iDreamPost

Insurance Policy: అన్ని బీమాలు కవర్‌ చేసేలా.. ఒకే ఒక్క పాలసీ.. రూ.1500 చెల్లిస్తే చాలు..

  • Published Apr 28, 2024 | 1:15 PMUpdated Apr 28, 2024 | 2:37 PM

భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ ఓ వినూత్న పాలసీ తీసుకురాబోతుంది. అన్నీ రకాల పాలసీలను కలిపి.. ఈ సరికొత్త పాలసీని తీసుకు రానున్నారు. ఆ వివరాలు..

భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ ఓ వినూత్న పాలసీ తీసుకురాబోతుంది. అన్నీ రకాల పాలసీలను కలిపి.. ఈ సరికొత్త పాలసీని తీసుకు రానున్నారు. ఆ వివరాలు..

  • Published Apr 28, 2024 | 1:15 PMUpdated Apr 28, 2024 | 2:37 PM
Insurance Policy: అన్ని బీమాలు కవర్‌ చేసేలా.. ఒకే ఒక్క పాలసీ.. రూ.1500 చెల్లిస్తే చాలు..

ఒకప్పుడు బీమా పాలసీ తీసుకోవడం అంటే పేదలు, మరీ ముఖ్యంగా నిరాక్షరాస్యులు దాన్నో పాపంగా చూసేవారు. బతికుండగానే.. చావు గురించి ఆలోచించి పాలసీలు తీసుకోవడం ఏంటి అనుకునేవారు. కానీ కాలం మారింది. దాంతో పాటు అనుకోని ఖర్చులు, అనారోగ్య సమస్యలు, ఇతరాత్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఆస్పత్రి ఖర్చులు, పిల్లల చదువు, భవిష్యత్తు, రిటైర్‌మెంట్‌ తర్వాత ఆదాయం ఇలా అనేక అవసరాల కోసం ఎన్నో రకాల పాలసీలు తీసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇక నేటి కాలంలో ఇంటికో వాహనం తప్పనిసరి అయ్యింది. దాంతో వాటికి సంబంధించి కూడా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే మన అవసరాలకు తగ్గట్టుగా పాలసీలు తీసుకోవాలంటే.. ప్రతి ఒక్కరు ఎంత లేదన్నా 3, 4 పాలసీలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాటికి చెల్లించే ప్రీమియం కూడా భారీగానే ఉంటుంది. ఇన్ని పాలసీలకు డబ్బులు కట్టడం పేద, మధ్యతరగతి వారికి కాస్త ఇబ్బందే అని చెప్పవచ్చు. ఇదుగో ఈ సమస్య పరిష్కారం కోసం వినూత్న పాలసీని తీసుకురానున్నారు. ఆ వివరాలు..

దేశంలోని ప్రజలందరికీ ఇన్సూరెన్స్ అందించాలనే లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) చర్యలు చేపడుతోంది. దేశ ప్రజలందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చేందుకు గానూ ప్రామాణిక పాలసీ.. బీమా విస్తార్‌ను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో గత రెండు రోజుల పాటు నిర్వహించిన బీమా మంథన్ లో భాగంగా ఈ విషయంపై విస్తృతంగా చర్చించినట్లు సంబంధిత శాఖ వర్గాలు పేర్కొన్నాయి. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, ఆస్తి బీమా.. ఇలా అన్ని పాలసీలను కలిపి.. ఒకే పాలసీగా తీసుకురావడమే ఈ బీమా విస్తార్ లక్ష్యం.

ఈ ప్రామాణిక పాలసీ ప్రీమియం ఏడాదికి రూ.1500 గా ఉండే అవకాశం ఉందని బీమా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ పాలసీలో.. జీవిత బీమా పాలసీ కోసం రూ.820, ఆరోగ్య బీమాకు రూ.500, వ్యక్తిగత ప్రమాద బీమాకు రూ.100, ఆస్తి బీమాకు రూ.80 చొప్పున ప్రీమియం ఉండనుందని సమాచారం. అంతేకాకుండా కుటుంబానికి మొత్తానికి వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే అపుడు ఏడాదికి గాను.. రూ.2,420 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ బీమా విస్తార్‌ పాలసీకి సంబంధించి పూర్తి విధి విధానాలను, ఇతర నిబంధనలను ఐఆర్‌డీఏఐ త్వరలోనే అధికారింగా వెల్లడించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

బీమా విస్తార్‌లో భాగంగా జీవిత బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా విలువ రూ.2 లక్షల వరకూ ఉండనుందని తెలుస్తోంది. ఆరోగ్య బీమా పాలసీని హాస్పిటల్ క్యాష్ పేరుతో 10 రోజులగు గానూ రోజుకు రూ.500 చొప్పున గరిష్ఠంగా రూ.5000 వరకు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఎలాంటి బిల్లులు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆస్తి బీమా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకూ ఉండనుంది. వ్యక్తులు, తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బీమా విస్తార్ ఎంతో ఉపయోగపడుతుందని బీమా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. తక్కువ ప్రీమియం ఉండటంతో ఎంతో మంది కొత్తగా బీమా పాలసీలు తీసుకుని ఇన్సురెన్స్‌ పరిధిలోకి వస్తారని ఐఆర్‌డీఐ భావిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి