో అన్ని దేశాలు అప్రమత్తం కావాలని వ్యాఖ్యానించింది. కరోనా కారణంగా చైనా తర్వాత అత్యంత ప్రభావితమైన దేశంగా ఇటలీ దేశం నిలిచింది. అత్యంత వేగంగా ఇటలీలో కరోనా వ్యాపిస్తుండడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటివరకూ ఇటలీలో 1016 మంది మృతి చెందారు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకుంటుంది. కరోనా కారణముగా ఇరాన్ లో 429, దక్షిణ కొరియాలో 67, ఫ్రాన్స్ లో 61,అమెరికాలో 41 మంది మృత్యువాత పడ్డారు.

భారత్ లో తొలి కరోనా మరణం

ఇదిలా ఉండగా భారత దేశంలో కూడా తొలి కరోనా మరణం నమోదు అయ్యింది. హైదరాబాద్ లో కర్ణాటకకు చెందిన 76 సంవత్సరాల వృద్ధుడు మహ్మద్ హుస్సేన్ సిద్దిఖీ కరోనా కారణంగా మృతి చెందాడు. ఫిభ్రవరి 28 న సౌదీ నుండి వచ్చిన మహ్మద్ హుస్సేన్ సిద్దిఖీ దగ్గు జలుబుతో బాధపడుతుంటే హైదరాబాద్ హాస్పిటల్ లో చేర్చారు. మహ్మద్ హుస్సేన్ సిద్దిఖీ మృతిని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంతో భారత దేశ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.

ఇప్పటివరకూ భారత్ లో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వేగంగా వ్యాపిస్తూ ఉండటంతో భారత ప్రభుత్వం నేటి నుండి ఏప్రిల్ 15 వరకూ వీసాలు జారీ చేసే ప్రక్రియను రద్దు చేసింది. ఢిల్లీలో ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్ లో ఈ నెల 31 వరకూ స్కూల్స్ & కాలేజీలు కరోనా కారణంగా మూతపడనున్నాయి.త్వరలో భారత్ లో జరగబోయే ఐపీఎల్ వాయిదా పడనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వీసా జారీ చేసే ప్రక్రియ నిలిపివేయడంతో విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ కి అందుబాటులో ఉండే అవకాశాలు మూసుకుపోయాయి. దీనికి తోడు కరోనా వ్యాపించే ప్రభావం ఉండటంతో ఐపీఎల్ ను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ ను నిర్వహించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక,మహారాష్ట్ర ప్రభుత్వాలు ఐపీఎల్ నిర్వహణపై చేతులెత్తేశాయి. ప్రపంచ వ్యాప్తంగా జరగబోయే పలు కీలక టోర్నీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో జరగబోయే షూటింగ్ ప్రపంచకప్ వాయిదా పడింది. జపాన్ లో జరగబోయే ఒలింపిక్స్ కూడా దాదాపు వాయిదా పడనున్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి.

కరోనా ఇచ్చిన స్ట్రోక్ కి ప్రపంచ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్టాక్ మార్కెట్లు “బేర్”మన్నాయి. ఒక్కరోజులోనే 11 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరయ్యింది. ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల బాట పట్టాయి. అన్ని ప్రముఖ కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. 12 ఏళ్ల తర్వాత భారత స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిలిపివేశారు. దేశీయ మార్కెట్లన్నీ తీవ్ర నష్టాల్లో కొనసాగడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేశారు. 45 నిమిషాల తర్వాత పునః ప్రారంభమైన మార్కెట్లు మళ్ళీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్లు కూడా నష్టాలలో కొనసాగుతున్నాయి.

కరోనా మహమ్మరి బారిన హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ దంపతులు కూడా పడ్డారు. టామ్ హాంక్స్ మరియు అతని భార్య రీటా విల్సన్ లు కరోనా వైరస్ సోకినట్లు అధికారికంగా ధృవీకరించారు. ఆస్ట్రేలియాలో షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు చేసిన వైద్య పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. దీంతో కరోనా ఐసోలేషన్ వార్డుకు టామ్ హాంక్స్ దంపతులను తరలించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగరీకి కరోనా వైరస్ సోకినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు..

దీంతో కరోనాని కట్టడి చేయడానికి పలు దేశాలు ఇప్పటికే విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. వాణిజ్య వ్యవహారాలపై అప్రమత్తమయ్యాయి. ఒలింపిక్స్ ని వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జపాన్ ప్రభుత్వానికి సూచించారు. ఇటలీ ప్రభుత్వం ప్రజలంతా గృహ నిర్బంధంలోనే ప్రజలంతా ఉండాలని ఆదేశించింది.అమెరికా ప్రభుత్వం 30 రోజులపాటు తమ దేశంలోకి ప్రయాణికుల రాకపై నిషేధం విధించింది. బ్రిటన్ కి మాత్రం మినహాయింపును ఇచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి