iDreamPost

వైవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు

  • Published - 10:21 AM, Fri - 1 May 20
వైవీ సుబ్బారెడ్డి  పుట్టినరోజు శుభాకాంక్షలు

వైవీ సుబ్బారెడ్డి వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైవీ సుబ్బారెడ్డి గా అందరికీ సుపరిచితులైన యర్రం వెంకట సుబ్బారెడ్డి డివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తోడల్లుడి గా.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి గా వైయస్ జగన్ కాంగ్రెస్ ను వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని స్థాపించినప్పుడు జగన్ మోహన్ రెడ్డి కి అన్ని విధాల అండగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి లో ముఖ్య భూమిక పోషించారు. కష్టకాలంలో రాష్ట్ర నాయకత్వాన్ని సమన్వయం చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడంలో పెద్దాయన వైవీ సుబ్బారెడ్డి ప్రముఖ భూమిక పోషించాడు.

పార్టీ తరపున ఏ భాధ్యత ఆప్పగించినా.. తాను ఏ పదవీ అధిరొహించినా వైవీ ఆ పదవీ కే వన్నెతెచ్చేవారు. దానికి తాజా ఉదంతమే టీటీడీ చైర్మన్ గా ఆయన భాధ్యత చేపట్టిన అతి తక్కువ సమయంలోనే తనదైన శైలిలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆ స్వామి వారిని సామాన్య భక్తులకు చేరువ చెయ్యడమే కాకుండా.. సమయ స్ఫూర్తి తో స్వామి వారి బంగారాన్ని ఫిక్సుడ్ డిపాజిట్ల ను అప్పుల్లో కూరుకుపోయిన యాక్సెస్ బ్యాంక్ నుండి సకాలంలో బయటకి తీసుకొచ్చి భక్తుల ప్రశంసలు పొందారు. అంతేకాక కరోనా వైరస్ విజృంభణ నెపధ్యంలో టీటీడీ ద్వారా ఆ వెంకటేశ్వరస్వామి వారి ఆశీసుల తో పేదలకు పెద్ద ఎత్తున భోజన సదుపాయాలు కల్పిస్తూ అన్నార్ధుల ఆకలి తీరుస్తున్నారు.

ఇక వైవి సుబ్బారెడ్డి గారి వ్యక్తిగత విషయాల్లోకి వస్తే ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్ల గ్రామంలో ఆదర్శ రైతు యర్రం పొలిరెడ్డి ముగ్గురి కుమారులలో సుబ్బారెడ్డి మొదటివాడు. కాగా చిన్న వయసునుండే చదువులో మంచి ప్రతిభ కనబరిచేవారు. అనంతరం శ్రీ భారతీ విధ్యాపీఠం నుండి ఎంబీఏ పూర్తి చేసిన ఆయన కొంత కాలం కుటుంబ వ్యాపారం అయిన జిన్నింగ్ మిల్లు తో పాటు రైస్ మిల్ వ్యవహారాలు చూసుకొనేవారు. వ్యాపారంలో మంచి లాభాలు రావడంతో హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు.

ఈ క్రమంలోనే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తో సాన్నిహిత్యం ఏర్పడడం.. ఆ స్నేహంతో రాజశేఖర రెడ్డి కోరిక మీదట వారి సతీమణి విజయమ్మ గారి సోదరి స్వర్ణమ్మ ని వివాహం చేసుకున్నారు. వారికి వైవి విక్రాంత్ ఏకైక సంతానం.

వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటీకి తన సొంత జిల్లాకు, జిల్లా రైతాంగానికి సేవ చెయ్యాలనే తలంపుతో తన తండ్రిగారైన యర్రం చిన పోలిరెడ్డి స్పూర్తి తో శ్రీ కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు, కొరిశపాడులోని యర్రం చిన పొలిరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు అంకురార్పణ జరగడంలో అంతా తానై వ్యవహరించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు, పాటు ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల 43 గ్రామాల దాహర్ధి తీరుస్తుంది. ఈ ప్రాజెక్టు ల పరిధిలోని ముంపు ప్రాంతాల పునరావాసం కోసం నిర్వాసితులకు దెశంలోనే మెరుగైన విధంగా మంచి ప్యాకేజి ఇవ్వడంలో వైవీ సుబ్బారెడ్డి ముఖ్యపాత్ర పోషించారు.ఇది ఆయనకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టింది. ఈ విధంగా ఆయన తన జన్మభూమి రుణం తీర్చుకున్నారని చెప్పొచ్చు.

అంతే కాక ఆయన ఎంపీ గా ఉన్న సమయంలో ప్రకాశం జిల్లా యువత కు ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోడి గారి తో మాట్లాడి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఒంగోలు లో ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా వెనుకబడిన జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందడానికి వైవీ ఎనలేని కృషి చేశారు. అందులో భాగంగానే జిల్లాలో ఏపీఐఐసీ ఆద్వర్యం లో రెండు ప్రత్యేక సెజ్ లను అభివృద్ది చేశారు. ఇవి నేడు కొన్ని వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ ప్రత్యేక ఇండస్ట్రియల్ సెజ్ లు పారిశ్రామిక అభివృద్ది జాతియ స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఎన్నో జాతియ అంతర్జాతియ సంస్థలు ఈ సెజ్ లలో నెలకొల్పాయి. అంతేకాక ప్రతి ఏడాది చిన్న పొలిరెడ్డి ట్రస్ట్ ఆద్వర్యంలో జాబ్ మేళా లు నిర్వహించి పెద్ద కార్పొరేట్ సాఫ్ట్వేర్, ఫార్మా, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో జిల్లా యువత కు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

ఆయన తదుపరి లక్ష్యం వెనుకబడిన ప్రకాశం వాసుల చిరకాల స్వప్నం వెలుగొండ ప్రాజెక్టు ని పూర్తి చేయించడమే. ఈ క్రమంలో ఒంగోలు ఎంపీ గా ఉన్న సమయంలో వెలుగొండ ప్రాజెక్టు కు నిధులు కేటాయించాలని, సకాలంలో ప్రాజెక్టు ని పూర్తి చెయ్యాలని కోరుతూ అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి మండుటెండ ని సైతం లెక్క చేయకుండా పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం పాదయాత్ర తో చుట్టి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం మారడం తో ఇప్పటి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో వెలుగొండ కు పుష్కలంగా నిధులు కేటాయించడం తో ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నాయి.

ఇలా ఆయన ఎక్కడున్నా తన మార్క్ చూపిస్తారు.. మార్పు తీసుకోస్తారు.. ఎంపీ గా ఉన్నప్పుడు నిరంతర ప్రజా సేవతో అభివృద్ది లో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి భక్తునిగా.. టీటీడీ చైర్మన్ గా.. ఆ దేవదేవుని సేవలో తరిస్తున్నారు. పదవుల్లో ఉన్నా లేకపోయినా.. ప్రజల అభివృద్ది కోసం నిరంతరం పాటుపడుతూ ప్రజా సేవే ధ్యేయంగా రాజకీయాల్లో ముందుకెళ్తున్న వైవీ సుబ్బా రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ..