iDreamPost

రాజధాని ఒక నాయకుడి కలనా? లేక రాష్ట్ర భవిష్యత్తా?

రాజధాని ఒక నాయకుడి కలనా? లేక రాష్ట్ర భవిష్యత్తా?

రాజధాని అన్నది ఒకరి కల కాదు, ఒక రాష్ట్రపు (లేదా దేశపు) పాలనాపరమైన అవసరం మాత్రమే. కానీ దాన్ని ఒకరి కలగా, ఒక ప్రతిష్టాత్మకమైన అంశంగా చిత్రీకరిస్తున్నారు. సంవత్సరానికి మూడు పంటలు పండే వేలాది ఎకరాలను రాజధాని పేరుతో ఆక్రమించబోయిన చర్య దిద్దుబాటుకు నోచుకుంటుంటే గర్హిస్తున్నారు. పలు అధ్యయనాల అనంతరం నిపుణుల కమిటీలు ఇచ్చిన సూచనలను తోసిరాజని, ఇటువంటి అంశాలలో అనుభవం కానీ నైపుణ్యం కానీ లేని నారాయణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రాతిపదికగా అమరావతి ప్రాంతం రాజధానిగా ఎంపిక చేయడంలోని లొసుగులన్నీ ఇపుడు అనవసరం. విడిపోయిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి అన్నది వికేంద్రీకరణ దిశగా జరిగి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అంతోఇంతో మంచి జరుగవలసిన తరుణంలో రాజధాని పేరుతో మొత్తం నిధులు, వివిధ ఇతరాలు అన్నీ అమరావతికి కేంద్రీకృతమవడం వలన మిగతా ప్రాంతాలు విపరీతంగా దెబ్బతినేవి, వాటి వెనుకబాటుతనం మరింత దిగజారేది.

ఎన్నికల అనంతరం జగన్ పార్టీ తిరుగులేని ఆధిక్యత సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుండి రాజధాని ప్రాంత రియల్టర్స్ లో గుబులు మొదలైంది. ఎందుకంటే ఎన్నికల ముందే, పలు సభల్లో ‘లాక్కోబడిన రైతుల భూములు వెనక్కి ఇస్తాం’ అని జగన్ ప్రకటించారు. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినప్పుడు కూడా అన్ని వేల ఎకరాల పొలాలు అవసరం లేదని, అన్నీ అమరావతిలో కేంద్రీకృతం కాకూడదని ప్రస్తావించారు. శాసనసభలో మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అని ప్రకటించటంతో చర్చ మొదలైంది. భూములు ఇచ్చిన, ఇచ్చేలా చేయబడిన గ్రామాల ప్రజల్లో అధికులలో ఆందోళన మొదలైంది.

ఇపుడు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన అంతా లాభంలో నష్టం వస్తుందేమో అని తప్పించి, వారికిది అసలుకు నష్టం వచ్చే అంశం కాదు. ఎందుకంటే గత ప్రభుత్వపు ఒప్పందానికి కట్టుబడితే వారి నుండి తీసుకున్న భూములను డెవెలప్ చేసి, అందులో అగ్రిమెంట్ ప్రకారం వారికివ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం చేపట్టాలి. లేదంటే వారి భూములు వెనక్కి వస్తాయి – అంటే వారి మూల ఆస్తి అయిన భూమి వెనక్కు రావచ్చు లేదా కమర్షియల్ గా అనుకున్నంత ధర భూములకు రాకపోవచ్చు, కానీ రాజధానిగా ప్రకటించకముందు ఎంత ఉండిందో అంతకు అయితే తగ్గదు. ఇపుడు అర్థమైంది కదా లాభంలో నష్టం ఉండొచ్చు అంటే ఏమిటో. ముందే చెప్పినట్టు ఇది నాకు తెలిసిన అంశాల ఆధారంగా నాకు అర్థమైంది. ఇపుడు ఆ రైతుల వెనుక ఉండి నడిపిస్తోందంతా చుట్టుపక్కల వందల ఎకరాలు పొలాలు కొని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్న వ్యాపారులే అని అంటున్నారు.

ఇక “ఒక కులానికి వ్యతిరేకంగా, ఆ కులాన్ని నష్టపరచటానికి, ఆ కులం మీద పగతో రాజధాని మార్చుతున్నారు”  అంటూ ఆంధ్రజ్యోతి మరియు తెదేపా జగన్ గారిని టార్గెట్ చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందేమో. ఒక రైతు లేదా ప్రజా ఉద్యమంగా చూపాల్సిన నిరసనకు కులం రంగు పులిమి బలహీనపరచినట్టయింది. కనీసం అదే జిల్లాలో, పక్క గ్రామాల నుండి కూడా మద్దతు రావట్లేదు అంటే జనాలు ఇది కేవలం కొన్ని గ్రామాల, ఒక్క కులపు సమస్యగానే భావించినట్టున్నారు.

బాబు గారు కూడా నా కల నా కల అంటూ దానికి స్వార్థప్రయోజనాల చర్య అనిపించేలా చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాల్సిన ఆవశ్యకతను కులం కోణంలోంచి, పార్టీ కోణంలోంచి, రియల్ ఎస్టేట్ బిజినెస్ కోణంలోంచి కాకుండా చెప్పగలగాలి. గతంలో కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలతో పాటు పలు సాంకేతిక వర్గాలు ఇచ్చిన సూచనలను బుట్టదాఖలు చేస్తూ అమరావతి ప్రాంతాన్ని ఎందుకు రాజధానిగా ఎంపిక చేయవలసివచ్చిందో తగిన కారణాలు చెప్పడంతో అది మొదలుపెట్టి, అయిదేళ్ళలో ఎటువంటి శాశ్వత ప్రాతిపదిక నిర్మాణాలూ జరగని తీరు, అధికారిక గెజిట్ రిలీజ్ చెయ్యకపోవడం వంటి పలు అంశాలకు తగిన కారణాలు బాబుగారు చెప్పగలగాలి – ‘అనుభవం’ ప్రస్తావన, వ్యక్తిత్వ హననాలు చేయడం లేకుండా. అలాగే శాశ్వత ప్రాతిపదిక నిర్మాణాలు చేయగలిగినంత ఖర్చుతో, అత్యంత నాసిరకపు తాత్కాలిక నిర్మాణాలు ఎందుకు చేశారు? ప్రభుత్వం నుండి అంత ఎక్కువ డబ్బు ఛార్జ్ చేసి కూడా అంతటి నాసిరకపు నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్స్ పై ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు? వంటి వాటికి కూడా కారణాలు చెప్పాలి. ఇక మరో విషయం కనీసం విశాఖ, కర్నూలు మరియు ఇతర ప్రాంతపు తెదేపా కార్యకర్తలతో (నాయకులతో కాదు) ఇపుడు అక్కడ పెడతామని ప్రకటించినవేవీ వద్దని నిరసనలు చేయించండి. అక్కడి ప్రజలే వద్దనుకుంటే, వద్దని అంటే మరీ మంచిది కదా. అక్కడ కూడా వద్దన్నందుకు ఒకటో రెండో బంగారు గాజులు ఇచ్చేస్తే మరింత పబ్లిసిటీ.

రాజధానిని అమరావతి కేంద్రీకృతంగా కాకుండా వైజాగ్, అమరావతి, కర్నూలు కేంద్రాలుగా చెయ్యడం అన్నది ప్రజల్లో అధికులు హర్షించేదిగా పలువురు నిపుణులు మరియు నాయకులు స్వాగతించక తప్పనిదిగా మారింది. ఎందుకంటే కర్నూలుకు హై కోర్ట్ అన్నది శ్రీ బాగ్ ఒడంబడిక నాటినుండి నెరవేరని హామీగా మిగిలింది. రాయలసీమ నాయకులే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా ఉండినప్పటికీ అది నెవరేర్చబడకపోవటానికి కారణం – ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉండటం. విడిపోయాక ఆ ఒడంబడికకు ప్రాధాన్యత ఇవ్వవలసింది. కానీ, అలా జరగలేదు. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక్క వైజాగ్ మినహాయిస్తే మిగతా అంతా వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది.

ఇపుడు వైజాగ్ మరియు కర్నూలులను కూడా రాజధానిలో భాగంగా చేయడం అన్నది ఖచ్చితంగా ఆయా ప్రాంతాలకు మంచి చేసేదే అలాగే అమరావతికి కాస్త నష్టం చేసేదే, కానీ ముందుగా వివరించినట్టు వారికి మూల నష్టం కాదు, లాభంలో నష్టం. “అభివృద్ధి ఎవరు వద్దనుకుంటారు, అమరావతిని వంచిస్తున్నారు” అంటున్నవారు – దశాబ్దాలుగా కర్నూలుకు జరిగిన మోసం, ఇతర రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడటం లేదు – ఏం ఆ ప్రాంతం వారు అభివృద్ధి వద్దనుకుంటారా? ఈ ప్రాంతాలకు జరిగింది మాత్రం వంచన కాదా? కర్నూలును రాజధానిగా కోల్పోవడం రాయలసీమను శాశ్వత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయేలా చేసిందన్నది నిజం కాదా? అప్పట్లో పెద్దమనుషులుగా కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ బుట్టదాఖలు చేసి, అన్యాయం చేసింది నిజం కాదా? నాలుగైదు సంవత్సరాల క్రితపు ఒప్పందాలే జరగవేమో, దానివల్ల నష్టపోతామేమో అని అంటున్నవారికి మద్దతుగా నిలబడుతున్నవారు; దశాబ్దాలుగా అరణ్యరోదనగా మిగిలిన సీమ ఘోషను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? కర్నూలు/రాయలసీమ ప్రాంతం రాజధానికి ఎందుకు అనుకూలం కాగలదో అప్పటి కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఏమైంది? … ఇలా  ప్రశ్నిస్తూ పొతే లెక్కకు మిక్కిలి సమాధానం చెప్పలేని ప్రశ్నలున్నాయి.

చివరగా ఒక్క మాట – ఒక్క రాయలసీమ గురించి కాదు, మొత్తం రాష్ట్రం గురించి ఆలోచించండి అనేవారికి మనవి – అవును, మీరు కూడా ఒక్క అమరావతి గురించి కాకుండా, మొత్తం రాష్ట్రం గురించి ఆలోచించండి. ఒక ప్రాంతం గురించి మాత్రమే ఆలోచించిన వారు ప్రాంతీయవాదులైతే, 29 గ్రామాల గురించి మాత్రమే ఆలోచించేవారు 29 గ్రామాలవాదులు మాత్రమే అవుతారు.

రాజధాని అంటే ఒక్కరి కల కాదు, ఒక రాష్ట్రపు/దేశపు పాలనా పరమైన అవసరం అంతే. అది రెండు మూడు ప్రాంతాలు కేంద్రాలుగా మనదేశంలో అనేక రాష్ట్రాలలో ఆచరణలో ఉంది. రాజధాని వికేంద్రీకరణ అన్నది తథ్యంగా, ఆవశ్యకతగా కనబడుతున్న ఈ తరుణంలో నిరసనలు జరుగవలసింది, ఆందోళన వ్యక్తం కావలసింది “అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలి” అని కాదేమో – అమరావతి ప్రాంతంలో నష్టపోయిన రైతులకు తగిన న్యాయం జరగాలి, కంపెన్సేషన్ ఇవ్వాలి అని. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇలానే విభాజిత రాష్ట్రానికి ఏమి కావాలో పోరాడకుండా, విడిపోకూడదు అని పోరాడి తీవ్రంగా నష్టపోయాం. ఇప్పుడైనా కాస్త ఆచరణాత్మక దృష్టితో ఉండాలి.

Written By Vamsi Gayathri Kalugotla

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి