iDreamPost

కాంగ్రెస్‌కు మధ్యప్రదేశ్‌లో దారుంది..! కానీ..

కాంగ్రెస్‌కు మధ్యప్రదేశ్‌లో దారుంది..! కానీ..

మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ డ్రామాకు ఎట్టకేలకు ఈ రోజు తెరపడింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ అసెంబ్లీలో బలపరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేయడంతో 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పాలన 15 నెలలకే ముగిసింది. మళ్లీ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ కొలువుతీరనుంది.

ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయినా.. అవకాశాలు మాత్రం మూసుకుపోలేదని చెప్పవచ్చు. మరో ఆరు నెలల్లో మళ్లీ అధికారం చేపట్టేందుకు దారుంది. అయితే ఆ దారి.. మధ్య ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల చేతుల్లో ఉంది. ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ నాయకత్వం కావాలనుకుంటే ఆరు నెలల లోపు మళ్లీ కాంగ్రెస్‌ సర్కార్‌ బండి పట్టాలెక్కుతుంది.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో 230 సీట్లున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు అవసరం కాగా.. 2018లో జరిగిన ఎన్నికల్లో 114 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ అంతకు ముందు వచ్చిన సీట్లలో 56 సీట్లు కోల్పోయి 109కి పరిమితం అయింది. బీజేపీ కోల్పోయిన సీట్లన్నీ కాంగ్రెస్‌ గెలుచుకుంది. బీఎస్పీ రెండు, ఎస్పీ ఒకటి, స్వతంత్రులు నాలుగు స్థానాలు గెలుచుకున్నారు. స్వతంత్రులు, బీఎస్పీ, ఎస్సీలతో కలసి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కాంగ్రెస్‌లోని జ్యోతిరాధిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు 22 మంది పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. 22 మందిలో ఆరుగురు రాజీనామాలను ఇప్పటికే ఆమోదించగా.. మిగతవారి రాజీనామాలు కూడా ఆమోదించడం లాంఛనమే కానుంది. బీజేపీకి చెందిన మరో ఇద్దరు సభ్యులు ఇతర కారణాల వల్ల రాజీనామా చేయడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. మొత్తం 24 స్థానాలకు ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.

Read Also : నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవి ఊడినట్లే..‘నా’..!?

ప్రస్తుతం సభలో బీజేపీకి 107 సీట్లు, కాంగ్రెస్‌కు 92 సీట్ల బలం ఉంది. బీఎస్పీకి ఇద్దరు, ఎస్పీకి ఒకరు, స్వతంత్రులు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 24 ఎమ్మెల్యే స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌116కు ఆ పార్టీ బలం పెరుగుతంది. మరి మధ్య ప్రదేశ్‌ ప్రజలు ఈ స్థాయిలో తీర్పు ఇస్తారా..? అనేదే పెద్ద ప్రశ్న. ఇక బీజేపీ 24 స్థానాల్లో 9 సీట్లు గెలుచుకున్న కూడా మ్యాజిక్‌ ఫిగర్‌(116)ను చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు అవకాశాలు స్వల్పమనే చెప్పవచ్చు. ఏదైనా అద్భుతం జరిగి 24 స్థానాలు గెలుచుకుంటే కమల్‌నాథ్‌ సర్కార్‌ మళ్లీ పట్టాలెక్కుతుంది. రాజకీయాల్లో సాధ్యం కానిదేమీలేదు కాబట్టి.. గుర్రం ఎగరవచ్చునేమో..!?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి