ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. అన్ని రంగాల్లోనూ స్త్రీలు ముందంజలో ఉండాలని కోరుకుంటోంది. అందుకోసం వారికి అన్ని విధాలా సాయపడుతోంది. మహిళల కోసం వరుసగా నాలుగో ఏడాదీ ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకం అమలుకు సీఎం జగన్ శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఏపీ వ్యాప్తంగా అర్హత కలిగిన 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1.05 కోట్ల మంది అక్కాచెల్లెళ్లు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంక్ అకౌంట్స్‌లోకి జమ చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేశారు. తాజాగా ఇచ్చిన రూ.1,353 కోట్లతో కలిపి వైఎస్సార్ సున్నా వడ్డీ స్కీమ్ కింద ఇప్పటిదాకా అందించిన మొత్తం సాయం రూ.4,969 కోట్లు అవుతుంది. పేద అక్కాచెల్లెళ్లకు సాధికారత కల్పిస్తూ, వాళ్లు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేందుకు సున్నా వడ్డీకే రుణాలు అందిస్తోంది సర్కారు. పేద మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకు లోన్స్ సరైన టైమ్‌లో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కాచెల్లెమ్మలపై వడ్డీ భారం పడకుండా వారి తరఫున ఆ భారాన్ని వైఎస్సార్ సున్నా వడ్డీ కింద నేరుగా బ్యాంక్ అకౌంట్స్‌లో సర్కారు జమ చేస్తోంది.
వెఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మహిళల జీవనోపాధి మెరుగుపడేలా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. గతంలో మహిళల్ని మోసం చేసిన ఘనత నారా చంద్రబాబుదని.. తమ ప్రభుత్వం అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడేదని జగన్ స్పష్టం చేశారు. వడ్డీ మాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశారని ఆయన మండిపడ్డారు. 2016లో సున్నా వడ్డీ స్కీమ్‌ను చంద్రబాబు రద్దు చేశారని జగన్ గుర్తుచేశారు. ఇలాంటి స్కీమ్ దేశ చరిత్రలోనే మరెక్కడా లేదన్నారు. స్త్రీ పక్షపాత సర్కారుగా తాము అడుగులు వేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.