iDreamPost

ఊపిరి పీల్చుకున్న తెలుగుదేశం

ఊపిరి పీల్చుకున్న తెలుగుదేశం

రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు బ్రేక్ ప‌డ‌టంతో రాయ‌ల‌సీమ‌లోని తెలుగుదేశం ఊపిరి పీల్చుకుంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతున్న నేప‌థ్యంలో స్టే విధిస్తూ సుప్రీం తీర్పు రావ‌డంపై త‌మ్ముళ్లు సంతోషం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల రిజ‌ర్వేష‌న్ల ప్ర‌క్రియ‌పై సుప్రీంకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధిస్తూ ఆదేశాలు ఇవ్వ‌డంతో క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నేత‌లకు ఊపిరి పీల్చుకున్న‌ట్ల‌య్యింది. గ్రామ స్థాయి నుంచి వైసీపీ బ‌లంగా ఉండ‌టంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి తెలుగుదేశం నేత‌లు మాన‌సికంగా సంసిద్దంగా లేర‌న్న‌ది అంతా చ‌ర్చించుకుంటున్నారు. అయితే అధికార పార్టీ మాత్రం ప్ర‌జా మ‌ద్ద‌తుతో ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే గ్రామాల్లో నేత‌లు పోటీ చేయాల్సిన అభ్యర్థుల‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఒక స్థానానికి న‌లుగురైదుగురు పోటీచేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

రాయ‌ల‌సీమ ప్రాంతం ఎప్పుడూ వైసీపీకి కంచుకోటాలానే ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీనేత వైఎస్ జ‌గ‌న్‌పై ప్ర‌జ‌లు చూపిస్తున్న అభిమానం అంద‌రికీ తెలిసిందే. గ‌డిచిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చి రాయ‌ల‌సీమ అభిమానం చాటుకున్నారు. అయితే సీఎం జ‌గ‌న్ కూడా ప్రజా సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తూ ముందుకెళుతున్నారు. రాయ‌ల‌సీమ రైతాంగం బాగుప‌డాల‌ని ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయ‌ల నిధులు విడుదల చేస్తున్నారు. తాజాగా రాయ‌ల‌సీమ ప్రాంతంలో ప్ర‌భుత్వ్ం ద‌శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్‌.డి.ఎస్ (రాజోలి బండ డైవ‌ర్ష‌న్ స్కీం) కుడి కాలువ ప‌నులు చేప‌ట్టేందుకు అనుమ‌తులు ఇచ్చింది. రూ. 1985.42 కోట్ల‌తో ఈప‌నులు చేప‌ట్ట‌నున్నారు. కోసిగి మండ‌లంలోని బాత్రా బొమ్మ‌ల‌పురం వద్ద దీన్ని నిర్మించ‌నున్నారు. జిల్లాలో 166 కిలోమీట‌ర్ల మేర ప్ర‌ధాన కాలువ ప్ర‌వ‌హించి ఉల్చాల‌, జి. శింగ‌వ‌రం మ‌ధ్య ఉన్న క‌ర్నూలు బ్రాంచి కాలువ‌లో ఇది క‌లువ‌నుంది.

దీనివ‌ల్ల మంత్రాల‌యం, ఎమ్మిగ‌నూరు, కోడుమూరు, పాణ్యం, క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప్ర‌త్య‌క్ష్యంగా 40వేల ఎక‌రాలు ప‌రోక్షంగా 30వేల ఎక‌రాల‌కు నీరందే అవ‌కాశం ఉంది. తెలుగుగంగ లైనింగ్ ప‌నులు రూ. 280.27 కోట్ల‌తో చేప‌ట్ట‌నున్నారు. రీటెండ‌రింగ్ పిలిచిన ఈ ప‌నులు త్వ‌ర‌లోనే మొద‌ల‌వ్వ‌నున్నాయి. వీటితో పాటు హంద్రీనీవా కాలువ నుంచి 68 చెరువుల‌కు నీరు ఇచ్చేందుకు రూ. 224.26 కోట్ల‌తో ప్రారంభించిన ప‌నులు ఇప్ప‌టివ‌ర‌కు 40 శాతం మాత్ర‌మే పూర్త‌య్యాయి. అయితే మిగిలిన ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అంతేకాకుండా వేద‌వ‌తి న‌దిపై హాల‌హ‌ర్వి మండ‌లం గూళ్యం వ‌ద్ద ఎత్తిపోత‌ల నిర్మించేందుకు రూ. 1942.80 కోట్ల‌తో సిద్ధ‌మైంది. అనంత‌పురం జిల్లాలో ఉర‌వ‌కొండ నియోజ‌క‌వర్గంలోని 36వ ప్యాకేజీ ప‌నుల‌కు నిధులు కేటాయించింది.

దీంతో దాదాపు 85వేల ఎక‌రాల‌కు సాగునీరు అంద‌నుంది.అలాగే క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో 36వ ప్యాకేజీ ప‌నుల‌కు నిధులు కేటాయించారు. దీంతో పాటు జీడిప‌ల్లి జ‌లాశ‌యం నుంచి మూడు లిఫ్టుల ద్వారా క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గానికి సాగునీరు విడుద‌ల చేసే ప‌నులు ప్రారంభం అవ్వ‌నున్నాయి. అంతేకాకుండా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో జీడిప‌ల్లి నుంచి పేరూరుకు నీరు ఇచ్చేందుకు.. అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులోకి ఎత్తిపోసేందుకు రూ. 591.57 కోట్లు కేటాయించింది. వీటి మ‌ధ్య‌లో 1.3 టీఎంసీల‌తో సోమ‌ర‌వాండ్ల‌ప‌ల్లి, 0.6 టీఎంసీల సామ‌ర్థ్యంతో పుట్ట‌క‌నుమ రిజ‌ర్వాయ‌ర్‌ను నిర్మించ‌నున్నారు.

ఇలా అధికారం చేప‌ట్టినప్ప‌టి నుంచి రాయ‌ల‌సీమ అభివృద్ధి విష‌యంలో త‌న‌దైన శైలిలో సీఎం జ‌గ‌న్ పాల‌న సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఏ ఎన్నిక‌లొచ్చినా తమ‌దే విజ‌యం అని ముందుకు వెళుతోంది. ప్ర‌తిప‌క్ష పార్టీ మాత్రం ఎన్నిక‌ల‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డుతోంది. కేవ‌లం రాజ‌ధాని పేరుతో ఆందోళ‌న‌లు చేయ‌డం త‌ప్ప ఆ పార్టీకి ఇంకేవిధంగా పోరాడేందుకు అవ‌కాశం దొర‌క‌డం లేన‌ట్లు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతోంది. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల్సిన స‌మ‌యంలో ఇలా అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తోంద‌న్న అభిప్రాయం తెలుగుదేశంపై ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా విజ‌యం వైసీపీదే అన్న‌ట్లు క‌నిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి