iDreamPost

1 రూపాయికి 10 రూపాయల లాభం

1 రూపాయికి 10 రూపాయల లాభం

మాములుగా ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి మీద లాభాలు రావాలంటే కొంత సమయం పడుతుంది. ఎంతలేదన్నా ఆరు నెలలతో మొదలుకుని సంవత్సరాల దాక ఫలానా టైం ఫ్రేమ్ అని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఒక్క సినీ పరిశ్రమలో మాత్రమే అనూహ్యమైన రాబడిని అందుకోవచ్చు. ఇది పూరి అన్నట్టు గ్యాంబ్లింగ్. సరిగ్గా గురి కుదిరిందా కోట్లు వర్షంలా కురుస్తాయి. లేదూ అదృష్టం బెడిసి కొట్టి బ్యాడ్ లక్ పలకరించిందా వందల కోట్లు కర్పూరంలా కరిగిపోతాయి. ఇప్పుడిదంతా చెప్పడానికి కారణం కాంతార. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రన్ కొనసాగిస్తున్న ఈ శాండల్ వుడ్ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్ సగర్వంగా మూడో వారంలో అడుగు పెట్టింది.

మొత్తం పదహారు రోజులకు గాను కాంతార 20 కోట్ల షేర్ ని దాటేసింది. దీనికి జరిగిన థియేట్రికల్ బిజినెస్ కేవలం 2 కోట్లు. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కమీషన్ పద్ధతి మీద హోంబాలే ఫిలింస్ కు పంపిణి చేసి పెట్టింది. కన్నడ నేటివిటీ కాబట్టి ఇక్కడ అంతగా ఆడుతుందో లేదో అన్న అనుమానంతో ప్రొడ్యూసర్లు మరీ ఆశకు పోకుండా రీజనబుల్ రేట్లకు క్లోజ్ చేశారు. కాంతార ఇక్కడ రిలీజైన పది రోజుల ముందే గాడ్ ఫాదర్, ఘోస్ట్ లాంటి పెద్ద సినిమాలు ఉండటం కూడా ధర తగ్గడానికి కారణం. కట్ చేస్తే ఊహించని విధంగా దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టి ఆడిన వీరంగానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. క్లాస్ మాస్ తేడా లేకుండా జేజేలు కొట్టేసి కోట్లు కురిపించారు.

ఇప్పుడు ఇన్వెస్ట్ మెంట్ రిటర్న్ సూత్రం ప్రకారం చూసుకుంటే 2 రూపాయలు పెట్టుబడికి కాంతార తెచ్చిన మొత్తం 20 రూపాయలు. ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు. ఎంతలేదన్నా ఇంకో పది రోజులు సాఫీగా నడిచిపోతుంది. నవంబర్ 4 నుంచి పే పర్ వ్యూలో అమెజాన్ ప్రైమ్ లో ఓటిటి ప్రీమియర్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది కానీ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ అగ్రిమెంట్ ముందే చేసుకుని ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరు కానీ ఒకవేళ కాకపోతే మటుకు బయ్యర్లకు ఇంకొంత పిండుకునే అవకాశం దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు కలిపి ఇప్పటికే 300 కోట్లు దాటేసిన కాంతారకు ప్రొడక్షన్ లో అయిన బడ్జెట్ 16 కోట్లే అంటే నమ్మగలరా. కంటెంట్ పవర్ అంటే ఇదే మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి