iDreamPost

కఠిన చట్టాలు అత్యాచారాలను ఆపుతాయా ?

కఠిన చట్టాలు అత్యాచారాలను ఆపుతాయా ?

రేప్ అనే పదానికి లిటరల్ మీనింగ్ తీసుకున్నట్లయితే బలవంతం లేదా బలాత్కారం అని వస్తుంది. ఇది మహిళల మీద లైంగిక దాడి మాత్రమే కానక్కర్లేదు . ఒక వ్యక్తి మరో వ్యక్తి చేత తన అంగీకారం లేదా ఇష్టం లేకుండా చేయించే ఏ పని అయినా సరే, చివరికి అసత్యం చెప్పమని బలవంత పెట్టడాన్ని కూడా రేప్ అనే అంటారు. కానీ ప్రస్తుతం మహిళలు లేదా పిల్లల మీద జరిగే అత్యాచారాన్ని మాత్రమే రేప్ లేదా బలాత్కారం అని పిలుస్తున్నాము .

అంగీకారం ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ, పద్దెనిమిదేళ్ల లోపు బాలికలతో చేసే లైంగిక చర్యలను రేప్ గానే పరిగణించాలని చట్టం చెబుతోంది. అయితే పదిహేనేళ్ళు పైబడిన భార్య అంగీకారం లేక పోయినప్పటికీ భర్త లైంగికంగా చేసే చర్యలను రేప్ కిందకి పరిగణించబడలేదు

రేప్ బాధితులను దృష్టిలో పెట్టుకుని, వారికి సత్వర న్యాయం జరిగే విధంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా, చరిత్రాత్మకంగా రూపొందించి, అసెంబ్లీలో ఆమోదించ బడిన దిశ చట్టం దేశం మొత్తం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.. దేశంలోని అన్నీ వర్గాల ప్రజలతో పాటు,చాలా రాష్ట్రాలు ఈ వైపుగా అడుగులు వేయాలి అనుకుంటున్నట్లు ప్రతీరోజూ పేపర్లలో, టీవీ లల్లో చూస్తూ ఉన్నాము.

ఈ కొత్త చట్టం ప్రకారం ప్రతీ జిల్లాలో డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించి, వారం రోజుల్లో దర్యాప్తు, మరో వారం రోజుల్లో ఛార్జ్ షీట్, మరో వారం రోజుల్లో శిక్ష ఖరారు , కేవలం 21రోజుల్లో న్యాయం జరిగేలా రూపొందించారు. అంతే కాకుండా ఇప్పటి వరకు నేరస్తులు, వారికి సంబంధించిన వ్యక్తుల పేర్లతో పాటు మిగతా వివరాలు గోప్యంగా ఉంచేవారు. కానీ కొత్త చట్టం ప్రకారం వాటిని బహిర్గతం చేసే వెసులుబాటు కల్పించారు.

నేరస్తులు హైకోర్టుకు అప్పీలు చేసుకునే గడువు ఇప్పటి వరకు ఆరునెలలు ఉండగా, కొత్త చట్టం ద్వారా దానిని కేవలం 45 రోజులకు కుదించారు.

అత్యాచారం, యాసిడ్ దాడులు వంటి శారీరక దాడులే కాకుండా, సోషల్ మీడియా ద్వారా కానీ , డిజిటల్ మాధ్యమాల ద్వారా కానీ మానసికంగా వేధిస్తున్న వారి పైన కూడా ఉక్కు పాదం మోప బోతున్నారు..

మొదటి తప్పుకుగాను రెండేళ్లు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా, రెండవ సారి తప్పుకు గాను నాలుగేళ్ళ జైలు శిక్షతో పాటు ఐదు లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది.

ఇందులోని మెజారిటీ భాగం ఆహ్వానించదగ్గ అవసరం ఉంది. కానీ ధనం, అధికారం, పలుకుబడి లాంటివి ప్రధాన భూమికలు పోషిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తరతమ భేదాలు లేకుండా అమలు పరచవలసిన ఇలాంటి చట్టం వందకి వంద శాతం ఖచ్చితత్వం సాధించటం అనేది ఎంతవరకు సాధ్యం అనేది వేచి చూడాల్సిందే .

ఒక్కశాతం అమాయకులు అన్యాయంగా శిక్షింప బడినా,వాళ్ళ వైపు నుండి ఆలోచిస్తే ఈ చట్టం వంద శాతం విఫలం అయినట్లే.

1860లో మొదటిసారిగా రేప్ ని నేరంగా పరిగనించి IPC లో చేర్చినప్పటి నుండి ఇప్పటివరకు చట్టాన్ని అనేకసార్లు సవరించడం జరిగింది . 1972 మార్చ్ 26న దేశాయ్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఆదివాసీ బాలిక మీద జరిగిన లైంగిక దాడికి గానూ మొదటిసారి సవరించగా ఆ తర్వాత 1978,1983, 2012 నిర్భయ ఘటన, 2018 కతువా ఘటన వరకు తీవ్రతను బట్టి జైలు శిక్ష నుండి మరణశిక్షగా సవరించబడుతూ వచ్చింది.

రేప్ మాత్రమే కాకుండా పనిచేసే చోట వేధించడం, రహస్యంగా నగ్నంగా చూడటం, స్టాకింగ్ మొదలైన వాటిని కూడా నేరాలుగా పేర్కొనడం జరిగింది . సామూహిక అత్యాచారానికి గానూ పదేళ్లుగా ఉన్న జీవిత ఖైదును ఇరవై ఏళ్లుగానూ, యాసిడ్ దాడులకు పదేళ్లు జైలు శిక్షగానూ ,వెంటపడి వేధించే సందర్భాల్లో మూడేళ్ళ వరకు శిక్ష గా చేర్చడం జరిగింది..రేప్ కి మినిమం ఏడేళ్లుగా ఉన్న జైలు శిక్షను పదేళ్లకు పెంచడం జరిగింది . పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలపై జరిగే అత్యాచారాలకు మరణశిక్షగా తీర్మానించడం జరిగింది . ఇప్పుడు మరోసారి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా దిశ చట్టం ప్రవేశ పెట్టడం జరిగింది.

కానీ మహిళలను లేదా చిన్నపిల్లలని రక్షించడం కేవలం ప్రభుత్వం లేదా చట్టాలు, వ్యవస్థల బాధ్యత అనే అభిప్రాయం ప్రజల మనసుల నుండి వైదొలిగి, ప్రతీ ఒక్కరు తమ స్వంత బాధ్యతగా భావించనంత వరకు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా,ఎంత పెద్ద శిక్షలు వేసినా చెప్పుకో దగ్గ ఉపయోగం ఏమీ వుండకపోవచ్చు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి