iDreamPost

ఏపీలో కొత్త అధ్యాయానికి శ్రీకారం

ఏపీలో కొత్త అధ్యాయానికి శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌ చర్రితలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గరకు చేసేందుకు అమలు చేస్తున్న పరిపాలనా సంస్కరణల్లో భాగంగా.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 4వ తేదీ ఉదయం 9:05 గంటల నుంచి 9:45 గంటల మధ్య కొత్త జిల్లాలకు అంకురార్పణ జరగబోతోంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లకు భవనాలను ఇప్పటికే గుర్తించిన అధికారులు.. వాటికి కలెక్టరేట్‌ అనే పేర్లను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉండగా.. వీటికి అదనంగా కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలతోపాటు కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమహేంద్రవరం, నరసాపురం, బాపట్ల, నరసరావుపేట, తిరుపతి, అన్నయమ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ పేర్లతో జిల్లా కలెక్టరేట్లను సిద్ధం చేస్తున్నారు.

కొత్త జిల్లాలతోపాటు కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా ఈ నెల 4వ తేదీన అమలులోకి రాబోతున్నాయి. కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కొత్తగా పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, కనిగిరి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మరవం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, శ్రీకాళహస్తి, కుప్పం రెవన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆయా కేంద్రాలలో ఉండే తహసీల్దార్‌ కార్యాలయాలను రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలుగా మారుస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం స్థానంలో రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంగా పేరు మారుస్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సవ్యంగా సాగేలా ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. ఈ రోజు నుంచి రాబోయే మూడు రోజులు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. నాలుగో తేదీ వరకు ఉన్నతాధికారులు అందరూ అందుబాటులో ఉండాలని, ఎవరూ సెలవులు పెట్టవద్దంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మ మెమో జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సీఎస్‌ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేయనున్నారు. అదేవిధంగా జిల్లాలు ఆరంభం రోజైన నాలుగో తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. అధికారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి