iDreamPost

జగన్ ప్రభుత్వ మరో సంచలన నిర్ణయం, మూడో వంతు పంట ప్రభుత్వమే కొంటుంది

జగన్ ప్రభుత్వ మరో సంచలన నిర్ణయం, మూడో వంతు పంట ప్రభుత్వమే కొంటుంది

అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నది రైతులకు వర్తించే నానుడి. అలాంటి రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీరా చేతికి వచ్చే సమయంలో ఏర్పడే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్ చేసుకుందామంటే ధర ఉండదు, ధర ఉంటే కొనేవారు ఉండరు అన్నట్టుగా సాగుతోంది. చాలాకాలంగా దేశవ్యాప్తంగా రైతులకు ఇదే పెద్ద సమస్యగా ఉంటోంది. మద్ధతు ధర, గిట్టుబాటుధర అంటూ ప్రకటనలు కేవలం మాటలకే పరిమితం అయిపోతున్నాయి. ఇలాంటి సమయంలో రైతు సౌబాగ్యం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పంట సాగుకోసం అనేక పథకాలు అందిస్తూ రైతులకు చేదోడుగా ఉంటున్న సర్కారు ఇప్పుడు పంట విషయంలో కూడా తమదే బాధ్యత అంటోంది. రైతు భరోసా వంటి ద్వారా నేరుగా రైతు ఖాతాలోకే సహాయాన్ని ఖరీఫ్‌ కి ముందుగానే అందించడంలో జగన్ చూపుతున్న శ్రద్ధ సత్ఫలితాన్నిస్తుందనే అంతా ఆశిస్తున్నారు. ఇప్పుడు అందుకు తోడుగా మూడో వంతు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో ఏపీలో రైతుకి వ్యవసాయం దండగ కాదు పండుగ అనే పరిస్థితి వస్తుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది.

గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అని వ్యాఖ్యానిస్తే వైఎస్సార్ హయంలో రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి వాటి ద్వారా పండుగగా మలిచారు. ఇప్పుడు జగన్ హయంలో దానిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. వ్యవసాయదారులకు తన ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించిన జగన్ దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ మిషన్, రైతు భరోసా కేంద్రాల ప్రారంభం వంటి ద్వారా కీలక అడుగులు వేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో రైతులు పూర్తిగా నష్టపోకుండా ఆదుకోవడానికి ఉదారంగా వ్యవహరించారు. ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న వారి పంట మార్కెటింగ్ కి తగిన ఏర్పాట్లు చేయడం లో చిత్తశుద్దిని చాటుకున్నారు.

తాజాగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో పంటల ప్రణాళిక, ఇ–మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫాంపై సమీక్షా సమావేశం జరిగింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్‌ చేయాలని సీఎం సూచించారు. తద్వారా రైతులు నష్టపోకుండా ముందస్తు ప్రణాళిక తోడ్పడుతుందన్నారు. జిల్లా, మండల స్థాయిల్లో అగ్రికల్చర్‌ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్‌చేయలేని పంటలు వేస్తే.. రైతులు నష్టపోతారనే విషయంపై అవగాహన పెంచాలని సూచించారు. ఈ క్రాపింగ్ పై గైడ్ లైన్స్ ఏర్పాటు చేయాలని, ఎస్ ఓ పీ సిద్ధం చేయాలని తెలిపారు.

రాష్ట్రంలో రైతులు పండించే మొత్తం ఉత్పత్తుల్లో మూడో వంతు ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతీ పంటను 30శాతం చొప్పున కొనుగోలుచేయాలని నిశ్చయించారు. అంతేగాకుండా మిగతా 70శాతం పంటకూడా అమ్ముడయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. దానికి అనుగుణంగా ఇ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. జనతా గ్యారేజ్ లు కూడా దానికి దోహదపడతాయని చెబుతున్నారు. నాణ్యత కలిగిన ఉత్పత్తులను ఈ మార్కెటింగ్ లో అమ్ముకునేందుకు అనుగుణంగా గ్రేడింగ్ సహా అన్నింటిపైనా రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు అండగా ఉంటాయని చెబుతున్నారు. మొత్తంగా వ్యవసాయంలో పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక సతమతం అవుతున్న వారికి సర్కారు అండగా ఉంటుందనే విషయం జగన్ స్పష్టం చేయడంతో ఏపీలో వ్యవసాయరంగానికి తగిన సహకారం అందుతున్నట్టేనని అంతా ఆశిస్తున్నారు. ఆచరణ కూడా అందుకు అనుగుణంగా ఉంటే రైతులకు పెద్ద స్థాయిలో మేలు చేసినట్టవుతుందనడంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి