iDreamPost

గోరంట్ల నిబద్ధతను ఇకనైనా బాబు గుర్తిస్తారా..?

గోరంట్ల నిబద్ధతను ఇకనైనా బాబు గుర్తిస్తారా..?

గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పరిచయం అవసరంలేని పేరు. తెలుగుదేశం పార్టీలోకి ఎంతో మంది నేతల రాకపోకలు సాగినా..అవిర్భావం నుంచి ఆ పార్టీలో నిబద్ధతతో ఉన్న సీనియర్‌ నేత బుచ్చయ్య చౌదరి. టీడీపీ తొలి ఎన్నికల్లో గెలిచిన నేతల్లో ఇప్పటికీ క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ శాసన సభ్యుడిగా ఉన్న ఏకైక నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 1995 వైశ్రాయ్‌ ఘటన సయమంలో ఎన్టీఆర్‌ పక్షాన నిలిచి మంత్రిపదవి కోల్పోయినా.. ఆ తర్వాత కూడా పార్టీ తరఫున ప్రతి ఎన్నికలోనూ సీటు సంపాధించారంటే ఆయనకున్న ప్రజా బలం, మేథస్సు కారణమని చెప్పవచ్చు.

గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని నరసాయపాలెం గ్రామానికి చెందిన బుచ్చయ్య చౌదరి రాజకీయ ప్రస్థానం అంతా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రారంభమై కొనసాగుతోంది. అప్పట్లో రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి మద్యం వ్యాపారం చేసేవారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ సూచన మేరకు మద్యం వ్యాపారం వదిలేసి బ్రిక్స్, కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారంలోకి మళ్లారు.

ఎన్టీఆర్‌ వీరాభిమాని, అభిమాన సంఘాల్లో క్రియాశీలకంగా ఉన్న గోరంట్ల తమ్ముడు రాజేంద్ర ప్రసాద్‌ టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా పని చేశారు. బుచ్చయ్య చౌదరి తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్‌గా బాధ్యలు నిర్వర్తించారు. తొలిఎన్నికల్లో రాజేంద్రప్రసాద్‌కు పోటీ చేసే అవకాశం రాగా.. ఆయన తన అన్న బుచ్చయ్య చౌదరిని సిఫార్సు చేశారు. అలా బుచ్చయ్య చౌదరి తొలిసారి రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసి గెలిచారు.

రాజమండ్రి రాజకీయాల్లో ఆది నుంచి స్థానికేతరులదే హవా. 1980వ దశకంలో రాజమండ్రి మున్సిపల్‌ చైర్మన్‌ అంగిటపల్లి చిన ఎరుకల రెడ్డి (ఏసీవై రెడ్డి) రెండు దఫాలు పని చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద ఇర్లపాడు గ్రామానికి చెందిన ఏసీవై కుటుంబం వ్యాపార నిమిత్తం 1960 దశకంలో రాజమండ్రి వెళ్లింది. రాజమండ్రిలో హోటల్స్‌ వ్యాపారం విజయవంతంగా నడిపింది. అప్సర, అజంతా హోటల్స్‌ అంటే రాజమహేంద్రవరంలో ఇప్పటికీ ఫేమస్‌.

1983, 85 ఎన్నికల్లో వరుస విజయాలతో ఊపుమీద ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఏసీవై రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి ఓడించారు. ఆ సమయంలో ఏసీవై రెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా ఉండగా.. పార్టీ ఆదేశాల మేరకు ఆ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

1994 ఎన్నికల్లో మళ్లీ బుచ్చయ్య చౌదరి మూడో దఫా గెలిచి ఎన్టీఆర్‌ కేబినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. 1995 ఆగస్టు సంక్షోభం లేదా వైశ్రాయ్‌ ఘటనలో టీడీపీ చంద్రబాబు హస్తగతం అయ్యే వరకూ బుచ్చయ్య చౌదరి మంత్రిగా పని చేశారు. ఆయన జీవితంలో మంత్రిగా పని చేయడం అదే తొలిసారి, తుది సారి కూడా. ఎన్టీఆర్‌ తర్వాత లక్ష్మీ పార్వతి వర్గంలో బుచ్చచౌదరి క్రియాశీలకంగా పని చేసినా 1999 టీడీపీ ఘర్‌ వాపసీలో తిరిగి చంద్రబాబు వర్గంలోకి వచ్చారు. మళ్లీ రాజమండ్రి నుంచి పోటీ చేసి గెలిచారు. 2004, 2009లో రౌతు సూర్యప్రకాశరావు చేతిలో ఓడిపోయారు.

2014లో బుచ్చయ్య చౌదరికి సీటు దక్కడం అనుమానమే అన్న ప్రచారం సాగింది. ఒకానొక దశలో ఆయనకు టిక్కెట్‌ రాదని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరిగింది. బీజేపీ పొత్తులో భాగంగా 2014 రాజమండ్రి సీటు స్థానికుడైన డాక్టర్‌ ఆకుల సత్యనారాయణకు కేటాయించారు. బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్‌ సీటను తెచ్చుకున్నారు. టిక్కెట్‌ రాదని ప్రచారం సాగగా.. బుచ్చయ్య చౌదరి సిటీ, రూరల్‌ నియోజకవర్గాలకు బీ ఫారం తెచ్చుకొని తన సత్తాను చాటారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో ఏకఛత్రాధిపత్యం సాగించిన బుచ్చయ్య చౌదరికి 1994 తర్వాత మళ్లీ మంత్రి అయ్యే ఛాన్స్‌ మాత్రం దక్కలేదు. చంద్రబాబు మూడు దఫాలు ప్రభుత్వం ఏర్పాటు చేసినా గతంలో లక్ష్మీ పార్వతి వర్గం అనే ముద్రతో బుచ్చయ్య చౌదరిని కేబినెట్‌లోకి తీసుకోలేదు. 2018లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పకుండా అవకాశం వస్తుందని బుచ్చయ్య చౌదరి ఆశించారు. కానీ చంద్రబాబు పార్టీనేతలను కాదని వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన వారిలో నలుగురికి మంత్రిపదవులు ఇచ్చారు. దీంతో బుచ్చయ్య చౌదరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చినట్లుగా బుచ్చయ్య చౌదరి అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు. చంద్రబాబు తీరును ఎండగట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వరద తగ్గిన గోదారమ్మలాగే చల్లబడ్డారు.

1983 నుంచి 2014 వరకూ రాజకీయ అవినీతి మరకలు బుచ్చయ్య చౌదరికి అంటలేదు. కానీ ఏడు పదుల వయస్సులో ఉన్న గోరంట్ల.. ఇక ఇదే చివరి సారి అనుకున్నారేమో కానీ 2014లో అవినీతి ఆరోపణలు వెంటాడాయి. అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో బుచ్చయ్య చౌదరి కూడా భూములు కొన్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే వీటిని బుచ్చయ్య తోసిపుచ్చారు.

చంద్రబాబు నాయుడు తనకు గుర్తింపు, గౌరవం ఇవ్వకపోయినా సరే గోరంట్ల పార్టీ పట్ల విధేయతతో ఉన్నారు. పార్టీ పట్ల గోరంట్ల నిబద్ధతను ఎవరూ వేలెత్తిచూపేలా వ్యవహరించలేదు. ఎంత అసంతృప్తి ఉన్నా బుచ్చయ్య చౌదరి పార్టీ మారుతున్నారనే ప్రచారం ఎన్నడూ జరగలేదంటే నేటి రాజకీయాల్లో చాలా అరుదు. చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా సరే గోరంట్ల పార్టీ కోసం నిబద్ధతతో పని చేశారు. 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ విధానాలను అసెంబ్లీలో గట్టిగా వినిపించారు.

2019లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ గోరంట్ల టీడీపీ తరఫున చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో పదవులతోపాటు అన్ని విధాలుగా మేలు పొందిన నేతలు నేడు కనిపించకపోయినా.. గోరంట్ల మాత్రం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. న్యూస్‌ ఛానెల్‌ డిబేట్లలో పార్టీ వాణిని వినిపిస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన తన వయస్సు (75)కు మించి చేస్తున్న విమర్శల వల్ల ప్రత్యర్థులకు టార్గెట్‌గా మారుతున్నారు.

75 ఏళ్ల వయస్సులోనూ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉంటూ పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న గోరంట్ల నిబద్ధతను ఇకనైనా చంద్రబాబు గుర్తిస్తారా..? లేదా..? కాలమే చెప్పాలి. గోరంట్ల నిబద్ధతను గుర్తించే అవకాశం చంద్రబాబుకు మళ్లీ వస్తుందా..? అనేది ప్రస్తుత పరిణామాల్లో మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అయితే ఆ అవకాశం వచ్చినా..? రాకపోయినా…? తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారని మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి