iDreamPost

కొత్త జిల్లాల స్వరూపం మళ్లీ మారుస్తున్నారా, తుది నోటిఫికేషన్ ఎలా ఉండబోతోంది ..?

కొత్త జిల్లాల స్వరూపం మళ్లీ మారుస్తున్నారా, తుది నోటిఫికేషన్ ఎలా ఉండబోతోంది ..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణాలో జిల్లాల విభజన ఐదేళ్ల క్రితమే జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నాటి చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పాలన కేంద్రీకరణకే ప్రాధాన్యతనిచ్చిన చంద్రబాబు తీరుకి భిన్నంగా పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు జగన్ ప్రాధాన్యతనిస్తున్నారు. రాజధాని నుంచి గ్రామ సచివాలయాల వరకూ అన్నింటా దానిని ఆచరిస్తున్నారు. ఆ క్రమంలోనే జిల్లాల విభజనకి కూడా శ్రీకారం చుట్టారు. ప్రాధమిక నోటిఫికేషన్ మీద ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాటిని పరిశీలించి తుది నివేదిక సీఎం జగన్ కి సమర్పించారు. ముఖ్యమంత్రి కూడా ఓకే చెబితే రెండు,మూడు రోజుల్లో తుది నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అంతా సిద్దమయింది.

ఇప్పటికే 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ నిర్ణయం జరిగింది. అయితే రెండు,మూడు జిల్లా కేంద్రాల మీద అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలున్నాయి. రాజంపేట, హిందూపురం, నరసాపురం కోసం కొందరు ఆందోళనల బాట పట్టారు. వాటితో పాటుగా కొన్ని మండలాలను సమీప జిల్లాల్లో చేర్చాలనే ఆందోళనలు కూడా జరిగాయి. మార్కాపురం వంటి ప్రాంతాలను జిల్లాలుగా విభజించాలనే డిమాండ్ కూడా వచ్చింది. ఇతర అన్ని డిమాండ్లను ఇప్పటికే పరిశీలించి అధికారుల కమిటీ ఓ రిపోర్ట్ ని సీఎం ముందుంచింది. వాటితో పాటుగా పలువురు నాయకులు అసెంబ్లీలోనూ, సభా సమయంలో సీఎంని కలిసి కూడా పలు వినతులు సమర్పించారు. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన అంశాలను కూడా సీఎం పరిశీలిస్తున్నారు.

తుది నోటిఫికేషన్ కి గడువు సమీపిస్తున్న తరుణంలో సోమవారం నాడు సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో వచ్చిన ప్రతిపాదనలను ఏం చేయాలన్నది ఆయన అక్కడే స్పష్టత ఇవ్వబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం పెద్దగా మార్పులకు అవకాశం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే కొన్నింటిని మాత్రం పరిగణనలోకి తీసుకుని ప్రజలను ఒప్పించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని సమాచారం. అధికారిక వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. భవనాలను కూడా సిద్ధం చేశారు. ఇక హద్దుల విషయంలో కూడా భారీ మార్పులకు అవకాశం లేదని తెలుస్తోంది. జిల్లా కేంద్రాల మార్పు దాదాపు తొలుత ప్రకటించిన వాటినే ఖాయం చేయబోతున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలకు పచ్చ జెండా ఊపబోతున్నారు. అదే సమయంలో కందుకూరు వంటి రెవెన్యూ డివిజన్లను కొనసాగించాలన్న డిమాండ్ కి ఓకే చెప్పబోతున్నారు. ఇలాంటి స్వల్ప మార్పులతో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ రాబోతోంది.

ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల పాలన మొదలవుతుంది. ప్రస్తుతం కలెక్టర్లు ,ఎస్పీలుగా ఉన్నవారంతా కొత్త జిల్లాల బాధ్యతలు తీసుకుంటారు. పాత జిల్లాలకు ఇన్ఛార్జులుగా ఉంటారు. ప్రతీ జిల్లాకు కలెక్టర్, జేసీ, ఎస్పీల నియామకం కూడా ఏప్రిల్ మొదటి వారంలో పూర్తి చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. దాంతో అనేక మంది యువ అధికారులకు అవకాశాలు రాబోతున్నాయి. ఏమయినా జిల్లా తుది రూపం తొలుత ప్రకటించిన దానితో పోలిస్తే అనూహ్య మార్పులకు అవకాశం లేదనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి