ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో జోరు పెంచారు. ఆయన ఇప్పటికే చాలా స్కీములు అమలు చేస్తున్నారు. ఇప్పుడా వేగాన్ని మరింత పెంచారు. రాష్ట్రంలోని నాలుగు కులాలకు రూ.లక్ష సాయం చేసేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ముస్లిం దూదేకుల సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. దూదేకులకు అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఒక డిమాండ్‌ను ఆయన ఇవాళ పరిష్కరించారు. ఈ మేరకు ఏపీ సర్కారు ఈ రోజు జీవో కూడా జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా నిర్ణయంపై ముస్లిం దూదేకుల సామాజికవర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ జీవో విషయంలో తాము చేసిన ప్రయత్నాలు సక్సెస్ కావడం మీద ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ కూడా సంతోషం తెలిపింది. ఇక, సాధారణ ముస్లింలకు ప్రభుత్వం వైఎస్సార్ షాదీ తోఫా స్కీమ్ కింద పెళ్లి చేసుకుంటే రూ.లక్ష చొప్పున బహుమతిగా అందిస్తోంది. కానీ ఏపీ ముస్లింల్లో ఉపజాతిగా పరిగణిస్తున్న దూదేకులు, నూర్ బాషాలు, పింజానీ, లదాఫ్లకు మాత్రం వైఎస్సార్ షాదీ తోఫా స్కీమ్ కింద రూ.50 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు.
షాదీ తోఫా కింద తమకు అందించే సాయాన్ని రూ.లక్షకు పెంచాలని దూదేకులు, నూర్ బాషాలు, పింజానీ, లదాఫ్ కులస్తులు కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయంపై దూదేకుల పొలిటికల్ జేఏసీ కూడా పోరాటాలు చేసింది. ఎట్టకేలకు దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం దూదేకులకు వైఎస్సార్ షాదీ తోఫా స్కీమ్ కింద ఇచ్చే మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ శనివారం ఓ జీవో జారీ చేసింది. దూదేకుల ముస్లిం కులస్తులకు వైఎస్సార్ షాదీ తోఫా స్కీమ్‌లో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎం ఇంతియాజ్ ఇవాళ ఒక జీవో జారీ చేశారు. దీని ప్రకారం.. ఇక మీదట రాష్ట్రంలో దూదేకులకు షాదీ తోఫా కింద ప్రభుత్వం రూ.లక్ష అందించనుంది.