iDreamPost

అప్పులు చేస్తున్న ప్రజలు.. రుణాలు తగ్గిస్తున్న బ్యాంకులు

అప్పులు చేస్తున్న ప్రజలు.. రుణాలు తగ్గిస్తున్న బ్యాంకులు

కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ స్థాయిలో చోటు చేసుకున్న విపరీత ఆర్ధిక ఒడిదుడుకుల కారణంగా ప్రజలు అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రుణాలు ఇవ్వడంలో ప్రధాన వనరుగా ఉండే బ్యాంకులు రుణాలు ఇవ్వడం తగ్గించుకోవడంపై దృష్టిపెట్టాల్సిందిగా ఇప్పటికే నిపుణుల నుంచి నివేదికలు అందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. నిజానికి ప్రజలకు అవసరమైన రుణ సదుపాయాన్ని కల్పించాల్సిన బ్యాంకులు తమ రుణ పరిమితిని తగ్గించుకునే ప్రయత్నాల్లో పడడం ఆర్ధిక వ్యవస్థలోని ఒడిదుడుకులను స్పష్టం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉద్యోగాలు కోల్పోవడం లేదా జీతాల్లో కోత, కోవిడ్‌కారణంగా పెరిగిపోయిన ఖర్చులు, చెల్లించాల్సిన రుణ వాయిదాలు తదితర వాటి నేపథ్యంలో భారతేదశంలోని 40శాతం మందికిపైగా ప్రజలు రుణాలు తీసుకున్నట్లుగా పలు ఆర్ధిక సంస్థలు చేసిన సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో కొన్ని క్రెడిట్‌ కార్డులు, పర్సనల్‌ లోన్స్, స్నేహితులు, బంధువుల నుంచి తీసుకున్నవే అత్యధికంగా ఉన్నాయంటున్నారు. కోవిడ్‌ కారణంగా మనదేశంలోనే దాదాపు 20శాతం మంది వరకు ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. ఇది అంచనాలకు దొరికిన సెక్టారు వరకు మాత్రమే లెక్క. స్వయం ఉపాధి పొందేవారు, చిరు/మధ్య తరహా ప్రైవేటు ఉద్యోగుల్లో ఎంత మంది తమ రాబడి కోల్పోయారన్నది అంచనావేసే ప్రయత్నాలు జరగలేదనే చెప్పాలి.

ఈ లెక్కన ఏ స్థాయిలో ప్రజలు ఆదాయాన్ని కోల్పోయి ఉంటారో అంచనా వేయొచ్చు. సొ.. ఇటుంటి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారంతా రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా క్రెడిట్‌కార్డు, పర్సనల్‌ లోన్స్‌ సెక్టార్‌లో దాదాపు పది శాతం వరకు మొండి బకాయిలు నమోదయ్యాయని బ్యాంకింగ్‌ సంబంధిత వర్గాల సమాచారం. ఈ మేరకు రిజర్వు బ్యాంకు నుంచి కూడా బకాయిల ఎగవేతలు పెరుగుతాయన్న అంచనాలు సిద్దం చేసిందంటున్నారు. పలు కమర్షియల్‌ బ్యాంకులు కేవలం క్రెడిట్‌కార్డులు, పర్సనల్‌ లోన్స్‌పైనే ఆధారపడి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది.

ఈ నేపథ్యంలో సదరు సెక్టార్‌లో చురుగ్గా ఉన్న బ్యాంకులు తమకు ఎదురవ్వబోయే ఎగవేతలకు సిద్దంగా ఉండాలన్న ఆదేశాలు అందాయట. దీంతో ఆ మేరకు కార్యకలాపాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాయట. దీంతో క్రెడిట్‌కార్డు, పర్సనల్‌ లోన్స్‌ సెక్టారు ద్వారా రుణాలు ఇవ్వడం కూడా తగ్గుతుందన్నమాట. ఇప్పటికే పలు బ్యాంకులు రుణాల తగ్గించే ప్రయత్నాలు మొదలు పెట్టేసాయి. ఒక పక్క ప్రజలు రుణాల కోసం ఎదురు చూస్తుంటే.. మరో పక్క బ్యాంకులు లోన్లు ఇవ్వడం తగ్గిస్తాయన్న మాట. ఇటువంటి క్లిష్టపరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలను చేపడతాయో మున్ముందు చూడాల్సిందే.

ఇదిలా ఉండగా భారత ఆర్ధిక వ్యవస్థ నీటిబుడగ లాంటిదన్న అభిప్రాయాన్ని గతంలో పలువురు ఆర్ధిక వేత్తలు వెలిబుచ్చారు. అయితే ఇటువంటి వ్యాఖ్యలను అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నేరుగానే ఖండిచేవి. వాస్తవానికి ప్రజల కొనుగోలు శక్తిని కొనసాగించడానికి గత అయిదేళ్ళ కాలంలో క్రెడిట్‌కార్డులు, వ్యక్తిగత రుణాలు తదితర మార్గాల్లో నగదును అందుబాటులోకి విస్తృతంగా తీసుకువచ్చారు. దీంతో ప్రజల విస్తృతంగా కొనుగోళ్ళు జరిపేవారు. ఆ కొనుగోలు శక్తి ఆధారంగా ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందిపోతున్నట్లుగా చూపించారు. అయితే కొనుగోలు శక్తి కాదు, ప్రజల ఆదాయం పెరగడమే నిజమైన ఆర్ధికాభివృద్ధి అని పలువురు నిపుణులు చెప్పినప్పటికీ చెవికెక్కించుకున్న దాఖలాల్లేవు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి