iDreamPost

సంతోషం అవార్డుల అల్లకల్లోలం….తమ PROను కాదని అల్లు అరవింద్ వెల్లడి!

Santhosham Awards: గోవాలో జరిగిన సంతోషం అవార్డుల గడబగిడ టాలీవుడ్ లో ఆసక్తి రేపింది. సంతోషం అవార్డుల నిర్వాహకుడు సంతోషం సురేష్ తొలిసారి భారీగా గోవాలో ఈ అవార్డు ఉత్సవాన్ని తలపెట్టారు. కానీ ఆ ఫంక్షన్ అభాసు పాలై..టాలీవుడ్ పరువు పోయే పరిస్థితికి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి.

Santhosham Awards: గోవాలో జరిగిన సంతోషం అవార్డుల గడబగిడ టాలీవుడ్ లో ఆసక్తి రేపింది. సంతోషం అవార్డుల నిర్వాహకుడు సంతోషం సురేష్ తొలిసారి భారీగా గోవాలో ఈ అవార్డు ఉత్సవాన్ని తలపెట్టారు. కానీ ఆ ఫంక్షన్ అభాసు పాలై..టాలీవుడ్ పరువు పోయే పరిస్థితికి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి.

సంతోషం అవార్డుల అల్లకల్లోలం….తమ PROను కాదని అల్లు అరవింద్ వెల్లడి!

ఏ ప్రమేయం లేకుండానే, తెలుగు చిత్రపరిశ్రమ పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితి ఎదురైంది. ఇటీవల గోవాలో జరిగిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించిన జర్నలిస్టు కొండేటి సురేష్ బాధ్యతారాహిత్యం కారణంగా పరిశ్రమ యావత్తు భంగపడాల్సి వచ్చింది. దక్షిణాది భాషలకు అన్నిటికీ అవార్డులు ప్రకటించిన కొండేటి సురేష్ ఈ కార్యక్రమాన్ని ఈ సారి గోవాలో నిర్వహించాడు. అక్కడ జరిగిన అవకతవకలు, జవాబుదారీ తనం లేని సదరు నిర్వాహకుడు కొండేటి సురేష్ ప్రవర్తన సినీ పెద్దలకు తీరని అగౌరవాన్ని మిగిల్చింది.

స్పాన్సర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న కొండేటి ముందుచూపును ప్రదర్శించని కారణంగా అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగుతుండగానే అవాంతరాలు, అంతరాయాలు చోటు చేసుకున్నాయి. అగ్రనిర్మాత అల్లు అరవింద్ వేదికపైన ఉండగానే లైట్లు అపేసి, సౌండ్ సిస్టమ్ కూడా అపేసేంత అప్రతిష్టకరమైన వాతావరణం ఏర్పడింది. ఆ పరిస్థితుల్లోనే అల్లు అరవింద్ కూడా వేదిక మీదనే మాట్లాడాల్సి వచ్చి..వారిని సముదాయించడానికి ప్రయత్నించారు.

ఇలా రెండుమూడు సార్లు జరిగి చివరికి అందరి సహనం చచ్చిపోయి వేదికను వదలి కొందరు వెళ్ళిపోయారు. ఇది తెలియని పరభాషానటీనటులు రావడం వాళ్ళకి సరైన వాహన సదుపాయం కూడా కొరవడడంతో అందరూ తలలు పట్టుకున్నారు. జయసుధ లాటి ప్రముఖ నటీమణి కూడా తిరిగి హోటల్ చేరుకోవడానికి నానా అగచాట్లు పడాల్సివచ్చిన పరిస్థితి దయనీయంగా కనిపించింది.

ఫంక్షన్ పూర్తయి కొందరు నటీమణులు హొటల్ కు వెనుదిరిగి వస్తుండగా, గోవా రోడ్లపైన కారు డ్రైవర్లు కార్లను ఆపి వారిని అటకాయించారు. తమకు డబ్బు చెల్లించిన తర్వాత హొటల్ చేరుకోవాలని అపేశారు. నటీమణులు కంగారు పడుతుంటే, వెనకనే వస్తున్న ఓ తెలుగు యువనిర్మాత కలుగుచేసుకుని పరిస్థితిని చక్కబరచి, వారిని హోటల్ కు పంపించారు.

ఇదిలా ఉండగా, మర్నాడు హొటల్ బిల్ కట్టలేదని అందరినీ హొటల్ యాజమాన్యం బయటకు పోనివ్వకుండా ఆపేశారు. అందులో ముఖ్యంగా కన్నడ నటీనటులు, తమిళ నటీనటులు కూడా ఉన్నారు. వారు కిందన లాబీ దగ్గరకి వచ్చిన అందరికీ వారి విచారకర పరిస్థితిని చెప్పుకుని పదేపదే బాధపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మరికొందరు ఈవెంట్ మేనేజర్స్ కి రాత్రి రూం వసతి లేక కిందనే లాబీ నిద్రపోయారు.

మర్నాడు కారు డ్రైవర్లు నిలదీసి, తమ డబ్బు చెల్లించనిదే బయటకు వెళ్ళడానికి వీల్లేదని నిలదీయడంతో నటీనటులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇదంతా ఈ ఫంక్షన్ కి అతిథిగా వచ్చిన ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ ఈ అయోమయ పరిస్థితిని సానుకూల పరచారు. తమకి తీరని అగౌరవ కలిగిందని కన్నడ నటీనటులు, తమిళ నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేసి, ఇది ఇంతటితో ఆగదని, తాము దీనిపైన సీరియస్ గానే వ్యవహరిస్తామని లాబీలో వారందరికీ బిగ్గరగానే చెప్పడం జరిగింది.

కార్యక్రమాన్ని అర్థాంతరంగా వదలిపెట్టి సంతోషం అవార్డుల నిర్వాహకుడు కొండేటి సురేస్ అక్కడ తప్పించుకుని పారిపోయాడు. ఏం జరుగుతుందో తెలిసి కూడా, మర్నాడు అందరికన్నా ముందర మార్నింగ్ 5 గంటల విమానానికే హైదరాబాద్ ఉడాయించాడు. దీంతో సమాధానం చెప్పేవాళ్ళే లేక అంతా అస్తవ్యస్తంగా తయారైంది. కొండేటి తెలుగుచిత్రపరిశ్రమలోని అతి ముఖ్యులు, అగ్రశ్రేణి వ్యక్తుల పేర్లను అన్ని భాషల వారి దగ్గర తరచూ వాడిన నేపథ్యంలో ఇబ్బందికి గురైన వారందరూ ఆ అగ్రశ్రేణి పర్సనాలిటీలతో మాట్లాడతామని, వారి ఫోన్ నెంబర్లు ఇవ్వమని డిమాండ్ చేశారు.

ఈ ఇష్యు అక్కడితో ఆగలేదు. కన్నడ, తమిళ పరిశ్రమలవారు సోషల్ మీడియాలో తెలుగు చిత్రపరిశ్రమను విమర్శిస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన గందరగోళం సృష్టించారు. ఇందుకు కారణమొక్కటే. కొండేటి సురేష్ పదేపదే తాను మెగా పిఆర్వోనని, మెగా ఫ్యామిలీ మనిషినని ప్రచారం చేసుకుని పలుకుబడిని తనకు తానే కట్టబెట్టుకున్నాడు. ఇదే అస్త్రాన్ని అక్కడ గోవా ముఖ్యమంత్రి దగ్గర, ఇతర భాషా పరిశ్రమల దగ్గర కూడా ప్రయోగించాడు.

దాంతో సోషల్ మీడియాలో మెగా సర్కిల్ విమర్శలకు గురైంది. దీని కారణంగా, అల్లు అరవింద్ నిన్న ప్రసాద్ ల్యాబ్లో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సందర్భంగా, మీడియాకి క్లారిటీ ఇచ్చారు. సంతొషం అవార్డులతో తెలుగు చిత్రపరిశ్రమకు ఏ మాత్రం సంబంధం లేదని, ఇది ఒక వ్యక్తి నిర్వహించిన కార్యక్రమమని, కొండేటి సురేష్ తమలో ఎవ్వరికీ పీఆర్వో కాదని తెగేసి చెప్పవలసి వచ్చింది. ఒక వ్యక్తి చేసిన పొరబాటుకి  టాలీవుడ్ ను  నిందించడం సరికాదని తేటతెల్లం చేశారు.

కొండేటి సురేష్ మాత్రం సోషల్ మీడియాకి ఓ లేఖను విడుదల చేశాడు. ఇందులో ప్రధానంగా తన తప్పేమీ లేదని, కొంత పొరపాటైతే జరిగిందని, అంతమాత్రాన తన మీద కొందరు బురద జల్లడం సబబు కాదని బుకాయిస్తూ తనని తాను సమర్ధించుకోవడానికి ప్రయత్నం చేశారు. జరిగిన పరిణామాల నేపథ్యంలో, తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవమర్యాదలను సంరక్షించుకునే ప్రయత్నంలో భాగంగా, మీడియాకి ఓ లేఖను నిన్ననే విడుదల చేసింది.

గోవాలో జరిగిన అసౌకర్యాలు, కొండేటి సురేష్ తప్పిదాలకు ప్రతిస్పందించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కొండేటి  వ్యవహారశైలిని గమనించి, ఇకపైన గోవాలో జరగబోయే తెలుగు షూటింగులు, ఇతర కార్యక్రమాలకు విఘాతం కలుగుకుండా చూస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో, మిగిలిన అన్ని బాడీలతో సంప్రదిస్తామని, తెలుగు చిత్రపరిశ్రమ గౌరవానికి భంగం కలుగుతుంటే అది సమర్ధనీయం కాదని, ఇకపైన ఇటువంటి ఫంక్షన్లు ఎప్పుడు జరిగినా వాటి నిర్వహణకు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవప్రతిష్టలను కాపాడుతామని ఆ లేఖలో పేర్కొన్నారు. మరి.. మొత్తం ఈ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి