iDreamPost

అది కూడా వద్దంటా..! అర్థముందా నిమ్మగడ్డా..?

అది కూడా వద్దంటా..! అర్థముందా నిమ్మగడ్డా..?

ఏపీలో స్థానిక ఎన్నికల వ్యవహారం సందిగ్ధంలో పడింది. ఓవైపు కరోనా ప్రభావం కొనసాగుతుండడం, సెకండ్ వేవ్ అంచనాలతో కేంద్రం సైతం అప్రమత్తం చేయడంతో ఇప్పుడిప్పుడే ఎన్నికలకు అవకాశం కనిపించడం లేదు. రెండోవైపు జిల్లాల విభజన వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. గత ఎన్నికల నాటి హామీని నిలబెట్టుకునే దిశలో జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకు అనుగుణంగా వడివడిగా ముందుకెళుతుంది. తాజాగా సీఎం ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. 26 జిల్లాలుగా విభజనAP SEC Nimmagadda Making Hurdles To Formation of New Districtsకు గానూ సుమారు రూ. 1300 కోట్లు వ్యయం అవుతుందని అధికారుల బృందం అంచనా వేసింది. దానిని కుదించే ప్రయత్నాలు పరిశీలించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. కొత్త జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కోసం ఉన్న వనరులను వీలయినంతగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. దానికి అనుగుణంగా డిసెంబర్ నెలాఖరుకి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరిలో ప్రకటన చేసి, బడ్జెట్ సమావేశాల్లో చర్చించి, ఏప్రిల్ నుంచి ఏపీలో నూతన జిల్లాల వారీగా పాలన అనివార్యంగా కనిపిస్తోంది.

సరిగ్గా అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం భిన్నంగా ఆలోచిస్తోంది. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ ధోరణి విడ్డూరంగా కనిపిస్తోంది. ఏపీ అభివృద్ధికి అనుగుణంగా పాలనా వికేంద్రీకరణ వైపు పడుతున్న అడుగులను కూడా అడ్డుకోవాలని ఆయన యోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో ఎన్నికలకు అంతా సిద్ధమయిన తర్వాతే ఆయన ఒంటెద్దు పోకడతో వాటిని అడ్డుకున్నారు. అప్పట్లో ప్రభుత్వానికి మాట మాత్రం చెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఎన్నికలు వాయిదా వేసిన తీరుని సుప్రీంకోర్ట్ కూడా తప్పుబట్టింది. అప్పుడే ఎన్నికలు జరిగి ఉంటే ప్రస్తుతం కరోనా సమయంలోనూ, ఇతర అంశాల్లో స్థానిక స్వపరిపాలనా సంస్థల చేదోడు ఎంతగానో ఉపయోగపడేది. అయినా ఆయన కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలు మళ్లీ ఎప్పుడు జరపాలన్నది స్పష్టత కనిపించడం లేదు.

జిల్లాల విభజన అంశం ముందుకు రావడంతో రిజర్వేషన్ల మార్పు అనివార్యం అవుతుంది. అదే జరిగితే రీ షెడ్యూల్ ఖాయం. దానికి మరింత సమయం తీసుకుంటుంది. అంటే రాబోయే కొన్ని నెలల పాటు ఈ ప్రకియ దాదాపుగా నిలిచిపోయినట్టుగానే భావించాలి. ఇదే ఇప్పుడు నిమ్మగడ్డకు రుచించడం లేదు. తాను అనుకున్నట్టుగా స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలంటే వాయిదా పడాలి.. మళ్లీ జరపాలంటే జరపాల్సిందేనని ఆయన ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బలంగా కోరుకుంటున్నారు కాబట్టి తక్షణమే ఎన్నికలు జరగాలని వాంచిస్తున్నారు. కానీ వాస్తవ స్థితి వేరుగా ఉందన్నది ఆయనకు పట్టడం లేదని భావించాల్సి వస్తోంది. అదే సమయంలో తన ప్రయత్నాలకు అడ్డంకిగా ఉంటుందనే ఉద్దేశంతో చివరకు జిల్లాల విభజనను కూడా అడ్డుకోవాలని చూడడం విస్మయకరంగా మారుతోంది. ఇలాంటి పోకడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాల విభజన జరగాలనేది సుదీర్గకాలంగా ఉన్న డిమాండ్. కానీ అనేక కారణాలతో ప్రభుత్వాలు వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఎట్టకేలకు నాలుగు దశాబ్దాల తర్వాత జిల్లాల విభజనకు కసరత్తులు సాగుతుంటే స్థానిక ఎన్నికల నిర్వహణను సాకుగా చూపడం విడ్డూరంగా కనిపిస్తోంది.

ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వయత్నం ఉంటే, దానికి విరుద్ధంగా తన హయంలో ఎన్నికలు జరగాలనే లక్ష్యంతో నిమ్మగడ్డ ఎత్తులు వేయడం గమనిస్తుంటే తమ ప్రయోజనాలే తప్ప ప్రజల ఆకాంక్షలు ఏమాత్రం పట్టడం లేదని అర్థమవుతోంది. ఇలాంటి అర్థరహిత వాదనలతో నిమ్మగడ్డ ఎస్ ఈ సీ స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన స్థాయికి హుందాగా వ్యవహరించాల్సింది పోయి, తద్విరుద్ధంగా ప్రవర్తించడం గమనిస్తుంటే అర్థముందా నిమ్మగడ్డా అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి