iDreamPost

చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ!!!

చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ!!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. అసెంబ్లీ నిర్వహణ కూడా ప్రజలంతా శభాష్ అనే స్థాయిలో అయితే లేదు. అయితే ఈ తప్పులన్నింటినీ తప్పు అని చెప్పే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఉందా అంటే మాత్రం టిడిపి మీడియాతో పాటు ఆ పార్టీ నేతలు కూడా అవునని సమాధానం చెప్పలేని పరిస్థితులే ఉన్నాయి.

ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్ పేరు పెడుతున్నారని, ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులేస్తున్నారని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. అయితే చంద్రన్న పథకం పేరుతో స్వయంగా తన పేరుతోనే పథకాలు ప్రారంభించిన చంద్రబాబుకు ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఉంటుందా? ఇక 2014 నుంచీ 2019 వరకూ ఆంధ్రప్రదేశ్‌పై పడిన పచ్చ రంగు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అన్నింటికీ మించి ఇప్పుడు అసెంబ్లీలో కూడా సిఎం నుంచీ వైకాపా ఎమ్మెల్యేల వరకూ అందరూ కూడా చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. ఓడిపోయిన టిడిపి నేతలతో పాటు, టిడిపి మీడియా అంతా కూడా చంద్రబాబుకు అవమానం జరిగిపోతోందని గగ్గోలు పెడుతోంది. నిజానికి వీళ్ళ మాటలకు ప్రజల్లో స్పందన వచ్చి ఉంటే ఈ పాటికే చంద్రబాబుపై సానుభూతి వెల్లువలా కురవాలి. అయితే ప్రజలు మాత్రం చంద్రబాబు హింసించిన దాంతో పోలిస్తే ఇదెంత అని స్పందిస్తున్నారు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా చంద్రబాబు చేసిన తప్పులకు ఇప్పుడు అనుభవిస్తున్నాడనే ఎక్కువ మంది చెప్తున్నారు.

 ఇలాంటి స్పందనలు చూసి వైకాపా నాయకులు మురిసిపోవడానికి కూడా ఏమీలేదు. రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని చెప్తున్న జగన్ కొన్ని విషయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబుకంటే చాలా బెటర్ అనిపిస్తున్నాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, పాలనలో, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయాల్లో ప్రోగ్రెస్ చూపిస్తున్నాడు. అయితే పదేళ్ళపాటు తనకు నరకం చూపించారన్న బాధతోనో, ఆవేశంతోనో ఏమో కానీ చంద్రబాబును బాధపెట్టే విషయం దగ్గరకు వచ్చేసరికి చాలా సీరియస్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది.

 ప్రత్యర్థి నాయకుల విషయంలో కూడా చూసీ చూడనట్టుపోతేనే వైఎస్ జగన్‌కి ఇంకా ఎక్కువ పేరు వస్తుందనడంలో సందేహం లేదు. ప్రజల సొమ్మును కాపాడే విషయంలో జగన్ తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా అందరూ హర్షిస్తారు. కానీ మరీ చంద్రబాబును మాటలతో బాధపెట్టాలన్న ప్రయత్నాలను మాత్రం ప్రజలు అంగీకరించకపోవచ్చు. అసెంబ్లీతో పాటు బయట కూడా వైకాపా నాయకుల మాటల్లో, చేతల్లో కనిపిస్తున్న తప్పులను తప్పు పట్టే అర్హత చంద్రబాబుకు అయితే కచ్చితంగా లేదని విమర్శకులు కూడా చెప్తున్నారు. అయితే ప్రజల దగ్గర చనిపోయిన తర్వాత కూడా గొప్పగా చెప్పుకునేంత పేరు తెచ్చుకోవాలనుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల విషయంలో చూసీ చూడనట్టుగా పోతేనే ఇంకా పెద్ద నాయకుడు అవుతాడు అన్న సలహాలు మాత్రం ఆలోచనాపరుల నోట వినిపిస్తూ ఉన్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి