iDreamPost

జగన్‌ రద్దు చేస్తే.. చంద్రబాబు పెడతారట..

జగన్‌ రద్దు చేస్తే.. చంద్రబాబు పెడతారట..

శాసన మండలి రద్దు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దానికి తెరతీస్తోంది. మండలి అవసరమా..? అంటూ నిన్న అసెంబ్లీలో సీఎం జగన్‌ మాట్లాడగా.. జగన్‌ రద్దు చేస్తే తాను వచ్చాక మళ్లీ మండలిని ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ రోజు మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల్సీలకు భవిష్యత్‌పై భరోసా ఇచ్చారు.

మండలిని రద్దు చేసే అధికారం ముఖ్యమంత్రికి లేదన్న చంద్రబాబు అసెంబ్లీ తీర్మానం పార్లమెంట్‌ ఆమోదించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ వెంటనే ఈ పని చేబోదని, మండలి రద్దు ప్రక్రియ పూర్తి కావాలంటే ఒకటిన్నరేళ్లు పడుతుందని పేర్కొన్నారు. అప్పటి వరకు ఎమ్మెల్సీలందరూ కొనసాగుతారని, ఆ తర్వాత రద్దు అయితే ఒకటి రెండేళ్లు పదవీ కాలం కోల్పోతారన్నారు. అయితే మండలిని మళ్లీ ఏర్పాటు చేసి కోల్పోయిన పదవీ కాలానికి నాలుగైదు రెట్లు ఎక్కువ పదవీ కాలం వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.

సోమవారం శాసన సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఆదివారం టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో చర్చించి సభలో వ్యవహరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తామని తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నించిందని, అయినా తమ ఎమ్మెల్సీలు నీతి, నిజాయతీకి కట్టుబడి ఉన్నారని కొనియాడారు. తన జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని వైఎస్‌ జగన్‌పై విమర్శలు సంధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి