iDreamPost

కరోనాపై జగన్ చెప్పింది.. అక్షర సత్యం

కరోనాపై జగన్ చెప్పింది.. అక్షర సత్యం

‘వ్యాక్సిన్ వచ్చేదాకా కరోనాతో మనం సహజీవనం చెయ్యాలి’.. ఏడాది కిందట ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇది. నిజానికి ఈ కామెంట్లతో దేశంలో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు కూడా చేయని ధైర్యం ఆయన చేశారు. ప్రజలు భయపడుతారని తెలిసినా, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయని తెలిసినా ఆయన తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశారు. కానీ అన్ని వైపుల నుంచి జగన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలోనూ హేళన చేస్తూ మాట్లాడారు. కానీ చివరికి ఏమైంది. ‘నవ్విన నాప చేనే పండింది’ అన్న చందంగా ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యమయ్యాయి.

మద్దతుగా ఎన్నో గొంతులు

కరోనా కల్లోలం మొదలయ్యే నాటికి జగన్ ప్రభుత్వానికి ఏడాది కూడా నిండలేదు. కానీ తలపండిన నేతలకు సాధ్యం కాని రీతిలో సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉంది కాబట్టే కరోనాతో సహజీవనం చెయ్యాలని ఆయన చెప్పగలిగారు. అలాగని ఆయన నిర్లక్ష్యంతోనో, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం చేతగాకో చెప్పిన మాటలు కావవి. ఓ కొత్త వైరస్ గురించి ముందుగా, ఎంతో ఆలోచనతో చేసిన కామెంట్స్. తొలుత ఆయనకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నుంచి మద్దతు దొరికింది. తర్వాత ఎందరో గొంతు కలిపారు. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెప్పింది. ‘సహజీవనం తప్పదు. కరోనా సీజనల్ వ్యాధిగా మారొచ్చు’ అని కామెంట్ చేసింది.

‘పారాసిటమాల్’ పైనా విమర్శలు

కరోనాను అడ్డుకునేందుకు బ్లీచింగ్ పౌడర్ తో క్లీన్ చేసుకోవాలని, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు అని వైఎస్ జగన్ చేసిన కామెంట్లపైనా ఎంతో మంది విమర్శలు చేశారు. ‘పారాసిటమాల్ ముఖ్యమంత్రి’ అంటూ ఎద్దేవా చేశారు. నిజానికి అప్పటికి కరోనా గురించి బయటికి తెలిసింది చాలా తక్కువ. జ్వరం, దగ్గు, కోల్డ్ మాత్రమే అప్పటికి డబ్ల్యూహెచ్ఓ గుర్తించిన మేజర్ సింప్టమ్స్. కరోనా వచ్చిన వాళ్లకు జ్వరం ఉంటే ముందుగా ఇచ్చేది పారాసిటమాల్ టాబ్లెట్టే. జ్వరం వచ్చే ఏ రోగానికైనా పారాసిటమాల్ ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఉపరితలంపై కరోనా వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ తో క్లీన్ చేస్తారు. ఇప్పటికే అదే చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ నాడే చెప్పారు జగన్. కానీ ఈ మాత్రం అర్థం కానీ ప్రతిపక్ష నాయకులు చిల్లర కామెంట్లు చేశారు.

టెస్టులు, ట్రీట్ మెంట్ లోనూ..

ఏప్రిలో 5వ తేదీ వరకు 1,52,39,114 మందికి ఏపీలో కరోనా టెస్టులు చేశారు. ఈ విషయంలో తెలంగాణ సహా చాలా రాష్ట్రాల కంటే ఏపీ ముందుంది. 9 లక్షల మంది వైరస్ బారిన పడగా, 7,244 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇన్ని కేసులున్నా డెత్ రేట్ చాలా తక్కువ. ఏపీ కన్నా తక్కువ కేసులే ఉన్న తమిళనాడులో 12,700 మందికిపైగా చనిపోయారు. ఏడు లక్షల లోపు కేసులున్న ఢిల్లీలో 11 వేల మంది, 6.3 లక్షల కేసులే ఉన్న యూపీలో 8,800 పైనే మృతి చెందారు. 6 లక్షలు కూడా కేసులు లేని బెంగాల్ లో 10 వేల మందికి పైగా చనిపోయారు. ట్రీట్ మెంట్ విషయంలో కూడా జగన్ ముందు జాగ్రత్తతో వ్యవహిరించారు. కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్య శ్రీలోకి చేర్చారు. వ్యాధి సోకడం కంటే.. ‘చికిత్సకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి’ అని బాధితులు భయపడకుండా, లక్షలాది మంది ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉపశమనం కల్పించారు. కేంద్ర పథకమైన ఆయుష్మాన్ భారత్ పథకాన్నీ అమలు చేస్తున్నారు. హోం అసోలేషన్ లో ఉండేటోళ్లకు కిట్లు ఇస్తున్నారు. వలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని, ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

Also Read : చరిత్రను తిరగరాస్తున్న వైఎస్‌ జగన్‌

దాపరికంలేదు.. అబద్ధాలు లేవు..

ఏపీలో మే నుంచి కేసులు పెరుగుతూ వచ్చాయి. కానీ ఏనాడూ కేసుల సంఖ్యను దాచి చూపలేదు. కరోనా లెక్కల్లో మోసం చేయలేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పారు. టెస్టులు తగ్గించలేదు. టెస్టుల కోసం వచ్చిన వారిని వెనక్కి పంపలేదు. చాలా రాష్ట్రాల్లో కరోనా టెస్టులు చేయడం లేదని, టెస్టుల కోసం వచ్చిన వారిని వెనక్కి పంపుతున్నారని వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ట్రీట్ మెంట్ అందక చనిపోయిన వాళ్ల గురించి, ఒకే బెడ్ పై ఇద్దరు పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఇవ్వడం గురించి కథనాలు వస్తున్నాయి. కానీ ఆ పరిస్థితి ఏపీలో ఎప్పుడూ, ఎక్కడా రానివ్వ లేదు. అవసరమైతే గ్రామ సచివాలయాలను కూడా కరోనా ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలనే మొదట్లోనే వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు.

వ్యాక్సిన్ లోనూ ముందు వరుసలోనే..

ఏపీలో ఇప్పటిదాకా 31,79,087 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయింది. ఇందులో 27,39,725 మందికి ఫస్ట్ డోసు, 4,39,362 మందికి సెకండ్ డోసు పంపిణీ జరిగింది. పక్క రాష్ట్రం తెలంగాణ కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. అక్కడ ఇప్పటిదాకా 15,54,772 డోసులు మాత్రమే పంపిణీ పూర్తయింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను ఏపీ ప్రభుత్వం మరింత స్పీడప్ చేసింది. రానున్న 90 రోజుల్లోపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. త్వరలో గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా వ్యాక్సినేషన్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఒక టార్గెట్ పెట్టుకుని మరీ జగన్ ముందుకు వెళ్తున్నారు. కరోనా లేని సమాజం కన్నా ముందుగా.. వ్యాక్సినాంధ్రప్రదేశ్ కు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు.

అందుకే నాయకుడయ్యాడు..

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి 3 నెలలైనా జనాల్లో ఇంకా అపోహలు పోలేదు. ఈ క్రమంలో జగన్ మొన్ననే వ్యాక్సిన్ తొలి టీకా వేయించుకున్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ముందడుగు వేశారు. 45 ఏండ్లు పైబడ్డ వాళ్లు వ్యాక్సిన్ వేయంచుకోవచ్చని కేంద్ర చెప్పడంతో ఆయన టీకా వేయించుకున్నారు. నిజానికి తనకు అవకాశం ఉంటే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కొత్తలోనే వేయించుకునే వారు. వయసులు, కేటగిరీల వారీగా కేంద్రం వ్యాక్సినేషన్ చేపట్టడంతో జగన్ ఇప్పుటిదాకా ఆగాల్సి వచ్చింది. లేకపోతే ముందు తాను వ్యాక్సిన్ వేయించుకుని, తర్వాత ప్రజలకు చెప్పేవారు. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లో సీఎంలు వ్యాక్సిన్ వేయించుకోలేదు. అంతెందుకు కరోనా విషయంలో జగన్ పై విమర్శలు చేస్తున్న చాలా మంది ప్రతిపక్ష నేతలు, పార్టీల అధినేతలు టీకా వేయించుకోలేదు. అదీ వాళ్ల చిత్తశుద్ధి.

సెకండ్ వేవ్ కు ఎన్నికలకు లింకులా?

కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే లక్షకు పైగా కేసులు వచ్చాయి. కానీ ఏపీలో మాత్రమే కేసులు పెరుగుతున్నట్లుగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కరోనా మొదలయ్యాక చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ లోనూ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్నాయి. అక్కడా కేసులు పెరుగుతున్నాయి. మరి ఎన్నికలు ఆపారా? ఒకవేళ ఎన్నికలు ఆపితే కరోనా వ్యాప్తి తగ్గుతుందా? మళ్లీ లాక్ డౌన్లు పెట్టుకుని అటు ప్రజలు.. ఇటు ప్రభుత్వాలు ఇక్కట్లు పడాలా? వీటికి ప్రతిపక్షాల వద్ద ఎలాంటి సమాధానం ఉండదు. కంటి కనిపించని కరోనా మహమ్మారి.. మనకు తెలియకుండానే ఇప్పుడు మన ఇళ్లలోకి వచ్చేసింది. నిజంగా వైఎస్ జగన్ చెప్పినట్లు ఇప్పుడు సహజీవనం తప్ప ఇంకో మార్గంలేదు. వ్యాక్సిన్ వేయించుకోవడంతోపాటు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం మానుకుని, రాష్ట్ర అభివ`ద్ధికి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే హుందాగా ఉంటుందని జనం అభిప్రాయపడుతున్నారు.

Also Read : జగన్‌కు అంత క్రేజ్‌..! అందుకేనా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి