iDreamPost

వైఎస్‌ జగన్‌.. ప్రత్యర్థులకు అస్త్రం ఇచ్చినట్లేనా..?!

వైఎస్‌ జగన్‌.. ప్రత్యర్థులకు అస్త్రం ఇచ్చినట్లేనా..?!

అమరావతి నుంచి రాజధానిని తరలించలేదని మొదట నుంచి చెబుతున్న అధికార వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ, మంత్రులు, సీఎం వైఎస్‌ జగన్‌.. ఆ పని చేయకపోయినా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారికి, ప్రతిపక్ష పార్టీ, మీడియాకు బలమైన అస్త్రం ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణ, అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధి – 2020, సీఆర్‌డీఏ రద్దు –2020 బిల్లులు ప్రవేశపెట్టారు.

న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ ఏర్పాటు, అమరావతిలో ఏర్పాటు చేసిన క్యాపిటల్‌ రీజియన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ(సీఆర్‌డీఏ) రద్దు, దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు.. ఇవీ ఆ రెండు బిల్లుల ముఖ్య ఉద్దేశాలు.

Read Also: సీఆర్డీఏ రద్దు.. ఎఎంఆర్డీఏ ఏర్పాటు..

అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించినా, సీఆర్‌డీఏ రద్దు చేయడంతోనే ఆ ప్రాంత ప్రజల్లో అనుమానాలకు తావిచ్చినట్లైంది. సీఆర్‌డీఏ ను రద్దు చేశారని, రాజధానిగా అమరావతి ఇక లేనట్లేనని రేపటి నుంచి ప్రభుత్వ వ్యతిరేకులు, ప్రతిపక్షం, మీడియా ప్రచారం చేసేందుకు వైఎస్‌ జగన్‌ సర్కారే మంచి ఆస్త్రాన్ని ఇచ్చింది.

సీఆర్‌డీఏ రద్దు అనే మాట లేకుండా.. పేరుమార్చి దానికి లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ రీజియన్‌ డెవెలెప్‌ అథారిటీ (ఎల్‌ సీఆర్‌డీఏ)గా పేరు మార్చి ఉంటే ప్రభుత్వానికి అమరావతి ప్రాంత ప్రజల నుంచి మంచి మద్దతు లభించేది. వారిలో ఎలాంటి అనుమానాలకు తావుండేది కాదు. మూడు రాజధానులు ఏర్పాటు చేసినా.. అమరావతిలో అభివృద్ధి ఆగదు, దాని ప్రాశస్త్యం తగ్గదన్న భరోసా వారికి లభించేది. కానీ ‘రద్దు’ అనే మాట ఒకింత వ్యతిరేక భావాన్ని ప్రజలకు కలుగుతుందని చెప్పవచ్చు.

సీఆర్‌డీఏ రద్దు చేసి దాని స్థానంలో ఏఎంఆర్‌డీఏ ఏర్పాటు చేసినా.. రద్దు చేశారన్న భావన మాత్రం ప్రజల్లో ఉండే అవకాశం ఉంది. రేపు ఉదయం ప్రభుత్వ వ్యతిరేక పత్రికల్లో సీఆర్‌డీఏ రద్దు అనే అంశమే ప్రముఖంగా వచ్చినా ఆశ్చర్యం లేదు.