వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో భారత్ కప్పు ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో భారత్ కప్పు ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
140 కోట్ల మంది భారతీయుల కలలు చెదిరిపోయాయి. ఇండియన్ క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. 12 ఏళ్లుగా అందకుండా ఉన్న వన్డే వరల్డ్ కప్-2023 డ్రీమ్ నెరవేరుతుందని అనుకుంటే మరోమారు మనకు నిరాశే మిగిలింది. వరుస విజయాలు వచ్చాయి, టీమ్ సూపర్బ్‌గా ఉంది, అందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.. కంగారూ లేదు కింగారూ లేదు.. ఈసారి వరల్డ్ కప్ మనదేననే ధీమాలో ఉన్న అభిమానుల హృదయం ఒక్కసారిగా ముక్కలైంది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో ఓడిపోయి కప్పును చేజార్చుకుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 50 ఓవర్లకు 240 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఆసీస్ 43 ఓవర్లలోనే టార్గెట్‌ను చేరుకొని ఆరోసారి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది.
ప్రతిష్టాత్మక ఫైనల్లో భారత్ ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఐదింటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమికి మొదటి ప్రధాన కారణం టాస్. బ్లాక్ సాయిల్ పిచ్‌పై టాస్ చాలా కీలక పాత్ర పోషించింది. చూడటానికి బ్యాటింగ్ సర్ఫేస్‌గా కనిపించినా ఇది ట్రికీ పిచ్ అని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందే గ్రహించాడు. అందుకే టాస్ నెగ్గగానే తెలివిగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మ తాము టాస్ నెగ్గితే బ్యాటింగ్ చేసేవాళ్లమని అన్నాడు. దీన్ని బట్టే పిచ్‌ను అర్థం చేసుకోవడంలో మన కంటే కంగారూలు ముందున్నారని అర్థమైపోయింది. ఈ పిచ్‌పై బ్యాటింగ్ కష్టం కాబట్టి ఒక్క రోహిత్‌ను ఔట్ చేస్తే చాలు.. మిగతావాళ్లు డిఫెన్స్‌లో పడతారని ఆసీస్ అనుకుంది.
రోహిత్ శర్మ ఉన్నంత సేపు స్కోరు బోర్డు మెరుపు వేగంతో కదిలింది. అతడు వెనుదిరిగిన తర్వాత 11 నుంచి 50 ఓవర్ల మధ్యలో కేవలం నాలుగు బౌండరీలు మాత్రమే వచ్చాయి. కమిన్స్ అంచనాకు తగ్గట్లు బాల్ రివర్స్ స్వింగ్ అవ్వడం, మధ్యలో స్పిన్నర్లకు కూడా హెల్ప్ చేయడంతో భారత బ్యాటర్లు పరుగులు తీసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకవేళ టాస్ మనకు అనుకూలంగా వచ్చి, ఆసీస్‌ను రోహిత్ బ్యాటింగ్‌కు దింపితే రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి మరో ప్రధాన కారణం కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్. సింగిల్స్ తీసేందుకు కూడా ఇబ్బంది పడ్డ పిచ్ మీద హిట్‌మ్యాన్ అలవోకగా 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అతడు తప్ప ఏ ఇండియన్ బ్యాటర్ ఇక్కడ సిక్స్ కొట్టలేదు.
భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ ఆడిన తీరుగానే ఆసీస్‌లో లబుషేన్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక్కడ రోహిత్ చేసిన పనే అక్కడ ట్రావిస్ హెడ్ చేశాడు. అయితే హెడ్ ఆఖరి వరకు ఉండి సెంచరీతో భారీ స్కోరు చేయడంతో ఆస్ట్రేలియాకు ఛేజ్ చేయడం ఈజీ అయిపోయింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఇలాగే రోహిత్ మరో 10 ఓవర్లు క్రీజులో ఉండుంటే స్కోరు 300 దాటేది. అప్పుడు ఆసీస్‌పై ప్రెజర్ చాలా ఉండేది. వాళ్ల బ్యాట్స్‌మెన్ రిస్క్ తీసుకొని రన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. దీని వల్ల వికెట్లు కోల్పోయే ఛాన్స్ ఉండేది. కానీ అలా జరగలేదు. అప్పటికే మాక్స్వెల్ ఓవర్లో 10 రన్స్ వచ్చినా అనవసర షాట్‌కు వెళ్లి వికెట్ ఇచ్చుకున్నాడు రోహిత్. కోహ్లీ ఉన్నాడనే ధైర్యంతో కాబోలు హిట్టింగ్‌కు వెళ్లాడు. కానీ అతడి వికెట్ మ్యాచ్‌కు ఎంత కీలకమో తర్వాత తెలిసింది.
ఫైనల్లో భారత్ ఓటమికి ప్రధాన కారణాల్లో బ్యాటర్ల ఫెయిల్యూర్ మరొకటి. ఓపెనర్ శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా నిరాశపర్చారు. ఒకవైపు రోహిత్ షాట్స్ ఆడుతుంటే స్ట్రైక్ రొటేట్ చేయాల్సిన గిల్ అనవసరంగా షాట్ ఆడే వికెట్ సమర్పించుకున్నాడు. కమిన్స్ బౌలింగ్‌లో అయ్యర్ వెనుదిరిగిన తీరు కూడా ఆశ్చర్యపర్చింది. అదేమీ అద్భుతమైన డెలివరీ కాదు. కానీ బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌లో వేసిన బాల్‌ను డిఫెన్స్ చేయాల్సింది పోయి ఎడ్జ్ ఇచ్చాడు. జడ్డూ, సూర్యకుమార్ కూడా ఆఖరి వరకు క్రీజులో నిలబడకుండా త్వరగా ఔటయ్యారు. వీళ్లిద్దరిలో ఎవరు బాగా ఆడినా మరో 30 రన్స్ వచ్చేవి. ఒక మాదిరి టార్గెట్‌ను కాపాడుకోవడంలో భారత బౌలర్లు ఫెయిలవ్వడం ఓటమికి మరో ప్రధాన కారణం.
టోర్నమెంట్ మొత్తంలో మ్యాచ్ పోతుందనుకున్న ప్రతిసారి వికెట్లు తీసి గేమ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చేలా చేసిన బౌలర్లు.. ఆసీస్‌తో మ్యాచ్‌లో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయారు. బాల్ కాస్త పాతబడిన తర్వాత స్వింగ్ అయ్యే టైమ్‌లో బౌలింగ్‌కు వచ్చే షమీతో మొదట్లోనే బౌలింగ్ వేయించడం దెబ్బతీసింది. బాల్‌పై పట్టు దొరక్క ఎక్స్‌ట్రాలు, బౌండరీల రూపంలో భారీగా రన్స్ ఇచ్చుకున్నాడు షమి. ఆసీస్ పేసర్లలా ఈజీ రన్స్ ఆపేందుకు మన బౌలర్లు ప్రయత్నించలేదు. కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలసి కెప్టెన్ రోహిత్ శర్మ వేసిన ప్లాన్స్ ఈ వరల్డ్ కప్‌లో వరుస విజయాలకు కారణం. ఆ ప్లాన్స్‌ను అనుకున్నట్లుగా ఎగ్జిక్యూట్ చేసిన విక్టరీలు కొట్టారు. కానీ ఫైనల్ మ్యాచ్‌లో ప్లాన్స్‌ను సరిగ్గా అమలు పర్చకపోవడం భారత్‌ను దెబ్బతీసింది. ఇది ఓటమికి మరో ప్రధాన కారణం.
అటు బ్యాటింగ్‌లో రాహుల్, కోహ్లీలు క్రీజులో కుదురుకున్నాక హిట్టింగ్ చేయాలని అనుకున్నారు. కానీ హిట్టింగ్ చేద్దామనుకున్న ప్రతిసారి టీమిండియా వికెట్లు కోల్పోయింది. బౌలింగ్‌లో షమీని ముందే తీసుకొస్తే అదీ దెబ్బతీసింది. గ్రౌండ్ ఫీల్డింగ్‌లో రన్స్ ఆపడంలో ఫెయిలయ్యారు. ఆసీస్‌లా దగ్గర పెట్టకుండా దూరంగా ఫీల్డర్లను మోహరించి ఈజీగా సింగిల్స్ ఇచ్చేశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అనుకున్న ప్లాన్స్‌ను అనుకున్నట్లుగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో. మరి.. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమికి కారణాలేమని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియా పాలిట విలన్లా మారిన అంపైర్! ఈ ఫైనల్లో కూడా..