iDreamPost

కష్టమైనా.. నష్టమైనా తగ్గేదిలేదంటున్న జగన్‌..!

కష్టమైనా.. నష్టమైనా తగ్గేదిలేదంటున్న జగన్‌..!

మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను.. మాట ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకు పోవడమే.. యాత్ర సినిమాలో వైఎస్సార్‌ పాత్ర పోషించిన నటుడు మమ్ముట్టి చెప్పిన డైలాగ్‌ ఇది. మాట ఇస్తే.. ఎంత కష్టమైనా.. నష్టమైనా వెనక్కి తగ్గని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాన్ని ఒక్క డైలాగ్‌లో ఆవిష్కరించారు. వైఎస్సార్‌ మాదిరిగానే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా సాగిపోతున్నారు. మాట ఇచ్చిన తర్వాత.. వెనుతిరిగి చూడడంలేదు. కోవిడ్‌ వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిర్ణీత సమయంలో అమలు చేస్తున్నారు.

కరోనా కష్టకాలంలో నూతంగా వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాలను ప్రారంభించిన వైఎస్‌ జగన్‌.. పాత పథకాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. పథకాల అమలుకు క్యాలెండర్‌ను ప్రకటించిన సీఎం జగన్‌.. వాటిని తు.చ. తప్పకుండా అమలు చేస్తూ రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించినా.. ఏపీలో సాగుతున్న పరిపాలన, సంక్షేమ పథకాలు దేశం యావత్తును ఆకర్షిస్తున్నాయి. ఆర్థిక వేత్తలను ఆలోచింపజేస్తున్నాయి.

తాజాగా వైఎస్సార్‌ రైతు భరోసా పథకం మలివిడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 27వ తేదీన వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద రైతులకు నాలుగు వేల రూపాయలు రైతులకు అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం రెండో ఏడాదిలో కొనసాగుతోంది. 13,500 రూపాయలను ఏడాదిలో నాలుగు దఫాలుగా రైతులకు అందిస్తున్నారు. రెండో ఏడాదిలో రెండు విడతల నగదు.. 2 వేలు, 5,500 రూపాయలు జమ చేశారు. మూడో విడతలో భాగంగా 4 వేల రూపాయలు ఈ నెల 27వ తేదీన జమ చేయనున్నారు. చివరిదైన నాలుగో విడతలో రెండు వేల రూపాయలను జనవరి నెలలో సంక్రాంతికి ముందుకు జమ చేయనున్నారు. ఈ పథకం కింద దాదాపు 50 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. ప్రతి ఏడాది అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి