iDreamPost

దేశంలో బీజేపీకి ఎదురుగాలి : కార‌ణాలు ఇవేనా..?

దేశంలో బీజేపీకి ఎదురుగాలి : కార‌ణాలు ఇవేనా..?

ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లైన పంజాబ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరిగిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేసింది. అది వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రం కావ‌డంతోనే బీజేపీ ఓడింద‌ని అనుకున్నారు.

మూడు రోజుల క్రితం కర్ణాటకలో కూడా బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 8 జిల్లాల్లోని 10 స్థానిక సంస్థల్లో 263 వార్డులకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 120 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆశ్చర్యకరంగా బీజేపీ కంటే జేడీఎస్ మెరుగైన ఫలితాలు రాబట్టింది. బీజేపీ 57 స్థానాలకే పరిమితం కాగా, జేడీఎస్ 66 స్థానాల్లో విజయం సాధించింది. వైర‌స్ క‌ట్ట‌డిలో విఫ‌లం కావ‌డంతోనే ఫ‌లితాలు ఇలా వ‌చ్చాయ‌ని భావించారు.

తాజాగా నిన్న విడుద‌లైన ఐదు రాష్ట్రాల స‌హా, తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో కూడా బీజేపీకి ప‌రాభ‌వం త‌ప్ప‌డం లేదు. దీంతో అపజయాలపై భార‌తీయ జ‌న‌తా పార్టీ లోనే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బెంగాల్ తమిళనాడు కేరళలో బీజేపీకి భంగపాటు ఎదురైంది. చిన్న రాష్ట్రాలు అసోం పుదుచ్చేరిలో మాత్రమే బీజేపీ ఉనికి చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అయితే బీజేపీకి తీవ్ర నిరాశ ఎదురైంది. తిరుపతి నాగార్జున సాగర్ లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కించుకోని పరిస్థితి ఏర్పడింది. దుబ్బాకలో విజయం.. జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు సాధించడంతో నాగార్జున సాగర్ లోనూ పాగావేయాలని బీజేపీ భావించింది. కానీ పరాజయం మాత్రం తప్పలేదు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు.

నాగార్జున సాగర్ లో బీజేపీ అభ్యర్థి రవికుమార్ కు 7159 ఓట్లు దక్కాయి. అయితే గత ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కంకణాల నివేదిత రెడ్డికి 2675 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను పెంచుకుంది. అయితే కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయం అని ప్రచారం చేసుకుంటున్న బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం రుచించడం లేదు. ఇక్కడే కాదు.. ఏపీలోనూ రెండో స్థానంలో నిలుస్తామన్న బీజేపీకి శృంగభంగం ఎదురైంది. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు కేవలం 40వేల ఓట్లపైనే వచ్చాయి. అదే టీడీపీ అభ్యర్థికి 3 లక్షలపైన ఓట్లు వచ్చాయి. ఇక గెలిచిన వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 5 లక్షలకు పైన ఓట్లు వచ్చాయి. టీడీపీని మూడో స్థానానికి నెట్టివేస్తామని.. రెండో స్థానంలోకి వస్తామన్న బీజేపీ ఆశలు నెరవేరలేదు.

ఇక బెంగాల్ లోనూ మమతను గద్దెదించుతామని ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా మోహరించినా కూడా వారి ఆశలు నెరవేరలేదు. ఘోరంగా ఓడిపోయారు. ఇక తమిళనాడు కేరళలోనూ బీజేపీ తేలిపోయింది. డబుల్ డిజిట్ కు చేరుకోలేదు. దీంతో బీజేపీకి ఈ ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో భంగపాటు ఎదురైందని చెప్పకతప్పదు. నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, ప్రైవేటీక‌ర‌ణ విధానాలు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల విక్ర‌యాలు వంటి అంశాలు బీజేపీ ఓటమికి కొన్ని కార‌ణాలుగా ప‌లువురు విశ్లేషిస్తున్నారు. వీటికి తోడు స్థానిక రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ పార్టీకి ఫ‌లితాలు అనుకూలించ‌లేద‌ని తెలుస్తోంది.

కేర‌ళ‌లో ఉన్న ఖాతా కూడా క్లోజ్

కేర‌ళ‌లో బీజేపీకి దిమ్మ‌దిరిగే షాక్ త‌గిలింది. ఎన్నిక‌ల‌కు ముందు కేర‌ళ‌లో 35 స్థానాలు గెలుస్తామ‌ని ప్ర‌క‌టించిన ఆ పార్టీ క‌నీసం ఖాతా కూడా తెర‌వ‌లేక‌పోయింది. ఇంత‌కు ముందు ఉన్న ఒక్క స్థానం కూడా కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ త‌న సిట్టింగ్ స్థానం నెమోమ్‌లో కూడా కోల్పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కే సురేంద్ర‌న్ స‌హా న‌టుడు సురేశ్ గోపీ, మెట్రోమ్యాన్ శ్రీధ‌ర‌న్ కూడా ఓట‌మి పాల‌య్యారు. నెమోమ్ స్థానంలో మొద‌ట బీజేపీ అభ్య‌ర్థి రాజ‌శేఖ‌ర‌న్ ఆధిక్యంలో నిలిచినా.. త‌ర్వాత మూడోస్థానానికి ప‌రిమితమ‌య్యారు. ఈ స్థానం నుంచి ఎల్డీఎఫ్ అభ్య‌ర్థి శివ‌న్‌కుట్టీ 2025 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. అటు మెట్రోమ్యాన్ శ్రీధ‌ర‌న్‌ను పాల‌క్క‌డ్ స్థానంలో ఎల్డీఎఫ్ అభ్య‌ర్థి ష‌ఫీ పారంబిల్ 2657 ఓట్ల తేడాతో ఓడించారు. అటు త్రిస్సూర్‌లో మొద‌ట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివ‌రికి మూడోస్థానంతో స‌రిపెట్టుకున్నారు. ఈ మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంద‌ని భావించినా చివ‌రి రౌండ్ల‌లో ఆ పార్టీ అభ్య‌ర్థులు దారుణంగా ఓడిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి