iDreamPost

ఆరో తరగతిలోనే పెళ్లి.. అండగా నిలిచిన భార్య.. నీట్ క్లియర్ చేశాడు!

ఆరో తరగతిలోనే పెళ్లి..  అండగా నిలిచిన భార్య.. నీట్ క్లియర్ చేశాడు!

ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఓక దానిలో విజయం సాధించాలని కోరుకుంటాడు. కానీ విజయం సాధించే వరకు పోరాడే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. అనేక సమస్యలు, అడ్డంకులు లక్ష్యాలను సాధించకుండా అడ్డు పడుతాయి. అలాంటి వాటికి కొందరు భయపడితే.. మరికొందరు వాటిని ఎదిరించి మరీ.. లక్ష్యాల వైపు అడుగులు వేస్తుంటారు. అచ్చం అలానే ఓ యువకుడు కూడా ఇలాంటి కష్ట నష్టాలు ఎన్నో ఎదురైనా ప్రయత్నాన్ని విడవకుండా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. అతడు సాధించిన విజయంతో స్థానికంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ యువకుడు అసలు ఇంతకి ఏం సాధించాడని అనుకుంటున్నారా?. ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాజస్థాన్ రాష్ట్రం చిత్తోర్ గఢ్ లోని ఘోసుండా ప్రాంతంలో రామ్ లాల్ అనే యువకుడు కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. ఆ యువకునికి చదువు అంటే  ప్రాణం. అంతేకాక డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నాడు. అతడి లక్ష్యానికి అనుగుణంగానే చదువులో బాగా రాణిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా రామ్ లాల్ కు 11 ఏళ్ల వయస్సులోనే బాల్య వివాహాం చేశారు. అప్పుడు అతడు 6 వతరగతి మాత్రమే చదువుతున్నాడు. అలా తన పెళ్లి అయ్యాక.. కొన్ని రోజులు రామ్ లాల్ జీవితం సంసారంలో గడిచిపోయింది.

ఒక రోజు రామ్‌లాల్..తన  లక్ష్యం గురించి భార్యకు చెప్పాడు. భర్త అనుకున్న ఉన్నతమైన లక్ష్యానికి భార్య సంతోషించింది. అంతేకాక అతడికి  అన్ని విధాల ఆమె సాహాకారం అందించింది. అప్పట్లోనే రామ్ లాల్ భార్య పదో తరగతి వరకు చదువుకుంది. రామ్ భార్యకు పుస్తకం విలువ తెలుసు కాబట్టి భర్తకు అండగా నిలబడింది. సంసార బాధ్యతలు ఆమె చూసుకోగా.. రామ్ లాల్ పూర్తిగా చదువులో నిమగ్నమయ్యాడు. దీంతో రామ్ లాల్10 వ తరగతి లో 74 శాతం ఉత్తీర్ణతతో సాధించాడు. ఈ నేపథ్యంలో డాక్టర్ కావాలనేది తన లక్ష్యం కాబట్టి ఇంటర్ లో సైన్స్ కోర్సును తీసుకున్నాడు. దానితో పాటే నీట్ పరీక్షలకు సిద్దమయ్యాడు. రామ్ లాల్ 2019 లో తొలిసారి నీట్ పరీక్షను రాశాడు.

కానీ ఆ పరీక్షలో తక్కువ స్కోర్ సాధించాడు. తాను అనుకున్నంత మంచి ఫలితం రాలేదు. కానీ తను ఏమాత్రం నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నాన్ని మెుదలు పెట్టాడు. రామ్ లాల్ గ్రామానికి సమీపంలో ఉన్న నగరానికి చేరుకుని కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ నీట్ పరీక్షలో మంచి స్కోర్, ర్యాంక్ సాధించేందుకు తీవ్రంగా కృషి చేశాడు. ఈ సారి 490 మార్కులు సాధించడమే కాక మంచి ర్యాంక్ పొంది.. అందరిని ఒక్కసారి ఆశ్చర్యపరిచాడు. దాంతో తనకు ఉన్న డాక్టర్ కలను సాకారం చేసుకున్నాడు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని రామ్ లాల్ చెప్పుకొచ్చాడు. తన భార్య ఇచ్చిన సహాకారాన్ని తాను ఎప్పుడు మరవలేను అని.. రామ్ లాల్  భావోద్వేగానికి లోనయ్యాడు. మరి.. ఈ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో  తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి