iDreamPost

కొత్త జిల్లాలకు కేబినెట్‌ ఆమోదం.. ముహూర్తం ఖరారు..

కొత్త జిల్లాలకు కేబినెట్‌ ఆమోదం.. ముహూర్తం ఖరారు..

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మరో పరిపాలనా సంస్కరణకు నాంధి పలికింది. జిల్లాలను పునర్విభజన చేసి, వాటి సంఖ్యను పెంచేందుకు ముహూర్తం ఖరారు చేసింది.దాదాపు ఏడాదికి పైగా కొత్తజిల్లాల ఏర్పాటు పై కసరత్తు చేసిన జగన్‌ సర్కార్‌.. ఉగాది తర్వాత ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్‌ 4వ తేదీ ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది. ఈ మేరకు ఈరోజు వర్చువల్‌గా సమావేశమైన ఏపీ మంత్రివర్గం కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.

13 కొత్త జిల్లాలు..

ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలు ఉండగా.. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఆ సంఖ్య 26కు పెరగనుంది. నూతనంగా 13 జిల్లాలను జగన్‌ సర్కార్‌ ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న జిల్లాలతోపాటు కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమహేంద్రవరం, నరసాపురం, బాపట్ల, నరసరావుపేట, తిరుపతి, అన్నయమ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి.

22 కొత్త రెవెన్యూ డివిజన్లు..

కొత్త జిల్లాలతోపాటు జగన్‌ సర్కార్‌ కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేయబోతోంది. కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కొత్తగా పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, కనిగిరి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మరవం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, శ్రీకాళహస్తి, కుప్పం రెవన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం తర్వాత మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 70కి చేరుకుంటుంది. కందుకూరును రెవెన్యూ డివిజన్ గా కొనసాగించాలని నిర్ణయించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి